వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ 'తెలంగాణ'కు జై!: విజయమ్మ, ఎందుకు తెచ్చానా

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
వరంగల్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవించారని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ శుక్రవారం అన్నారు. ఆమె వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ మనోభావాలు గుర్తించామని జగన్ చెప్పాడని, అమరవీరుల కోసం శ్రద్ధాంజలి కూడా ఘటించాడని, గత ఉప ఎన్నికలలో తెలంగాణ కోసం రాజీనామా చేసిన అభ్యర్థులపై పార్టీ తరఫున పోటీకి నిలబెట్టలేదని విజయమ్మ చెప్పారు.

జగన్ తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నందున కొండా సురేఖకు ఓటు వేసి ఆమెను సీమాంధ్ర ప్రాంతంలోని పార్టీ అభ్యర్థుల కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తన భర్త దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కూడా తెలంగాణకు ప్రాధాన్యత ఇచ్చే వారని, తెలంగాణ వచ్చినప్పుడు వస్తుందని కానీ అప్పటి వరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. అందుకోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారని, ప్రాణహిత - చేవెళ్ల ఆయన మానస పుత్రిక అన్నారు. వైయస్ జగన్ గతంలో వచ్చినప్పుడు కొంత అడ్డంకులు ఎదురయ్యాయని, మళ్లీ జగన్ ఇక్కడకు వస్తాడని చెప్పారు.

వైయస్ చనిపోయినప్పుడు ఆయన మృతిని తట్టుకోలేక వరంగల్ జిల్లాలోనే 78 మంది మృతి చెందారని, వారందరికీ నివాళులు అర్పిస్తున్నానని చెప్పారు. తాను ఇక్కడకు వచ్చే ముందు జైలుకు వెళ్లి జగన్‌ను కలిశానని, తాను ధైర్యంగా ఉన్నానని, బయటకు వస్తానని, భయం వద్దని చెప్పాడని, ప్రజలను కూడా భయపడవద్దని ప్పమన్నాడన్నారు. మీ ప్రేమ ముందు కుట్రలు, కుతంత్రాలు నిలబడవన్నారు. వైయస్ అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఉచిత్ విద్యుత్ ఫైల్ పైన చేశారన్నారు.

రైతుల కోసం ప్రతిక్షణం తపించేవాడన్నారు. మహిళలు, మైనార్టీలు, వృద్ధుల సంక్షేమం పైన దృష్టి సారించేవాడన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకు రావాలని సంకల్పించడమే ఆయన చేసిన తప్పా అందుకే జగన్ పైన విచారణ జరుగుతోందా అన్నారు. వైయస్‌ను రోల్ మోడల్ అన్న కాంగ్రెసే ఇప్పుడు అతనిని దోషిగా చూపించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆయన తనయుడు అయినందుకు వైయస్ జగన్‌ను కూడా దోషిగా చిత్రీకరిస్తున్నారని, చివరకు జైలుకు కూడా పంపారన్నారు. వైయస్ అధికారంలో ఉండగా ప్రభుత్వం కార్యకలాపాలలో జగన్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు.

వైయస్ ముఖ్యమంత్రి కాకముందే జగన్‌కు అనేక వ్యాపారాలు ఉన్నాయని, బెంగళూరులో ఉండి అన్నీ చూసుకునే వారన్నారు. నల్లకాల్వలో ఇచ్చిన మాటపై నిలబడినందుకే కాంగ్రెసు పెద్దలకు నచ్చలేదన్నారు. సాక్షిపై రైడ్, సీజ్, గవర్నమెంట్ యాడ్స్ నిలిపివేత ఇలా వ్యక్తిగత కక్షలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జగన్ బయట ఉంటే తన అభ్యర్థులను గెలిపించుకుంటారనే జైలుకు పంపించారని విమర్శించారు. ఇన్ని రోజులుగా సాక్ష్యులను ప్రభావితం చేయని జగన్ ఇప్పుడు ఎలా చేస్తారని ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తుల పైన, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ పైన, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పైన తదితరులందరి పైనా విచారణ చేయకుండా జగన్ పైనే చేయడమేమిటని ప్రశ్నించారు. జగన్‌ను అరెస్టు ఎందుకు చేశారని మేం అడిగామని, కానీ వారి నుండి సమాధానం లేదన్నారు. మేమేమైనా విదేశీయులమా అని ప్రశ్నించారు. ప్రచారానికి వస్తుంటే తమ సూటుకేసులు కూడా తనిఖీ చేస్తున్నారని, బాధగా ఉందన్నారు.

ఇంత కుట్రపూరితమైన రాజకీయాలను చూసి జగన్‌ను అనవసరంగా రాజకీయాల్లోకి తెచ్చానా అని అనుకున్నానని కానీ, మీ ఆదరణ చూశాక జగన్ రాజకీయ రంగ ప్రవేశం కరెక్ట్ అని భావిస్తున్నానని చెప్పారు. వైయస్ హెలికాప్టర్ ప్రమాదంపై తనకు అనుమానాలు ఉన్నాయని, వాటిని తీర్చాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. వైయస్ మరణంతో ప్రాజెక్టులు అన్నీ ఆగిపోయాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ మృతిని ప్రమాదంగా కొట్టి పారేస్తున్నారని అన్నారు.

అధికార దాహంతో వైయస్‌ను మేమే చంపుకున్నామని పిసిసి చీఫ్ బొత్స చెబుతున్నారని, ఇంత దారుణం ఇంకోటి ఉందా అన్నారు. వైయస్ బతికుండగా నేను ఎప్పుడైనా బయట కనిపించానా అని ఆమె ప్రశ్నించారు. తన భర్త ముఖ్యమంత్రి అంటే తనకు అధికారం ఉన్నట్టు కాదా అని, అలాంటప్పుడు నాకు రాజకీయ దాహం ఎందుకుంటుందని ప్రశ్నించారు. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో నేను మీ ముందుకు వచ్చానని చెప్పారు.

జగన్‌ను అన్యాయంగా అరెస్టు చేశారన్నారు. వైయస్ ద్వారా లబ్ధి పొందిన వారు ఎందరో జగన్‌కు కష్టకాలంలో అండగా నిలబడలేదని, కేవలం కొండా సురేఖ మాత్రమే నిలబడ్డారన్నారు. ఆమె తెలంగాణ కోసమే రాజీనామా చేస్తే ఉద్దేశ్య పూర్వకంగా ఆమోదించలేదని, ఆ తర్వాత రైతులు కోసమంటూ రాజీనామా ఆమోదించారన్నారు. ఈ ఉప ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం అన్నారు.

English summary
YSR Congress party respectory chief and Pulivendula MLA 
 
 YS Vijayalaxmi said her son and party chief YS 
 
 Jaganmohan Reddy will honor the sentiment of Telangana 
 
 people. She campaign at Parkal of Warangal on friday 
 
 along with her daughter Sharmila.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X