వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్బు చెట్లకు కాయదు, సంస్కరణలు అవసరం: ప్రధాని

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: భారత యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి సంస్కరణలు కొత్త అవకాశాన్ని కల్పిస్తున్నాయని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. డబ్బు చెట్లకు కాయదని, సబ్సిడీలను అదుపు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలను ఏ ప్రభుత్వమూ తీసుకోదని మన్‌మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులను ప్రజలకు వివరించడానికై ప్రధాని శుక్రవారం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రత్యేకంగా ప్రసంగించారు.

ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా మారిందని, ఇటువంటి పరిస్థితులలో క్లిష్టమైన నిర్ణయాలను కఠినంగా అమలు చేయకపోతే దేశం పరిస్థితి ఇంకా తీవ్రంగా మారే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. తమ యుపిఎ ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన ముప్పు ఏమీ లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వం కొనసాగింపునకు ఎటువంటి అవరోధాలూ లేవని ఆయన అన్నారు.

ప్రతిపక్షాలు కేవలం రాజకీయ దురుద్దేశాలతో చేసే దుష్ప్రచారాలను నమ్మవద్దని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్య, వైద్య రంగాలలో ఎన్నో ముఖ్యమైన మార్పులు తీసుకువచ్చామంటూ ప్రభుత్వం ఏం చేసినా ప్రజలకోసమేనని ఆయన వివరించారు. ఆర్థిక వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సడలకముందే ఎన్నో గట్టి చర్యలను అమలు చేశామని ఆయన చెప్పారు.

ముడి చమురు బిల్లులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల వాటి చెల్లింపులపై చాలా పెద్ద మొత్తాలను పెట్టవలసి వస్తోందని ఆయన చెప్పారు, ఈ బిల్లుల భారానికి తోడు సబ్సిడీల భారం కూడా దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నదని ఆయన చెప్పారు. దేశంలో పేద ప్రజలు సంవత్సరానికి ఆరు కంటె తక్కువ సిలిండర్లే వినియోగిస్తున్నారని, అందుకే వాటిని ఎక్కువ వినియోగించేవారి వినియోగాన్ని పరిమితం చేశామని ఆయన వివరించారు. ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక సంస్కరణలు దేశాభివృద్ధికే, అంటే సామాన్య ప్రజలకోసమేనని ఆయన చెప్పారు.

సబ్సిడీలను ఇలాగే వదిలేస్తే ప్రభుత్వంపై ఏటా అదనపు భారం దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని అంటూ ఈ డబ్బును ఎక్కడినుండి తీసుకురావాలని ఆయన ప్రశ్నించారు. అది దేశ ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బ తీస్తుందని, అందుకే ఇటువంటి పరిస్థితులలో జాగరూకతతో వ్యవహరించవలసి ఉందని ఆయన చెప్పారు. మౌలిక సౌకర్యాల కల్పన కోసం మరిన్ని నిధులను సమకూర్చుకోవలసి ఉందని ఆయన చెప్పారు.

అమెరికాను, యూరప్‌ను అతలాకుతలం చేసిన ఆర్థిక సంక్షోభం మన దేశాన్ని ఏమీ చేయలేకపోయిందని, అందుకు కారణం మన దేశ ఆర్థిక పరిస్థితిని మనం అదుపులో ఉంచగలగడమేనని ప్రధాని వివరించారు. పేద ప్రజలు కిరోసిన్ వినియోగిస్తారు కాబట్టే కిరోసిన్ ధరలను పెంచలేదని ఆయన అన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులలో ప్రభుత్వం చేయ తలపెట్టిన ఆర్థిక సంస్కరణలకు ప్రజలు మద్దతునివ్వాలని ఆయన కోరారు.

English summary
Addressing the nation, Prime Minister Manmohan Singh said reforms are new opportunities to create jobs for India's youth. Prime Minister said: "My government wants to raise finance for infrastructure. We don't want to burden commonman."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X