హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ జైలు: సిబిఐపై విరుచుకుపడిన సాక్షి డైలీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sakshi Media
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి డైలీ మరోసారి సిబిఐపై తీవ్రంగా ధ్వజమెత్తింది. జగన్‌కు బెయిల్ రాకుండా కుట్ర చేస్తోందంటూ విరుచుకుపడింది. ఈ మేరకు సాక్షి డైలీ బుధవారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది.

ఆ వార్తాకథనం ఇలా సాగింది - అవసరం లేని సమయంలో అరెస్టు చేయటం ఒకెత్తయితే... అరెస్టు చేశాక బెయిలు దొరక్కుండా రకరకాల ప్రయత్నాలు చేయటం మరొక ఎత్తు! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో గత 100 రోజులుగా జరుగుతున్న.. అంతకుముందు జరిగిన పరిణామాల్ని చూసినపుడు అసలు ఒక కుట్రకు ఎలా బీజం పడుతుందో అందులో ఎంతమంది పాత్రధారులుంటారో వారు ఎలా పావులు కదుపుతారో స్పష్టంగా తెలియకమానదు. దాన్నొక్కసారి గమనిస్తే... ‘‘ఇంకొద్ది రోజుల్లో జగన్ జైలుకు వెళతారు'', ‘‘ఇక జగన్ పని జైలుపాలే...'',‘‘నాలుగు రోజుల్లో ఆయన కటకటాల వెనక్కి వెళ్లాల్సి వస్తుంది'' -ఇవీ.. ఈ ఏడాది మే నెలలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సహా పలువురు నేతలు అదే పనిగా చేసిన వ్యాఖ్యలు.

ఆ వార్తాకథనం ఇంకా ఇలా సాగింది - ఇవన్నీ ఒక లోతైన కుట్రకు బీజాలని ముందే గ్రహించిన జగన్‌మోహన్‌రెడ్డి.. తనను అరెస్టు చేయొచ్చని అప్పట్లోనే సందేహించారు. దాన్ని బహిరంగంగానూ చెప్పారు. ఉప ఎన్నికలు ఇంకా 15 రోజుల్లో ఉన్నాయని, తనను అరెస్టు చేస్తే ప్రచారానికి దూరమవుతానని, అది తమ పార్టీ విజయావకాశాల్ని ప్రభావితం చేస్తుంది కనక ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ కోర్టును కూడా ఆశ్రయించారు. ‘‘సీబీఐ పిలిచింది మిమ్మల్ని విచారించడానికే. నోటీసిచ్చింది కూడా అందుకే. చార్జిషీటును విచారణకు స్వీకరించే సందర్భంగా తన ముందు హాజరు కావాలంటూ జగన్‌మోహన్‌రెడ్డికి కోర్టు ఇప్పటికే సమన్లు ఇచ్చింది. ఆయన కోర్టు ముందు హాజరుకానున్న నేపథ్యంలో సీబీఐ అరెస్టు చేయకపోవచ్చు. అరెస్టు చేస్తారనేది మీ భయమే తప్ప అందుకు ఆధారాలేవీ లేవు'' అంటూ ప్రత్యేక కోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది.

"కానీ ఏం జరిగిందో తెలుసు కదా! జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళనే నిజమైంది. చంద్రబాబునాయుడి వ్యాఖ్యలే నిజమయ్యాయి. సీఎం కిరణ్, రేణుకా చౌదరి, బొత్స చెప్పిన మాటలే కరెక్టయ్యాయి. మే 25, 26, 27 తేదీల్లో మూడు రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకూ జగన్‌ను విచారించిన సీబీఐ.. ఆయన 28న కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉండగా.. తమ విచారణకు సహకరించట్లేదనే కారణంతో 27వ తేదీ రాత్రికి రాత్రి అరెస్టు చేసింది. ఇదంతా ఒక స్క్రిప్టు ప్రకారం, రాజకీయ దురుద్దేశాలతో జరిగిందనటానికి ఇంతకన్నా ఏమీ చెప్పనక్కర్లేదు. ఇదంతా పక్కా కుట్ర అని చెప్పటానికి వేరే ఆధారాలు కూడా అక్కర్లేదు. ‘‘సీబీఐ రాజకీయ పార్టీల చేతుల్లో పావులా మారింది. జగన్‌మోహన్‌రెడ్డిపై సాగిస్తున్న దర్యాప్తులో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇవి వేధింపులు తప్ప మరొకటి కాదు'' అని అన్నా హజారే బృంద సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ సైతం వ్యాఖ్యానించారు" అని సాక్షి డైలీ తన వార్తాకథనంలో వ్యాఖ్యానించింది.

జగన్ జైలుకెళతారంటూ పాట పాడిన అనైతిక రాజకీయ కూటమి.. ఆ తరవాత కొత్త పల్లవి అందుకుందంటూ ఇలా తన వాదనను సాక్షి దినపత్రిక కొనసాగించింది - ‘‘జగన్‌కు బెయిలు రాలేదు. కస్టడీకి అనుమతించారు. ఇక ఇప్పట్లో బయటకు రారు'' అనే విష ప్రచారానికి తెరతీసింది. వాళ్లు అన్నట్లే జరుగుతోంది. ఇంకా గమనించాల్సిందేమిటంటే.. ఐరన్ ఓర్ మైనింగ్ కేసులో జైలులో ఉన్న గాలి జనార్దనరెడ్డి బెయిలు స్కామ్‌ను బహిర్గతం చేసిన టైమింగ్ కూడా. జనార్దనరెడ్డి బెయిలు కోసం డబ్బులు చేతులు మారిన ఆ స్కామ్‌ను.. సరిగ్గా జగన్‌మోహన్‌రెడ్డి బెయిలుపై తీర్పు వచ్చే రోజున సీబీఐ బయటపెట్టింది. ఒకరకంగా చట్టబద్ధంగా బెయిలు మంజూరు చేయడానికి కూడా న్యాయమూర్తులు భయపడే పరిస్థితి కల్పించే ప్రయత్నం చేసింది. సీబీఐ ప్రయత్నాలకు ఒక వర్గం మీడియా సైతం ఇతోధికంగా సహకరించి.. న్యాయవ్యవస్థను బ్లాక్‌మెయిల్ చేసే ఎత్తుగడలకు సైతం సై అంది.

ముక్కలు ముక్కలు చార్జిషీట్లు కూడా అందులో భాగమేనంటూ ఇలా వివరించింది - నేరుగా సీబీఐని చూసినా చార్జిషీట్లను ముక్కలు ముక్కలు చేసి వేయటం వెనుక బెయిలు దొరక్కుండా ప్రయత్నించటమనే కుట్ర కనిపించకమానదు. ఎందుకంటే ఏ కేసులోనైనా నిందితుల్ని అరెస్టు చేస్తే 90 రోజుల్లోగా చార్జిషీటు వేయాలి. లేని పక్షంలో సాక్ష్యాలు లేవన్న కారణంతో వారికి ఆటోమేటిగ్గా బెయిలొచ్చే అవకాశముంటుంది. ఒకవేళ చార్జిషీటు దాఖలు చేస్తే.. సాక్ష్యాల్ని తారుమారు చేస్తారనే వాదనకు తావుండదు కనుక అప్పుడు కూడా బెయిలు లభించే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాలకు గండి కొట్టడానికి ముక్కలు ముక్కలు చార్జిషీట్లు వేయటమనే సంస్కృతికి సీబీఐ తెరతీసింది. ఇలా వేయటం వల్ల ‘‘దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. బెయిలు వస్తే సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం ఉంటుంది'' అనే వాదనకు అవకాశం ఉంటుంది.

ఆ కథనం ఇంకా ఇలా సాగింది - సీబీఐ చెప్తున్నది కూడా అదే. కాకపోతే సీబీఐ ఈ కేసులో మూడు చార్జిషీట్లు దాఖలు చేసేదాకా జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేయలేదు. ఆ తరవాతే అరెస్టు చేశారు. అంటే.. సీబీఐ మూడు చార్జిషీట్లు దాఖలు చేసేదాకా జగన్ సాక్షుల్ని ప్రభావితం చేయటం కానీ, సాక్ష్యాలు తారుమారు చేయటం కానీ చేయలేదనేగా? అప్పుడు చేయని వ్యక్తి ఆ తరవాత చేసే అవకాశం ఉంటుందా? దీనికి సీబీఐ దగ్గర సమాధానాలు లేవు. కాకపోతే దాని కుట్ర సాగుతున్నదల్లా రాజకీయ బాసుల దర్శకత్వంలో కావటంతో అది ఎన్ని వాదనలు వినిపించినా నడుస్తోంది. కానీ ఇదంతా చూస్తున్న జనానికి మాత్రం ఈ కుట్ర త్రీడీ టీవీలో బొమ్మలా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది!

English summary

 YSR Congress party president YS Jagan's Sakshi daily has published a special article accusing CBI. It charged that CBI is making efforts courts to deny bail to YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X