హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలయ్య, రావి: నాని ఎఫెక్ట్‌తో గుడివాడపై తర్జన భర్జన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna
విజయవాడ: శాసనసభ్యుడు కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు వెళ్లడంతో తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు స్వగ్రామం నిమ్మకూరు ఉన్న గుడివాడ నియోజకవర్గంపై తొలి నుండి టిడిపియే గెలుస్తూ వస్తోంది. 1989లో ఒక్కసారి మాత్రం కాంగ్రెసు గెలిచింది. అంతకుముందు ఆ తర్వాత ఎన్టీఆర్, రావి కుటుంబ సభ్యులు, కొడాలి నాని తదితరులు ఆ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నారు.

తాజాగా నాని జగన్‌కు జై కొట్టి టిడిపికి పెద్ద షాక్ ఇచ్చారు. దీంతో గుడివాడ నియోజకవర్గ టిడిపి సారథ్యం విషయంలో పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకునే దిశగా పావులు కదుపుతోంది. నాని జగన్ పార్టీలో చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైనప్పటికీ అది ఎప్పుడు, ఎలా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. నాని, వైయస్సార్ కాంగ్రెసు నాయకులు విజయమ్మ, జగన్‌లను కలవడంతో క్షణాల్లో పార్టీ అధిష్ఠానం అతన్ని సస్పెండ్ చేసి తమ వైఖరిని వెల్లడించింది.

మరోవైపు నాని వర్గీయులు, టిడిపి వర్గాలు పరస్పర దూషణలతో దూరంగా జరిగాయి. బుధవారం నాని మీడియా సమావేశంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై పరుషపదజాలాలతో మండిపడ్డారు. తాను టిడిపిని వీడనున్నట్టు సంకేతాలు ఇచ్చారు. మరోవైపు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, జగన్‌లను ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా నానికి బాసటగా ఉన్న గుడివాడ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల్లో చీలిక అనివార్యమైంది. ప్రస్తుతానికి రెండు పక్షాలకు చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు తమతమ అభిప్రాయాలను బహిరంగపర్చారు.

మరికొందరు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో కొడాలి నాని నాయకత్వంలో వైయస్సార్ కాంగ్రెసు గుడివాడ నియోజకవర్గంలో పటిష్టం కానుంది. గతంలో ముదినేపల్లి నియోజకవర్గంలో ఉండి అది రద్దయ్యాక గుడివాడ నియోజకవర్గంలోకి వచ్చిన నందివాడ, గుడ్లవల్లేరు, గుడివాడ రూరల్ మండలంలోని సగ భాగం కాంగ్రెస్, టిడిపిలకు కీలకం. నాని 2004లో పాత గుడివాడ నియోజకవర్గం నుంచి గెలవగా, 2009లో కొత్తగా ఏర్పాటయిన గుడివాడ పట్టణం, గుడివాడ రూరల్‌ మండలం, గుడ్లవల్లేరు, నందివాడ మండలాల నుంచి రెండో పర్యాయం గెలిచారు.

అప్పట్లో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న గుడ్లవల్లేరు, నందివాడ మండలాలు తెలుగు దేశానికి అనుకూలంగా మార్చడానికి కొడాలి నాని వ్యూహం ఫలించిందని చెబుతారు. అదే రెండోసారి ఆయన విజయానికి దోహదపడిందని చెప్పవచ్చు. దీన్ని బట్టి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పటిష్ఠతకు నాయకులను సమీక్షించడం, కార్యకర్తలను చైతన్యపర్చడంలాంటి వ్యూహాలతో తెలుగుదేశం పార్టీకి కొడాలి నాని గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

గుడివాడ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జిగా గట్టి నాయకుడ్ని తీసుకువచ్చి బహిరంగ సభ పెట్టి ప్రజలకు పరిచయం చేస్తామంటూ బందరు ఎంపి కొనకళ్ళ నారాయణ మంగళవారం గుడివాడలో నిర్వహించిన పార్టీ జిల్లా సమావేశంలో ఆర్భాటంగా ప్రకటించారు. నాని టిడిపిని వీడడంతో ఆ పార్టీకి నాయకత్వ బెడద సమస్యగా మారింది. ఈ నేపధ్యంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావును నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించేందుకు అదిష్ఠానం కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం.

అయితే 2004లో అకారణంగా రావి వెంకటేశ్వర రావుకు టిక్కెటు నిరాకరించిన చంద్రబాబు వైఖరి పట్ల రావి శోభనాద్రి కుటుంబం ఇప్పటికీ గుర్రుగానే ఉందట. జూనియర్ ఎన్టీఆర్ చొరవతో 2004లో టిక్కెట్టు చేజారడంతో రావి వెంకటేశ్వర రావు రాజకీయాలను వదిలి వ్యాపార రంగంలో స్పీడ్ అయ్యారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావించడంతో ఆ పార్టీ అభ్యర్థిగా గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు.

నానిపై ఓటమి పాలైన రావి తదుపరి మళ్ళీ రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారు. ప్రస్తుతం గుడివాడ నియోజకవర్గ టిడిపి పగ్గాలు రావికి అప్పగించాలనే యత్నంలో అధిష్ఠానం కసరత్తు చేస్తునట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు టిడిపి రాష్ట్ర వైద్యవిభాగం అధ్యక్షుడు పేరు కూడా వినిపిస్తోందట. ప్రధానంగా సినీ హీరో, చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణను గుడివాడ ఇన్‌ఛార్జిగా నియమించి టిడిపి పట్టు సడలకుండా ఉంచాలనే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే నాని లాంటి చిన్న చేపపై బాలయ్యను ప్రయోగించడం అంత అవసరం లేదనే వారు కూడా ఉన్నారని అంటున్నారు. మరి చివరకు ఎవరు ఖరారవుతారో చూడాలి.

English summary
It is said that Telugudesam Party chief Nara Chandrababu Naidu is thinking to appoint Raavi Sobhanadri family member as Gudiwada party incharge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X