• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నీలిమ మృతి: ఈ మెయిళ్లను పరిశీలిస్తున్న పోలీసులు

By Pratap
|

Neelima
హైదరాబాద్: ఇన్ఫోసిస్ కార్యాలయంపై నుంచి దూకి మరణించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నీలిమ మృతి మిస్టరీని ఛేదించే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మృతికి ముందు ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి ప్రశాంత్, సంస్థలోని ఇతర స్నేహితులకు పంపిన ఈ మెయిళ్లను పోలీసులు తెరిచి చూశారు. ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత వేర్వేరు సమయాల్లో ప్రశాంత్ అనే టెక్కీకి పంపిన ఈ మెయిళ్ల జాబితాను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మెయిళ్లే ఆమె మృతి మిస్టరీని ఛేదించే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.

జులై 31వ తేదీన ప్రశాంత్‌కు నీలిమ ఆఖరి ఈ మెయిల్ పంపినట్లు, అందులో ప్రశాంత్‌ను పండుగా సంబోధిస్తూ మరు జన్మలోనైనా కలిసి ఉందామంటూ రాసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతకు ముందు జులై 30వ తేదీ రాత్రి 8 గంటలకు తన సహోద్యోగులు ఏడుగురికి నీలిమ ఈ మెయిళ్లు పంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అందులో ఇదే తన ఆఖరి పనిదినమంటూ రాసిందని పోలీసులు గుర్తించినట్లు వార్తలు వచ్చాయి.

పండును తాను మిస్సవుతున్నానని కూడా ఆమె రాసినట్లు తెలుస్తోంది. టీవీ చానెళ్లు కొన్ని ఆమె ప్రశాంత్‌కు పంపిన ఈ మెయిళ్ల సారాంశాన్ని ప్రసారం చేశాయి. వాటి ప్రింటవుట్లను చూపించాయి. మృత్యు ఒడిలోకి చేరిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నీలిమ హైదరాబాదులోని గచ్చిబౌలిలో గల ఇన్ఫోసిస్ కార్యాలయానికి ఎందుకు వెళ్దిందనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో నీలిమ ప్రశాంత్‌తో కలిసి పనిచేసింది. ప్రశాంత్ నుంచి స్పందన రాకపోవడంతో ఆమె మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు.

మంగళవారం సాయంత్రం కార్యాలయానికి వెళ్లిన ఆమె తెల్లారేసరికి రక్తం మడుగులో శవమై తేలింది. మూడు వారాలు సెలవు పెట్టి నీలిమ అమెరికా నుంచి హైదరాబాదు వచ్చింది. అందువల్ల ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఆమెకు ఏమీ లేదు. జులై 22వ తేదీన హైదరాబాదు వచ్చిన ఆమె హైదరాబాదులోని ఆఫీసుకు అంత వరకు వెళ్లలేదు.

హైదరాబాదుకు వచ్చిన పది రోజుల తర్వాత ఇన్ఫోసిస్ కార్యాలయానికి వచ్చిన ఆమె పాత మిత్రులను ఎవరినీ కలుసుకోలేదని చెబుతున్నారు. ఆమె బ్లాక్ 18లోకి వెళ్లినట్లు సిసిటివీ కెమెరాల చిత్రాల ద్వారా తెలుస్తోంది. అక్కడ ఆమె చేస్తున్న ప్రాజెక్టుకు సంబంధించిన పని కూడా ఏమీ లేదని చెబుతున్నారు. నిజానికి, హైదరాబాదులో నీలిమ చేసిన ప్రాజెక్టుకు సంబంధించిన పని ఏదీ లేదు. ఆ ప్రాజెక్టులో పనిచేస్తున్నవారు అమెరికాకు, పూణేకు చెందినవారేనని తెలుస్తోంది.

ఆ రాత్రి ఆమె తన కారును కూడా తీసుకుని రాలేదని చెబుతున్నారు. సిసిటివీ కెమెరా చిత్రాలను బట్టి చూస్తే ఆమె చాలా ఆనందంగా ఉన్నట్లు కనిపించింది. హైదరాబాద్ ఇన్ఫోసిస్ కార్యాలయానికి ఆమె ఎందుకు వెళ్లిందనేది తెలిస్తే మృతి మిస్టరీ విడిపోతుందని అంటున్నారు. నీలిమ మంగళవారం రాత్రి 8.36 నిమిషాలకు తన వద్ద ఉన్న ఐడీ కార్డ్‌ను స్క్రాచ్ చేసి కంపెనీలోకి వెళ్ళిన ఆధారాలను సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్టు డిసిపి యోగానంద్ శుక్రవారం తెలిపారు. 9.30 నిమిషాలకు కంపెనీలోని బిల్డింగ్ నెంబర్ 18, 19లోకి వెళ్లినట్టు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించామన్నారు. 10.29 నిమిషాలకు మల్టీలెవల్ పార్కింగ్ వద్ద పెద్ద శబ్దం వచ్చిందని, అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ పీఎస్.రమేష్ ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించాడని చెప్పారు.

ఈ విషయాన్ని వెంటనే సెక్యూరిటీ అధికారి యాజమాన్యానికి తెలియజేశాడని, కంపెనీ అంబులెన్స్ సహాయంతో నీలిమను ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది రమేష్, సురేష్‌సింగ్, వెంకటేష్ ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పారు. రాత్రి 10.37 నిమిషాలకు ఈ విషయం తెలుసుకున్న రాయదుర్గం పోలీసులు 11 గంటల సమయంలో సంఘటన స్థలానికి వెళ్లారని ఆయన తెలిపారు. నీలిమ బిల్డింగ్ నెంబర్ 18,19లో తిరిగినట్టు సీసీ కెమెరాల ఆధారంగా తెలిసిందన్నారు. ఆమె వెంట తెచ్చుకున్న హ్యాండ్‌బ్యాగ్ పదో అంతస్థులో పడి ఉన్నట్టు చెప్పారు. ఏడో అంతస్థులో ఆమె కాలి చెప్పును, తెల్లని పైపుపై మరకలను గుర్తించామని డీసీపీ తెలిపారు.

నీలిమ బ్యాగ్‌లోని ఫోన్ నెంబర్ స్లిప్‌ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆ నెంబర్ల ఆధారంగా బంధువులకు సమాచారం అందించినట్టు ఆయన తెలిపారు. నీలిమ హత్యకు గురైందా..లేదా దూకి మరణించిదా అనే విషయాన్ని మీడియా ప్రతినిధులు అడగ్గా డీసీపీని అడగగా, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిర్ధారణ అవుతుందని ఆయన చెప్పారు. కంపెనీలో ఏర్పాటు చేసిన 14 సీసీ కెమెరాలను పరిశీలించి నీలిమ ఎటువైపు వెళ్లిందోనన్న డాటాను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. దీంతో పాటు ఫొరెన్సిక్ నిపుణులు ఇచ్చే నివేదికను పరిశీలిస్తామని చెప్పారు. ప్రస్తుతం నీలిమది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.

English summary
Police got Neelima's E-mails. When B Neelima walked into Infosys campus in Gachibowli on Tuesday night only to be found in a pool of blood a couple of hours later, she left a trail of questions behind. While there were many clues found scattered in the IT major's parking lot, a twist in Neelima's mysterious death surfaced on Friday when it turned out that the techie was in India on a three-week leave and had no reason to be on campus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X