వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిలదీసిందని 14 ఏళ్ల అమ్మాయిని కాల్చిన తాలిబన్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Malala Yousufzai
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. పద్నాలుగేళ్ల చిన్నారిపై హత్యాయత్నం చేశారు. తమకు వ్యతిరేకంగా గళం విన్పించిందనే ఆగ్రహంతో ఓ బాలిక కార్యకర్తపై కిరాతంగా కాల్పులు జరిపారు. తమ దుశ్చర్యలను దనుమాడిందనే దుగ్దతో ఆ చిన్నారిపై హత్యాయత్నం చేశారు. బాలికా విద్యపై ఇస్లాం తీవ్రవాదుల వైఖరిని వ్యతిరేకించి చిన్నవయసులోనే అత్యంత ధీశాలిగా పాకిస్థాన్‌లో ఖ్యాతికెక్కిన మాలాల యూసఫ్‌ జాయ్‌ను అంతం చేసేందుకు ప్రయత్నించారు. బడి నుంచి పాఠశాల బస్సులో ఇంటికి వెళుతున్న మాలాలపై కర్కశ దుండగుడొకడు తుపాకీతో రెండుసార్లు కాల్చాడు.

స్వాత్ వ్యాలీలోని మింగోర ప్రాంతంలో ఈ దురాగతానికి ఒడిగట్టాడు. దుండగుడి కాల్పుల్లో తలకు, మెడకు గాయాలయిన ఆమెకు అత్యవసర చికిత్స చేసిన తర్వాత సైనిక హెలికాప్టర్‌లో పెషావర్‌కు తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మాలాలపై దాడి చేసింది తామేనని తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్థాన్(టిపిపి) ప్రకటించుకుంది. పాశ్చాత్య అనుకూల వైఖరి, తాలిబాన్లను వ్యతిరేకించడంతో పాటు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను తన ఆదర్శ నేతగా ప్రకటించుకున్నందునే ఆమెను అంతమొందించేందుకు యత్నించామని టిపిపి ప్రతినిధి ఇషానుల్లా ఇషాన్ వెల్లడించాడు.

పాశ్చాత్య సంస్కృతిని ఆమె ప్రచారం చేస్తోందని నిందించాడు. స్వాత్ వ్యాలీలో సెక్యులర్ సర్కారు కొలువుతీరాలన్న ఆకాంక్షను బయటపెట్టడంతో గతంలోనే ఆమెను తాలిబాన్లు హిట్ లిస్ట్‍లో పెట్టారు. చివరకు అదునుచూసి బలితీసుకోవాలనుకున్నారు. అందమైన పర్వతశ్రేణులతో పర్యాటక ప్రాంతంగా విలసిల్లిన స్వాత్ లోయ తాలిబాన్ల స్వాధీనంలోకి వెళ్లాక అరాచకాలతో అట్టుడుకుతోంది. బాలికా పాఠశాలలను మూయించడం, మగాళ్లను గడ్డాలు పెంచాలని ఒత్తిడి చేయడం, తమకు ఎదురు తిరిగిన వారి తలలు నరకడం వంటి దుశ్చర్యలకు తాలిబాన్లు తెగబడుతున్నారు.

2009లో పాక్ సైన్యం స్వాత్ లోయలో తాలిబాన్లను అణచివేసిన సందర్భంలో మాలాల వెలుగులోకి వచ్చింది. తాలిబాన్ల దురాగతాలకు వ్యతిరేకంగా మాలాల గొంతెత్తింది. బిబిసి ఉర్దూ వెబ్‌సైట్ కోసం రాసిన బ్లాగ్‌తో ఆమె తాలిబాన్ల ఆగ్రహాన్ని చవిచూసింది. అయినా ఆ చిన్నారి భయపడలేదు. భద్రత పేరుతో చదువుకు అడ్డంకులు ఎదురైనా విచారించలేదు. గతేడాది ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతికి నామినేటయిన మాలాల పురస్కారానికి ఎంపిక కాలేదు. దీంతో అప్పటి పాక్ ప్రధాని యుసఫ్ రజా గిలానీ తమ దేశ మొట్టమొదటి జాతీయ శాంతి బహుమతిని ఆమెకు ప్రదానం చేసి, ప్రశంసించారు.

భవిష్యత్‌లో సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని, పేద బాలికల కోసం వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ పెడతానని తన మనసులోని కోరికను మాలాల ఇటీవల బయటపెట్టింది. ఇంతలోనే ముష్కరుల తూటాల బారినపడింది. రాజకీయ అనిశ్చితికి, తీవ్రవాద దాడులకు ఆలవాలమైన పాకిస్థాన్‌లో బాలికల రక్షణ గాల్లో దీపంగా మారింది. సంకుచిత ఛాందసవాదుల అరాచకాలకు మహిళలు, బాలికలు బలైపోతున్నారు. స్త్రీ స్వేచ్ఛ, మహిళా విద్యను వ్యతిరేకించే తాలిబాన్లు తమ కట్టుబాట్లను కాదన్న ఇంతులపై కిరాతక దాడులకు తెగబడుతున్నారు.

English summary
Pakistan - Forteen year old Malala Yousufzai was admired across a battle scarred region of Pakistan for exposing the Taliban's atrocities and advocating for girls education in the face of religious extremists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X