వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీరావు భూముల మాటేమిటి?: జగన్ పార్టీ నేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gattu Ramachandra Rao
హైదరాబాద్: వాన్ పిక్ భూములలో అరక దున్నుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రామోజీ ఫిలిం సిటీ భూములను ఎప్పుడు దన్నుతారో చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు ప్రశ్నించారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు అధికారం పిచ్చి పట్టుకుందని.. అందుకే అవాస్తవాలు ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ పిచ్చి పట్టించే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పరిశ్రమలకు, సెజ్‌లకు భూములను కేటాయించే విషయంలో చంద్రబాబు విధానం ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రానికి పరిశ్రమలు రావాలా.. వద్దా? సెజ్‌లు అవసరమా.. లేదా? అవి కావాలంటే ప్రభుత్వం భూములను కేటాయించాలా.. వద్దా? చంద్రబాబు స్పష్టంగా చెప్పాలన్నారు. వాన్‌పిక్ భూములను దున్నుతున్న బాబు అక్కడికే పరిమితమవుతారా? లేక ప్రభుత్వం పరిశ్రమలకు, సెజ్‌లకు కేటాయించిన భూములన్నింటినీ దున్నుతారా? రామోజీ ఫిలింసిటీ భూముల మాటేమిటని ప్రశ్నించారు. తన తొమ్మిదేళ్ల పరిపాలనలో పరిశ్రమలకు కేటాయించిన స్థలాలను బాబు ఏం చేస్తారన్నారు.

రామోజీ ఫిలిం సిటీకి రెండువేల ఎకరాల భూమిని కొనుగోలు చేయడానికి అనుమతించిన బాబు.. వాన్‌పిక్‌కు భూములను కేటాయించడాన్ని ఎందుకు తప్పు పడుతున్నారని ప్రశ్నించారు. ఈనాడు రామోజీరావు ఆనాడు గొర్రెల పెంపకం కోసం అని ఎకరా ఐదారు వేల రూపాయలకు కారుచౌకగా కొనుగోలు చేశారని, అప్పుడు తప్పుగా అనిపించనిది.. ఇప్పుడు వాన్‌పిక్ విషయంలోనే ఎందుకు తప్పుగా అనిపిస్తోందో చెప్పాలన్నారు.

బాబుకు వ్యవస్యాయం గురించి తెలుసా అని ప్రశ్నించారు. ఇప్పుడు రైతు వేషం వేస్తే సరిపోదన్నారు. వాన్‌పిక్ సంస్థ తమ భూములను కొనుగోలు చేసినా.. వాటిని స్వాధీనం చేసుకునే వరకూ తమను వ్యవసాయం చేసుకోనిచ్చిందని.. తమకు ఎలాంటి ఇబ్బందీ లేదనీ స్థానిక రైతులు చెబుతున్నా.. బాబు మాత్రం విరుద్ధంగా మాట్లాడుతున్నారు. బాబుకు అధికారం లేక పూర్తిగా నిరాశా నిస్పృహల్లో ఉన్నారన్నారు. చంద్రబాబు తన పరిపాలనలో తన బినామీలకు మేలు జరిగేలా నిజాం, పాలేరు షుగర్స్ వంటి ప్రభుత్వ సంస్థలన్నింటినీ కారు చౌకగా అమ్మేశారని ఆరోపించారు.

మాల మాదిగల ఐక్యతను దెబ్బతీయడానికే చంద్రబాబు వర్గీకరణ అంశాన్ని లేవనెత్తుతున్నారని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌ రావు వేరుగా ఆరోపించారు. ఇప్పటికైనా దళితులు ఐక్యంగా ముందుకు సాగుతూ రాజ్యాధికారాన్ని సాధించి రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత దళితులపై మానసిక దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. సుప్రీం కోర్టు వర్గీకరణను కొట్టివేసినప్పటికీ అదే అంశాన్ని మళ్లీ లేవనెత్తడం దుర్మార్గమన్నారు.

బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగిన మాల మృతవీరుల సంస్మరణ సభలో జూపూడి ప్రసంగించారు. లక్ష్మీపేట మారణకాండ విషయంలో పిసిసి చీఫ్ బొత్సపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని, జిల్లా మంత్రి, సిఎం కూడా బాధ్యులని జూపూడి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాలల జేఏసీ చైర్మన్ బి.దీపక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

English summary

 YSR Cogress spokes person Gattu Ramachandra Rao has questioned Telugudesam party chief Nara Chandrababu Naidu about Ramoji Film City lands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X