వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరకాల: కొండా సురేఖకు పరాభవమా?, బిజెపి ఫేవరేట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijayachander Reddy - Konda Surekha
వరంగల్: పరకాల.. తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నిక జరుగుతున్న ఒకే ఒక నియోజకవర్గం. కొండా సురేఖ రాజీనామాతో వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం ఖాళీ అయింది. ఉప ఎన్నికలు జరుగనున్న పద్దెనిమిది నియోజకవర్గాలలో పదిహేడు స్థానాలు సీమాంధ్ర ప్రాంతంలోనే ఉన్నాయి. పదిహేడు నియోజకవర్గాలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులే ఫేవరేట్. వారి విజయాల పైన భారీ బెట్టింగులు కూడా జరుగుతున్నాయి.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలపై సానుభూతి ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి దోహదపడుతోందని అంటున్నారు. ఇటీవల జగన్ అరెస్టు ప్రజల్లో సెంటిమెంటు రేపింది. దీంతో పదిహేడు నియోజకవర్గాలలో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమంటున్నారు. అయితే పరకాల మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్దం. వైయస్, జగన్ సెంటిమెంటు కంటే ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉంటుంది.

ఇక్కడ తెలంగాణవాదం పేరుతోనే అన్ని పార్టీలు బరిలోకి దిగుతున్నాయి. కాంగ్రెసు, బిజెపి, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి అన్ని పార్టీలు తెలంగాణ నినాదం జోరుగా మోగుస్తున్నాయి. జగన్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ కూడా తాను వైయస్ లేదా జగన్ కోసం రాజీనామా చేయలేదని తెలంగాణ కోసమే రాజీనామా చేశానని ప్రచారంలో చెబుతున్నారు. మిగిలిన పార్టీలు మాత్రం సురేఖ జగన్ కోసం రాజీనామా చేశారని ప్రచారం చేస్తున్నాయి.

తెలంగాణవాదం బలంగా ఉన్న దృష్ట్యా పరకాలలో కొండా సురేఖ గెలుపు అంత సులభమేమీ కాదని చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో మహబూబ్‌నగర్‌లో తెలంగాణవాదం బలంగా వినిపిస్తున్న బిజెపి జెండా ఎగురు వేసింది. రెండో స్థానంలో తెలంగాణ సాధన కోసం పుట్టుకొచ్చిన తెరాస నిలిచింది. తెలంగాణపై ఇప్పటి వరకు ఎటూ తేల్చని కాంగ్రెసు, టిడిపిలకు ఘోర పరాభవం ఎదురయింది. తొలి రెండు స్థానాలలో బిజెపి, తెరాస ఉందంటే ఈ ప్రాంతంలో తెలంగాణ తెలంగాణ సెంటిమెంట్ ఎంత బలంగా ఉందో అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

పాలమూరును విశ్లేషిస్తే తెలంగాణ ఓట్లు ఎంతగా చీలినప్పటికీ బిజెపి లేదా టిఆర్ఎస్ మాత్రమే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీ పెట్టి సంవత్సరం దాటినా వైయస్సార్ కాంగ్రెసు తెలంగాణపై ఇప్పటి వరకు తమ వైఖరి ప్రకటించనందున కొండా సురేఖకు అది నష్టం చేకూరుస్తుందని అంటున్నారు. తాను తెలంగాణ కోసమే రాజీనామా చేశానని సురేఖ చెబుతున్నప్పటికీ పార్టీ వైఖరి చెబితే తప్ప ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటున్నారు.

అయితే కొండా సురేఖ మాత్రం తన గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నారు. వైయస్, జగన్ సెంటిమెంట్‌తో పాటు నియోజకవర్గంలో తనకు ఉన్న బలం తనను గట్టెక్కిస్తుందని భావిస్తున్నారు. బిజెపి, తెరాస మధ్య తెలంగాణ ఓట్లు చీలి తనకు లబ్ధి చేకూరుతుందని ఆమె భావిస్తున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కూడా అదే విశ్వాసంతో ఉన్నాయి. బిజెపి, తెరాస విషయానికి వస్తే వీరి మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని విశ్లేషకుల మాట.

ఇప్పటికే బిజెపి పాలమూరులో గెలిచినందున తెలంగాణ కోసం తెరాసకు ప్రత్యామ్నాయంగా మరో పార్టీ ముందుకు వచ్చిందనే భావన ప్రజలలో కలిగిందని అంటున్నారు. ఉప ప్రాంతీయ పార్టీ కంటే జాతీయ పార్టీతోనే తెలంగాణ సాధ్యమనే నినాదాన్ని బిజెపి ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకు వెళుతోంది. బిజెపికి తెలంగాణ ఇష్యు మాత్రమేనని, తమ పార్టీకి తెలంగాణ తప్ప మరో ఇష్యూ లేదని దీనిని గుర్తించిన ప్రజలు తమకే ఓటు వేస్తారని తెరాస చెబుతోంది.

తెలంగాణ జెఏసి తెరాసకు మద్దతు పలికింది. అయితే బిజెపి తరఫున రంగంలోకి దిగిన విజయచందర్ రెడ్డి జిల్లా జెఏసిలో కీలక నేత. దీంతో జెఏసి తెరాసకు మద్దతు పలికినప్పటికీ జిల్లా జెఏసిలో చీలిక ఏర్పడే అవకాశముందని అంటున్నారు. బిజెపికి, తెరాసకు రెండు పార్టీలకు ఓట్లు పడే అవకాశముందని అంటున్నారు. ఇక్కడ బిజెపి, తెరాసలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. అయితే బెట్టింగ్ రాయుళ్లకు మాత్రం బిజెపియే ఫేవరేటంట.

తెరాస కంటే బిజెపి గెలుపు పైనే భారీగా పందేలు కడుతున్నారట. సీమాంధ్రలోని పదిహేడు నియోజకవర్గాలలో వైయస్సార్ కాంగ్రెసు గెలుపు పైన జోరుగా బెట్టింగులు జరుగుతుండగా, పరకాలలో మాత్రం బిజెపి గెలుస్తుందంటూ బెట్టింగ్స్ జరుగుతున్నాయట. రెండో స్థానంలో తెరాస ఉందని అంటున్నారు. పరకాల నుండి 2009లో కొండా సురేఖ, 2004లో బండారి శారా రాణి, 1999లో బి.రాజయ్యలు గెలిచారు.

English summary

 It is said that YSR Congress Party candidate Konda Surekha's win from Parkal is not easy with the effect of Telangana sentiment. BJP candidate Vijayachander Reddy is punders favourite from Parkal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X