• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నాని జంప్: బాలకృష్ణతో బాబు, జగన్‌పై టిడిపి నిప్పులు

By Srinivas
|

Chandrababu Naidu - Balakrishna
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హీరో నందమూరి బాలకృష్ణతో బుధవారం రాత్రి భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. గుడివాడ శాసనసభ్యుడు నాని పార్టీ మార్పు, జూ.ఎన్టీఆర్ విలేకరుల సమావేశం తదితర అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది. బిసి డిక్లరేషన్ విడుదల మంచి ప్రయత్నమని, ఎన్టీఆర్ హయాంలో మాదిరిగా బిసిల ఆదరణ పొందేందుకు ప్రయత్నం చేస్తే బాగుంటుందని చర్చించినట్లుగా తెలుస్తోంది. అమెరికా, దుబాయ్‌లలో ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి విరాళాల సేకరణ కోసం వెళ్లి వచ్చిన బాలకృష్ణ ఆ వివరాలను బాబుతో పంచుకున్నారు.

కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని, గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానిని తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రన్నాయుడు, నామా నాగేశవర రావు బుధవారం మండిపడ్డారు. చేతిలో డబ్బులు దండిగా ఉన్నాయని కోట్లు గుమ్మరించి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ఏం నీతి అని జగన్‌ను నిలదీశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ వైపు చేర్చుకోవడానికి దివంగత వైయస్ మొదలు పెట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌ను ఇప్పుడు జగన్ కొనసాగిస్తున్నారని విమర్శించారు.

ఒక సామాజిక బాధ్యతతో టిడిపి బీసీ వర్గాల సమస్యలపై చర్చిస్తున్న సమయంలో జగన్ పార్టీ ఈ ఫిరాయింపుల కార్యక్రమానికి తెర లేపిందని, ఎన్టీఆర్ భవన్‌కు రావాల్సిన టిడిపి ఎమ్మెల్యేలను లోటస్‌పాండ్‌కు, చంచల్‌గూడ జైలుకు తిప్పారని ఆరోపించారు. బీసీ వర్గాలపై టిడిపి చర్చిస్తుంటే జగన్ పార్టీలో ఎంత అసహనం ఏర్పడుతుందో అనడానికి ఇదే నిదర్శనమని, టిడిపి బీసీ ఎజెండా అన్ని పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోందని, కాంగ్రెస్‌లో కూడా బీసీలకు వంద సీట్లు ఇవ్వాలని ఆ పార్టీ నేత హనుమంత రావు పార్టీ అధ్యక్షురాలిని కోరారని అన్నారు.

నియోజకవర్గాల వారీగా బీసీ సమావేశాలు నిర్వహించాలని వైయస్సార్ కాంగ్రెసు నిర్ణయించిందని, బీసీ ఎజెండాను పక్కదోవ పట్టించడానికే సరిగ్గా అదే రోజు కొడాలి నాని ఫిరాయింపు వ్యవహారాన్ని జగన్ పార్టీ నడిపించిందని ఎర్రన్నాయుడు ఆరోపించారు. వైయస్సార్ దేవుడని, గుడివాడలో ఇళ్ళ స్ధలాలకు స్ధలం ఇచ్చారని నాని ఇప్పుడు అంటున్నారని, అదే నిజమైతే వైయస్ బతికి ఉన్నప్పుడు నాని ఆయనకు వ్యతిరేకంగా టిడిపి టిక్కెట్టుపై ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచారని అంటున్నారని, అదే చంద్రబాబు వద్ద నాని రెండుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్టు తీసుకొని పోటీచేసి ఎందుకు గెలిచావని మండిపడ్డారు. అప్పుడు వెన్నుపోటు గుర్తుకు రాలేదా అన్నారు.

ఉప్పులేటి కల్పన ఓడిపోయినా వరుసగా రెండుసార్లు టిక్కెట్టు ఇచ్చామని, ప్రతిభా భారతిని పొలిట్‌బ్యూరో నుంచి మార్చాలని అనుకొన్నప్పుడు కల్పనకు ఆ అత్యున్నత విధాయక సంఘంలో చోటిచ్చామని.. ఇది నిర్లక్ష్యం చేయడమేనా అని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు నేతలు లోటస్‌ పాండ్‌లో రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌నే నాని చదువుతున్నారని నామా నాగేశ్వర రావు విమర్శించారు.

English summary
Telugudesam Party senior leader Errannaidu lashed out at YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy and Gudiwada MLA Kodali Nani on wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X