హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కన్నీరు పెట్టిన డిఫెన్స్ లాయర్: తుది దశలో దర్యాప్తు

By Pratap
|
Google Oneindia TeluguNews

CBI
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో నిందితుడు విజయరాఘవ వేదన చూస్తుంటే తనకు దుఃఖం ఆగడం లేదని డిఫెన్స్ లాయర్ దిల్జీత్ సింగ్ అహ్లూవాలియా అన్నారు. ఆయన్ను జైలుకు పంపి 223 రోజులు అయిందని, ఇది నాలుగో బెయిల్ పిటిషన్ అని కోర్టుకు చెబుతూ - ఇంకా సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నాంపల్లి సీబీఐ కోర్టులో శుక్రవారం విజయరాఘవ బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఆయన తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది దిల్జీత్ ఒక దశలో ఉద్వేగానికి గురయ్యారు.

బెయిల్ ఇస్తే తాము ఎలాంటి షరతులకైనా అంగీకరిస్తామని, చివరకు గృహనిర్బంధానికైనా సిద్ధమని ఇప్పటికే చెప్పినా.. సాక్ష్యాలు తారుచేస్తారంటూ సీబీఐ పదే పదే అడ్డుపడుతోందని ఆవేదన చెందారు. దుఃఖం ఆపుకోలేక కన్నీరుపెట్టారు. వెంటనే కోర్టు హాలు నుంచి బయటకు వెళ్లి, కళ్లు తుడుచుకుని వచ్చారు. దీనిపై కోర్టును మన్నించాలని కోరుతూ తన వాదనలు కొనసాగించారు. ఇప్పటికి మూడు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా సిబిఐ అడ్డు చెబుతూనే వచ్చిందని, ఇప్పడు కొత్తగా కేసుతో సంబంధం లేని దినేష్‌జైన్ పేరును తెరపైకి తెచ్చిందని ఆవేదనగా మాట్లాడారు.

అయితే దినేష్‌జైన్ కోసం గాలిస్తున్నామని, అతన్ని ప్రశ్నించాక కొద్ది రోజుల్లో దర్యాప్తు ముగిస్తామని జడ్జికి సిబిఐ తరఫు న్యాయవాది తెలిపారు. వాదనలు పూర్తవడంతో తీర్పును ఈనెల 12కు వాయిదా వేశారు. ఎపిఐఐసికి రావాల్సిన ఆదాయానికి గండికొడుతూ సాగిన ఎమ్మార్ అక్రమాలపై తాము చేపట్టిన దర్యాప్తును త్వరలోనే ముగిస్తామని సిబిఐ తెలిపింది. ఈ కేసులో శ్రవణ్‌గుప్తాను ప్రశ్నించడం కూడా పూర్తయిందని, ఆయన సన్నిహితుడు దినేష్‌జైన్‌ను ప్రశ్నించడం మిగిలిందని, అది కూడా త్వరలో పూర్తి చేశాక దర్యాప్తు కొలిక్కి వస్తుందని, ఆ తర్వాత వెంటనే చివరి చార్జిషీట్ దాఖలు చేస్తామని నాంపల్లి కోర్టుకు సిబిఐ లాయర్ రవీంద్రనాథ్ విన్నవించారు.

సీనియర్ ఐఏఎస్ అధికారి బిపి ఆచార్య బెయిల్ పిటిషన్‌పై కోర్టులో శుక్రవారం సీబీఐ, డిఫెన్స్ న్యాయవాదుల మధ్య వాదనలు జరిగాయి. టౌన్‌షిప్ నిర్మాణం, ఎస్పీవీల ఏర్పాటు, ప్లాట్ల విక్రయానికి స్టైలిష్‌హోంను రంగంలోకి తేవడం, ఇతరత్రా జరిగిన ఒప్పందాలన్నీ ఏకపక్షంగానే జరిగాయని సీబీఐ తరపు న్యాయవాది చెప్పారు. ఏపీఐఐసీ వీసీ, ఎండీగా ఉన్న బీపీ ఆచార్య ఆ విషయాలను గమనించి కూడా మిన్నకుండిపోయారని, ఆ మౌనం వెనుక నేరపూరిత కుట్ర దాగివుందని ఆరోపించారు.

'ప్రభుత్వానికి తెలియకుండా సబ్‌లీజుకు ప్రాజెక్టు అప్పగించడం వల్ల ఏపీఐఐసీకి రూ.43.5 కోట్లు నష్టం రాగా, ప్రైవేటు వ్యక్తులకు రూ.167.5 కోట్ల లబ్ధి చేకూరింది. ఏపీఐఐసీ వాటా 25% నుంచి 6 శాతానికి తగ్గిపోయినా ఆయన పట్టించుకోలేదు. ఇందులో వ్యక్తిగతంగా ఆయనకు లబ్ధి జరగకున్నా, ఇతరులకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు, ఒప్పందాలు జరిగినందున దానికి బాధ్యులుగా గుర్తించి కేసులు నమోదు చేశాం. ఈ పరిస్థితిలో ఆయనకు సీఆర్‌పీసీ 197 వర్తించదు. కేసుల నుంచి ఆయన తప్పించుకోలేరు. తప్పు చేయకుంటే, దాన్ని ఆయనే నిరూపించుకోవాలి' అని సిబిఐ న్యాయవాది ప్రశ్నించారు.

బీపీ ఆచార్య తరఫున డిఫెన్స్ లాయర్ సురేంద్రరావు తన వాదన కొనసాగించారు. 'ఎమ్మార్ ప్రాజెక్టులో అభివృద్ధి పనుల నిమిత్తం థర్డ్‌పార్టీతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ సీబీఐ చెప్పిన ప్రకారమే కాసేపు ఆ అవకాశం లేదనుకున్నా అనుబంధ ఒప్పందాలు చేసుకున్నారని క్రిమినల్ కేసులు పెడతారా? ఇలా ఎక్కడైనా ఉందా?' అని ప్రశ్నించారు. అనుబంధంగా చేసుకున్న ఒప్పందాలు లీజు ప్రాతిపదికన జరిగాయి తప్ప, భూ బదలాయింపు జరగలేదన్నారు.

బీపీ ఆచార్య ఒక్క పైసా లబ్ధి పొందినట్లు సిబిఐ చెప్పలేదని, ఒక్క ఆధారం కూడా ఆయనకు వ్యతిరేకంగా లేదని చెప్పారు. ఎమ్మార్‌పై దర్యాప్తు జరిపించాలని కొందరు హైకోర్టుకు రాసిన లేఖలో అప్పటి ఎపిఐఐసి సెకండ్ డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్ దామెర పార్థసారథిపైన, కెవిపి రామచంద్రరావుపైనా ఆరోపణలున్నాయని, సిబిఐ వారిని ప్రశ్నించలేదని, ఆ లేఖలో బీపీ ఆచార్య ప్రస్తావనే లేకున్నా ఆయన్ను నిందితుడుగా చేర్చిందన్నారు. డిఫెన్స్ వాదనలు పూర్తికాకపోవడంతో కేసును న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశారు.

కాగా, ఓఎంసీ కేసులో నిందితుడు బీవీ శ్రీనివాసరెడ్డికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తాడని, ఆయనకు బెయిల్ ఇవ్వద్దని సీబీఐ శుక్రవారం కౌంటర్ దాఖలు చేసింది. కేసు విచారణ 13కు వాయిదా పడింది.

English summary
Defence lawyer in EMAAR properties scam case shed tears for keeping his client Vijaya Raghava in jail. This was happened when Nampally CBI court hearing the bail petition of Vijaya Raghava.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X