• search
  • Live TV
రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రామచంద్రాపురం: తారుమారు, పిల్లి సుభాష్ గట్టెక్కేనా?

By Srinivas
|

Pilli Subash Chandrabose
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గంలో ముగ్గురు సీనియర్ల మధ్య రసవత్తర పోరు నెలకొంది. ఈ నియోజకవర్గం నుండి బరిలో 16 మంది నిలబడినప్పటికీ ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య పోరు నెలకొంది. కాంగ్రెసు తరఫున తోట త్రిమూర్తులు, వైయస్సార్ కాంగ్రెసు తరఫున పిల్లి సుభాష్ చంద్ర బోసు, తెలుగుదేశం పార్టీ నుండి చిక్కాల రామచంద్ర రావులు బరిలో నిలిచారు.
ఇన్నాళ్లూ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్ర బోస్ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచారు. ఇప్పటి దాకా కాంగ్రెస్ వ్యతిరేక పార్టీల అభ్యర్థిగా ఉన్న తోట త్రిమూర్తులు ఈ సారి హస్తం అభ్యర్థిగా మారారు. గతంలో తాళ్ళరేవు నుంచి ఐదుసార్లు వరుస విజయం నమోదు చేసిన చిక్కాల రామచంద్ర రావు టిడిపి అభ్యర్థిగా ఉన్నారు. టిడిపి ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గంలో దాదాపు ప్రతిసారి ముక్కోణపు పోటీయే ఉంటూ వస్తోంది. ఒక బలమైన ఇండిపెండెంట్, రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులుగా పోటీ జరుగుతూ వస్తోంది.

1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా పిల్లి సుభాష్ గెలిచారు. 1994లో త్రిమూర్తులు ఇండిపెండెంట్‌గా గెలిచారు. 1999లో టిడిపి తరఫున మరోసారి బోస్‌పై భారీ మెజారిటీతో గెలిచారు. 2004లో బోస్ ఇండిపెండెంట్‌గా విజయబావుటా ఎగురవేశారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, ప్రజారాజ్యం అభ్యర్థిగా బరిలో దిగిన త్రిమూర్తులును ఓడించారు. త్రిమూర్తులు పార్టీని వీడటంతో రామచంద్రపురంలో టిడిపి 2009లో గుత్తుల సూర్యనారాయణను నిలిపి ఓటమి చవి చూసింది.

దీంతో ఈసారి మాజీ మంత్రి చిక్కాలను బరిలో నిలిపింది. అయితే ఇతను ఈ నియోజకవర్గం నేత కాదు. తోట, పిల్లిల కన్నా చిక్కాల సీనియర్ అయినప్పటికీ.. రామచంద్రాపురం నియోజకవర్గానికి ఆయన కొత్త. తాళ్లరేవు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఐదుసార్లు టిడిపి పార్టీ అభ్యర్థిగా గెలిచిన రికార్డు చిక్కాలకు ఉంది. ఇక్కడ బిసిలకు చెందిన శెట్టి బలిజ ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో కాపులున్నారు. ఇతరులలో కమ్మ వర్గానికి చెందిన వారు పెద్దసంఖ్యలో ఉన్నారు.

ఎస్సీ, ఇతర బిసిల ఓట్లే కీలకం కానున్నాయి. పలుమార్లు ఒకర్నొకరు ఓడించుకున్న త్రిమూర్తులు (కాపు), బోస్ (శెట్టి బలిజ) రెండు పెద్ద సామాజిక వర్గాలవారు కావడం విశేషం. చిక్కాల కూడా కాపువర్గం కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. అయితే, ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచిన టిడిపి రెబల్ గుత్తుల సూర్యనారాయణ బాబు శెట్టి బలిజ కావడంతో సామాజిక వర్గాల మధ్య సమ విభజన జరిగినట్లయింది. చిక్కాల వల్ల త్రిమూర్తులకు కొంత మేర కాపు ఓట్లు తగ్గితే... గుత్తుల వల్ల బోస్‌కు శెట్టి బలిజ ఓట్లు తగ్గే ప్రమాదం ఉంది.

అయితే, ఆయా సామాజిక వర్గాల వారు తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్‌ల వెంటే ప్రధానంగా నిలవనున్నారు. సొంత బలానికి తోడు కాంగ్రెస్ పార్టీ శక్తి జత కావడం వల్ల ఈసారి తనదే విజయమని తోట త్రిమూర్తులు భావిస్తున్నారు. మాటకు నిలబడే వ్యక్తిగా పేరున్న తనకే జనం పట్టం గడతారని పిల్లి గట్టిగా చెబుతున్నారు. వారిద్దరూ రామచంద్రపురానికి చేసిందేమీ లేదని, అవినీతి ఆరోపణలను మూటగట్టుకున్నారని, సచ్ఛీలుడైన చిక్కాలనే గెలిపించాలని టిడిపి ప్రచారం చేస్తోంది.

త్రిమూర్తులును గెలిపిస్తే అభివృద్ధికి తనది భరోసా అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారంలో పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కదిలి రావడంతో త్రిమూర్తులు ప్రచారం జోరుగా సాగుతోంది. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కూడా ప్రచారానికి రానున్నారు. బోస్ తరఫున ఎన్నికల నోటిఫికేషన్‌కంటే ముందుగా జగన్, తర్వాత విజయలక్ష్మి ప్రచారం చేశారు. చిక్కాల తరఫున జిల్లా నేతలంతా చెమటోడుస్తున్నారు.

పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండుసార్లు ప్రచారం నిర్వహించారు. టిడిపికి స్టార్ కంపెయినర్ బాబు ఒక్కరే అయిపోయారు. ఇక్కడ రాజకీయాలు ఎలా ఉన్నా కులాల బలాబలాలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. అందుకే రామచంద్రాపురం ఎన్నికలను కులాల కురుక్షేత్రంగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తుంటారు. కాపు, శెట్టిబలిజ కులాల ప్రాబల్యం ఎక్కువ. మిగిలిన కులాల బలాన్ని ఎవరు బాగా పొందగలిగితే వారినే విజయం వరిస్తుంది. మగ్గురు ప్రధాన అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఇక్కడ పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది.

English summary
Pilli Subash Chandra Bose from YSR Congress, Thota Trimurthulu from Congress and Chikkala Ramachandra Rao from Telugudesam party are contesting in Ramachandrapuram of East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X