• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెలంగాణ మార్చ్‌కు కౌంటర్ సమైక్య చలో హైదరాబాద్

By Pratap
|

United Andhra
తిరుపతి: వేర్పాటువాదులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుండెల్లో రైళ్లు పరుగెత్తించేలా ఇక మీదట కార్యక్రమాలు ఉండాలని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణకు మద్దతు తెలిపే ఏ వ్యక్తినైనా, పార్టీనైనా భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఈనెల 30న తెలంగాణవాదులు నిర్వహించే తెలంగాణ మార్చ్‌కి దీటుగా అదే రోజున చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించాలని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నిర్ణయించింది. దీనికి విద్యార్థులను సమాయత్తం చేసే దిశగా సదస్సులు నిర్వహించాలని నాయకులు తీర్మానించారు.

తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను సమర్థంగా ఎదుర్కొన్న ఘనత సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీదేనని అన్నారు. అప్పుడు విద్యార్థులు తీవ్రస్థాయిలో ఉద్యమించడం వల్లే నాయకులపై ఒత్తిడి పెరిగి, తద్వారా తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుందన్నారు.

రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమ, ఉత్తర కోస్తా, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలని, వీటి అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు పరిష్కారం కాదని చెప్పారు. కేంద్రంలో ప్రస్తుత కదలికలు వేర్పేటువాదానికి దారి తీసేలా ఉన్నాయని అనుమానం వ్యక్తంచేశారు. దీన్ని సమర్థంగా తిప్పికొట్టేందుకు తెలంగాణ మార్చ్‌కు దీటుగా చలో హైదరాబాద్ చేపడుతున్నట్లు నాయకులు చెప్పారు. దీనికోసం విద్యార్థులు వేలాదిగా ఈనెల 29న పాదయాత్రగా రైల్వే స్టేషన్లకు చేరుకుని.. 30న హైదరాబాద్ రావాలని పిలుపునిచ్చారు. ఆ రోజున హైదరాబాద్ నడిబొడ్డున సమైక్యాంధ్ర జెండా ఎగరవేయనున్నట్లు తెలిపారు. దీనికోసం విద్యార్థులను సమాయత్తం చేసేలా ఈనెల 25వ తేదీలోగా అన్ని విశ్వ విద్యాలయాలు, జిల్లా కేంద్రాల్లో జేఏసీ సదస్సులు నిర్వహించాలని వారు సూచించారు.

తెలంగాణకు మద్దతు తెలిపే ఏ వ్యక్తినైనా, పార్టీనైనా భూస్థాపితం చేస్తామని జేఏసీ కో-కన్వీనర్ డి.కాంతారావు (ఏయూ) హెచ్చరించారు. తెలంగాణవాదులు వేర్పాటువాదంతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ మార్చ్ పేరిట గతేడాది ట్యాంక్‌బండ మీద మహానుభావుల విగ్రహాలను ధ్వంసం చేస్తే.. ఇప్పటివరకు పునఃప్రతిష్ఠ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని చిత్తూరు జిల్లా జేఏసీ కన్వీనర్ రాగల ఆనంద్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధ్వంసకారులపై కేసులు ఎత్తేసిన ప్రభుత్వం మళ్లీ విధ్వంసానికి సహాయకారిగా మారిందని ధ్వజమెత్తారు. దీన్ని తాము చూస్తూ ఊరుకొనేది లేదని హెచ్చరించారు.

డిసెంబర్ వరకు చూసి.. అవసరమైతే తామే జేఏసీ ఆధ్వర్యంలో ఆ విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేస్తామని ప్రకటించారు. అలాగే గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేయాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, రాష్ట్ర కన్వీనర్‌గా డి.కృష్ణయాదవ్ (నెల్లూరు), కో-కన్వీనర్లుగా బి.కాంతారావు (ఆంధ్రా వర్సిటీ), భూషణ్ (కృష్ణా), వీరేష్ (నాగార్జున వర్సిటీ), జగదీష్ (ప్రకాశం), శేషాద్రినాయుడు, రవినాయుడు, ఆనంద్‌గౌడ్ (ఎస్వీయూ), అఫ్జల్ (యోగి వేమన వర్సిటీ), ఎస్.నరేష్ (ఎస్కేయూ), ఈశ్వరబాబు, గురుప్రసాద్ (ద్రవిడ వర్సిటీ), ప్రవీణ్ (రాయలసీమ వర్సిటీ) ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా కన్వీనర్‌గా రాగల ఆనంద్‌గౌడ్, ఎస్వీయూ కన్వీనర్‌గా బి.వెంకటేష్‌నాయుడు ఎన్నికయ్యారు.

English summary
Samaikhyandhra JAC has decided to organise Chalo Hyderabad on september 30, on which Telangana JAC is going to takeup Telanagana march. Samaikhyandhra JAC met at Tirupathi and chalked out the programme to counter bifurcation bid.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X