టెక్కీ నీలిమ మృతి: దర్యాప్తు వద్దన్న ఫ్యామిలీ

తన భర్త సురేష్ రెడ్డికి పంపిన ఇ - మెయిల్లో నీలిమ తన మిత్రుడు, టెక్కీ బి. ప్రశాంత్‌కు క్లీన్ చిట్ ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు. ఈ విషయాన్ని సురేష్ రెడ్డితో పాటు నీలిమ కుటుంబ సభ్యులు తమకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అమెరికాలో ఇంటికి 500, ప్రశాంత్‌కు 4,000 ఇవ్వాల్సి ఉందని తన భర్తకు నీలిమ పెట్టిన మెయిల్లో తెలిపింది. అయితే, ఆమె ఏ కరెన్సీలో ఇవ్వాలనే విషయాన్ని చెప్పలేదు. బహుశా డాలర్లలో చెల్లించాల్సి ఉందనేది ఆమె అభిప్రాయం కావచ్చునని అంటున్నారు.
నీలిమకు ప్రశాంత్ అనే మిత్రుడు ఉన్నట్లు తనకు తెలుసునని, గత ఏడాదిన్నర కాలంలో ఆమె జన్మదినం కోసం తాను అమెరికా వెళ్లాలనని, అప్పుడు మిగతా మిత్రులతో పాటు ప్రశాంత్‌ను నీలిమ తనకు పరిచయం చేసిందని సురేష్ చెప్పినట్లు పోలీసులు అంటున్నారు. అయితే, ప్రశాంత్ గురించి అంతకు మించి తెలియదని సురేష్ రెడ్డి చెప్పినట్లు వారు అంటున్నారు.
మృతికి ముందు ప్రశాంత్‌కు నీలిమ చాలా మెయిల్స్ పంపినట్లు, సురేష్ రెడ్డికి ఒకే ఒక మెయిల్ పంపినట్లు కాల్ డేటా రికార్డును సేకరించిన తర్వాత, ఇ మెయిల్స్ చూసిన తర్వాత తెలిసిందని పోలీసులు చెబుతున్నారు. మరణానికి సెకన్ల ముందు సురేష్‌కు నీలిమ మెసేజ్ పంపిందని, అయితే తన మెసేజ్ బాక్స్ నిండిపోవడంతో తాను ఆ ఎస్ఎంఎస్ను చూడలేకపోయానని సురేష్ చెప్పాడని వారంటున్నారు.
ఆత్మహత్య చేసుకోవడానికే ఆమె ఇన్ఫోసిస్ కార్యాలయానికి వెళ్లిందని పోలీసులు దర్యాప్తు అనంతరం ఓ నిర్ధారణకు వచ్చారు. ఆత్మహత్యకు గల కారణాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రశాంత్‌కు, నీలిమకు మధ్య గల సంబంధాలపై వారు ఆరా తీస్తున్నారు. అలాగే, నీలిమ లాప్‌ట్యాప్ నుంచి వివరాలు కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు.