కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు షర్మిల హామీ: విజయమ్మ, బాబుపై నిప్పులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharmila
కడప: పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి షర్మిల రెడ్డి హామీ ఇచ్చారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ గురువారం చెప్పారు. కడప జిల్లా ఇడుపులపాయ వద్ద షర్మిల పాదయాత్ర ప్రారంభానికి ముందు విజయమ్మ బహిరంగ సభలో మాట్లాడారు. జగన్ ప్రజల కోసం పాదయాత్ర చేసేందుకు రూట్ మ్యాప్ తయారు చేసుకున్నారని, అయితే బెయిల్ రాకపోవడంతో తాను జైలులో కలిసినప్పుడు పాదయాత్ర విషయం చెప్పారని అన్నారు.

పాదయాత్ర చేసేందుకు తాను సిద్ధమేనని చెప్పానని, కానీ అంతదూరం చేయలేనేమోనని జగన్‌తో చెప్పానని, అప్పుడు పక్కనే ఉన్న తన కూతురు షర్మిల ప్రజలకోసం తాను జగన్ తరఫున పాదయాత్ర చేస్తానని హామీ ఇచ్చిందని చెప్పారు. దివంగత వైయస్ ఎప్పుడూ ప్రజల కోసం పని చేశారని, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేశారని, ఇప్పుడు జగన్ కూడా ఆయన బాటలో నడుస్తున్నారన్నారు. ఆయన జైలులో ఉన్నా కూడా ప్రజల గురించే ఆలోచిస్తున్నారన్నారు.

తండ్రికి ఇచ్చిన మాట కోసం జగన్ ప్రజల కోసం ఉద్యమిస్తున్నారన్నారు. ఇంత తక్కువ కాలంలో జగన్ ఏ నేత చేయనన్ని దీక్షలు చేశారన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గలేదన్నారు. జగన్‌ను రాష్ట్ర ప్రజలు అన్నగా, కొడుకుగా తమ అక్కున చేర్చుకున్నారన్నారు. ఉప ఎన్నికలలో సంపూర్ణ మద్దతు ప్రకటించారన్నారు. జగన్ బెయిల్‌కు రావడానికి ఇంకా నెలలు పట్టవచ్చునన్నారు.

జగన్ నిత్యం ప్రజల కోసమే ఆలోచిస్తున్నారన్నారు. షర్మిల పాదయాత్రకు సిద్ధపడగానే ప్రజల కోసం అండగా ఉండాలని జగన్ సూచించారన్నారు. ఎప్పుడూ ప్రజల కోసమే బాధపడుతుంటారన్నారు. జగన్ ఎంత తొందరగా బయటకు వస్తే అంత తొందరగా షర్మిల ప్రారంభించిన పాదయాత్రను పూర్తి చేస్తారని చెప్పారు. షర్మిల మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రకు సిద్ధమైందని చెప్పారు. ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం వరకు కొనసాగిస్తుందని చెప్పారు.

బాబుపై ఫైర్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఇన్నాళ్లకు ప్రజల కష్టాలు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు. బాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి, తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల గురించి ఆలోచించలేదన్నారు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర అధికారం కోసమే అన్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పనులు ఓసారి గుర్తుకు తెచ్చుకుంటే మంచిదన్నారు.

చంద్రబాబు తాను ప్రధాని పదవిని త్యాగం చేశానని, చక్రం తిప్పానని చెబుతుంటారని, అంత చేసిన నేత ప్రజల కోసం ఎందుకు పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రజలకు ఎందుకు న్యాయం చేయలేదన్నారు. రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదన్నారు. వైయస్ పాలన రామరాజ్యం పాలన అన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకొనేందుకే షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరుతో యాత్రకు సిద్ధమైందన్నారు. చంద్రబాబు రైతులను కాల్చివేయించారని, ఆడవారిని గుర్రాలతో తొక్కించారని ఆరోపించారు. ఎన్టీఆర్ పథకాలను తుంగలో తొక్కారని నిప్పులు చెరిగారు.

కాంగ్రెసు ప్రభుత్వంతో చంద్రబాబు కుమ్మక్కయ్యారన్నారు. ఎలాంటి లాలూచీ లేకుంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదని ప్రశ్నించారు. జగన్‌కు బెయిల్ రాకుండా టిడిపి ఎంపీలు చిదంబరాన్ని కలిశారన్నారు. టిడిపి, కాంగ్రెసులు కలిసి జగన్‌ను జైలుకు పంపారన్నారు. చీకట్లో చిదంబరాన్ని కలిసి బాబు తప్పించుకున్నారని ఆరోపించారు.

కాగా అంతకుముందు షర్మిల, వైయస్ విజయమ్మ, భారతి రెడ్డి తదితరులు బుధవారం సాయంత్రమే కడప జిల్లాకు చేరుకున్నారు. ఉదయం భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు, అభిమానుల మధ్య దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. సర్వమత ప్రార్థనలు జరిపారు.

English summary
YSR Congress party honorary president YS Vijayamma said Wednesday that Sharmila make promise to party chief YS Jaganmohan Reddy on padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X