హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోరాడుతాం: జగన్ బెయిల్‌పై పార్టీ నేతలు, సిబిఐపై ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Somayajulu - Vasireddy Padma
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుల విషయంలో సిబిఐ మోసపూరితంగా వ్యవహరిస్తోందని... కోర్టులకు తప్పుడు సమాచారం ఇచ్చి వాటిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తోందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సోమయాజులు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, జనక్‌ ప్రసాద్‌తో కలిసి ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

జగన్ బెయిల్ పిటిషన్‌పై విచారణలు ముగిశాక తీర్పు వెలువడనున్న రోజుకు ముందుగా అదనపు చార్జిషీటును దాఖలు చేయడం వెనుక సిబిఐ దురుద్దేశం స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు. జగన్‌కు బెయిల్ రాకపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానిస్తూ... ఈ విషయంలో తాము న్యాయపోరాటాన్ని కొనసాగిస్తామనీ, ఉన్నత న్యాయస్థానానికి వెళతామనీ తెలిపారు. సిఆర్‌పిసిలోని 173 సెక్షన్ ప్రకారం ఒక కేసులో దర్యాప్తు పూర్తయిన తరువాతనే చార్జిషీటు వేయాలనీ, అయితే సిబిఐ అధికారులు మాత్రం తొలి చార్జిషీటు వేసినపుడు మరిన్ని చార్జిషీట్లు వేస్తామనీ, వాటన్నింటిలో జగన్ ప్రధాన నిందితుడుగా ఉంటారని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

సిబిఐ ఎస్‌పి వెంకటేష్, ఆ తరువాత జెడి లక్ష్మీ నారాయణ ఐదారు చార్జిషీట్లు ఉంటాయని చెప్పడాన్నిబట్టే వారు ముందు నుంచే ఎక్కువ చార్జిషీట్లు వేయాలనే దురుద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. అసలు జగన్ కేసులో వేసిన తొలి చార్జిషీటే పూర్తి బోగస్‌దని సోమయాజులు మండిపడ్డారు. కంపెనీలకు భూములు కేటాయించడాన్ని తప్పుగా చూపించారని ఆక్షేపించారు. ఈ రాష్ట్రంలో ఎన్ని కంపెనీలకు భూములు ఇవ్వలేదు? ఎన్ని రాయితీలు ఇవ్వలేదు? అని ఆయన ప్రశ్నించారు. ఐటి రంగం దిగ్గజమైన ఇన్ఫోసిస్ వంటి ఎన్నో కంపెనీలకు తక్కువ ధరకు భూములు కేటాయించినపుడు... ఔషధ రంగంలో అంతే ప్రాముఖ్యత గలిగిన హెటిరో, అరబిందో ఫార్మా కంపెనీలకు నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో స్థలం కేటాయిస్తే తప్పెలా అవుతుందని నిలదీశారు.

ఔషధాల భారీ ఉత్పత్తికి ప్రపంచంలోనే పెద్ద రాజధానిగా రాష్ట్రానికి పేరు తెచ్చిన కంపెనీల్లో అరబిందో ఒకటని గుర్తుచేశారు. వాస్తవానికి ఆ సంస్థలకు ఈ భూముల కేటాయింపు వల్ల జరిగిన లబ్ధి కన్నా వారు సాక్షిలో పెట్టుబడి పెట్టిన మొత్తమే అధికమని వివరించారు. ఇది లంచం అనుకుంటే తక్కువ లాభం వచ్చే పనికి ఎక్కువ మొత్తం ఎవరైనా చెల్లిస్తారా? అని ప్రశ్నించారు. 2006లో సాక్షి విలువ రూ.146 కోట్లుగా జగదీశన్ కంపెనీతో మదింపు చేయించి ఆ తరువాత రూ.3,400 కోట్లుగా చూపారని అదనపు చార్జిషీటులో అభియోగం మోపడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.

2006లో సాక్షి పుట్టనే లేదని, అలాంటి సంస్థకు ఎలా విలువ కడతారని, అది ప్రాజెక్టు రిపోర్టయి ఉండొచ్చునని, ప్రాజెక్టు రిపోర్టును పట్టుకుని అంతర్జాతీయంగా పేరు మోసిన డెలాయిట్ కంపెనీతో రూ.3400 కోట్ల విలువ మదింపు వేయించారని చెప్పడం ఎంత మాత్రం సరికాదన్నారు. డెలాయిట్ కంపెనీ ఇచ్చిన రిపోర్టులో ఇది యాజమాన్యం అంతర్గత వినియోగం కోసం మాత్రమేనని, ఎవరూ పెట్టుబడులు పెట్టడం కోసం కాదని స్పష్టంగా పేర్కొందన్నారు. అయినా దీని ఆధారంగా తాము సాక్షిలో పెట్టుబడులు పెట్టి మోసపోయామని ఎవరైనా ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు. అక్కడేదో జరిగిందని సిబిఐ తనకు తానుగా భావించి దర్యాప్తు చేస్తోందని విమర్శించారు.

వాస్తవానికి ఒక కంపెనీ రాష్ట్రానికి రావడం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే ఎంత తక్కువ ధరకైనా వారికి భూములివ్వవచ్చు, ఎన్ని రాయితీలైనా ఇవ్వవచ్చునని సోమయాజులు సమర్థించారు. చంద్రబాబు నాయుడు హయాంలో కూడా తక్కువ ధరకు భూములను కేటాయించారనీ, తన ఊరువాడైన ఓ వ్యక్తి స్థాపించిన (లక్ష రూపాయల మూలధనం కూడా లేని) ఐఎంజి భారత్ అనే కంపెనీకి ఎకరం రూ.50 వేలకే భూములు కేటాయించారనీ చెప్పారు. ఈ అంశాలపై సిబిఐ అందరినీ తప్పుదోవ పట్టిస్తూ చార్జిషీట్లు వేస్తూ పోతోందని విమర్శించారు.

అసలు కేసు దర్యాప్తు ప్రారంభించిన 280 రోజుల తరువాత జగన్‌ను విచారణపేరుతో పిలిచి అరెస్టు చేయడం ఏ మాత్రం సరికాదన్నారు. జగన్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని అరెస్టు చేయలేదనీ... ప్రజలను ప్రభావితం చేస్తాడని భయపడినట్లుగా ఉందని చెప్పారు. అసలు సీబీఐ దర్యాప్తు మొత్తం ప్రధాని కార్యాలయం కనుసన్నల్లో జరుగుతోందనీ సోమయాజులు విమర్శించారు.

English summary
YSR Congress party leaders Somayajulu and Vasireddy Padma responded on YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy's bail reject. They said that it is unfortunate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X