చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తారలకు అడుగులేయడం నేర్పిన నాట్యాచార్యుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Vempati Chinsatyam
చెన్నై: ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు పద్మభూషణ్ వెంపటి చినసత్యం (82) కన్నుమూశారు. కాలానికి అనుగుణంగా కూచిపూడి నృత్యానికి శాస్త్రయ పంథాలో మార్పులు చేసి దేశవిదేశాలలో ప్రశంసలు అందుకున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యం పరిస్థితి 15 రోజుల క్రితం మరింత క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేయించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు చెన్నైలో సోమవారం జరగనున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో వరలక్ష్మమ్మ, చలమయ్య దంపతులకు 1929 అక్టోబరు 25న సత్యం జన్మించారు. వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, తాడేపల్లి పేరయ్యల వద్ద నాట్యంలో శిక్షణ పొందారు. చిన్నవయసులో ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో కలిసి నాటకాలు వేశారు. కూచిపూడి నాట్యాన్ని దేశ, విదేశాలలో విస్తరింపచేసి ఆ నృత్యరీతికి గిన్నిస్ బుక్‌లో చోటుకల్పించారు. అమెరికా, రష్యా, ప్యారిస్, లండన్, దుబాయ్ లాంటి అనేక దేశాలలో తన శిష్యులతో కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించారు. మంజుభార్గవి, చంద్రకళ, వైజయంతీమాల, హేమామాలిని, యామిని కృష్ణమూర్తి, శశికళ వంటివారు ఆయన వద్దే శిక్షణ పొందారు.

కేంద్ర మంత్రి పురందేశ్వరి సైతం ఆయన శిష్యురాలే. 1978లో ఆయన టీటీడీ ఆస్థాన నాట్యాచారుడిగా పనిచేశారు. 1980లో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ కళాప్రపూర్ణ, డాక్టరేట్, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం 'డి'లిట్‌తో ఆయన్ను గౌరవించాయి. ఆంధ్రప్రదేశ్ నృత్య అకాడమీ భరత కళాప్రపూర్ణతో, భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో ఆయన ప్రతిభకు పట్టంగట్టాయి! కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు, కాళిదాస సన్మాన పురస్కారం అందుకున్నారు.

ఎన్నో సినిమాలకు ఆయన నృత్యదర్శకత్వం వహించారు. 'నర్తన శాల' చిత్రంలో ఎన్టీఆర్ చేసిన బృహన్నల పాత్రకు నృత్య రీతులు సమకూర్చింది ఆయనే. 1963లో చెన్నైలో కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఏర్పాటుచేశారు. 15 నృత్యరూపకాలకు, 150కిపైగా ఏకాంకికలకు రూపకల్పన చేశారు. తన గురువుగారికి ఇచ్చిన మాట ప్రకారం నాట్యశిక్షణను డబ్బుతో ముడిపెట్టకుండా కళారాధనకే జీవితం అంకితం చేసిన వెంపటి చిన సత్యం మృతి తెలుగునాట్యకళారంగానికి తీరనిలోటు.

చినసత్యం ఇకలేరన్న వార్త తెలియగానే ప్రముఖ నటీమణులు.. ఆయన శిష్యులు అయిన ప్రభ, మంజుభార్గవి కన్నీరుమున్నీరయ్యారు. చెన్నైలోని ఆయన ఇంటికి చేరుకుని నివాళులర్పించారు. చంద్రమోహన్ సహా పలువురు ప్రముఖులు ఆయన భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. కాగా.. వెంపటి చినసత్యం మృతి కళారంగానికి తీరని లోటు అని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కూచిపూడి నాట్యానికి సమున్నత గుర్తింపును తెచ్చేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కూచిపూడి కళను ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన ఘనత వెంపటి చినసత్యం మృతి పట్ల వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి కళారంగానికి తీరనిలోటని అఖిల భారత కూచిపూడి కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్, కూచిపూడి కళాపీఠం ప్రిన్సిపాల్ వేదాంతం రామలింగశాస్త్రి, ప్రముఖ నాట్యాచార్యులు రాధేశ్యామ్, శ్రీనివాసులు, పలువురు కళాకారులు, కళాభిమానులు పేర్కొన్నారు.

English summary
Kuchipudi Natyacharya Vempati Chinsatyam passed away in Chennai. He dedicated his life to Kuchipudi dance world wide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X