బాధాకరమే, తప్పలేదు: బస్సు చార్జీల పెంపుపై బొత్స

డీజిల్ ధర ఒక రూపాయి పెరిగితే సంస్థపై రూ.65 కోట్ల భారం పడుతుందని, ప్రస్తుతం డీజిల్ ధర పెంపు కారణంగా సంస్థపై రూ.330 కోట్ల భారం పడుతోందని ఆయన చెప్పారు. ఆర్టీసి ఏడాదికి 56 వేల కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే కాలంలో సంస్థ మనుగడను దృష్టిలో ఉంచుకుని బస్సు చార్జీలను పెంచినట్లు ఆయన తెలిపారు.
పెంచిన బస్సు చార్జీలపై ప్రజలు పెద్ద మనసుతో ఆలోచించాలని బొత్స కోరారు. ఆర్టీసి అభివృద్ధికోసం చార్జీల పెంపును రాజకీయ పార్టీలు కూడా అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. చార్జీల పెంపుపై రాజకీయ చేయడం తగదని ఆయన అన్నారు. ఎప్పుడూ లేని విధంగా రూ.200 కోట్లు ఆర్టీసికి బడ్జెట్లో కేటాయించినట్లు ఆయన తెలిపారు ఈ ఏడాది రెండు వేల కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసి నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
ఆర్టీసి బస్సు చార్జీల పెంపు దారుణమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీర్ ట్రస్టు భవన్లో సోమవారం జరిగిన తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకుంటోందని ఆయన విమర్శించారు. డీజిల్ ధర పెంపుపతో రాష్ట్రానికి రూ. 800 కోట్ల లాభం వస్తుందని ఆయన చెప్పారు.