హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెమెరామెన్ గంగతో రాంబాబు: పొలిటికల్ కాన్సెప్ట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Cameraman Ganga Tho Rambabu
హైదరాబాద్: అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికల బరిలోకి దిగినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ సంస్కృతిని తాను గౌరవిస్తున్నట్లు చాటుకున్నారు. కల్లు తాగారు. తెలంగాణ యువకులతో ఆడిపాడారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్‌కు తెలంగాణలో విశేషమైన ఆదరణ లభించింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన చిరంజీవి తెలంగాణవాదాన్ని వీడి, సమైక్యవాదానికి ప్రచారకర్తగా మారారు.

ఇకపోతే, వైయస్ రాజశేఖర రెడ్డిపై సినిమా తీస్తానని దర్శకుడు పూరీ జగన్నాథ్ అప్పట్లో ప్రకటించారు. ఆ సినిమా నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు కూడా చెప్పారు. కానీ ఆ సినిమా రూపు దిద్దుకోలేదు. కారణాలు తెలియదు. పూరీ జగన్నాథ్ వైయస్ రాజశేఖర రెడ్డి అభిమాని అనే విషయం అప్పట్లోనే తేలిపోయింది.

చిరంజీవి సమైక్యవాదానికి, పూరీ జగన్నాథ్ వైయస్ భక్తిని మేళవించి కెమెరామేన్ గంగతో సినిమా వచ్చినట్లు కనిపిస్తోంది. అన్న రాజకీయ దృక్పథానికి అనుగుణంగా ఉందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కెమెరామేన్ గంగతో సినిమాలో డైలాగులు దాడికి అంగీకరించి ఉండవచ్చు. అన్న చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడాలని పవన్ కళ్యాణ్ కలలు కన్నాడు. అందుకు తన శక్తిని కూడా ఉపయోగించాడు. ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల బరిలో విఫలం కావడంతో పవన్ కళ్యాణ్ తీవ్ర నిరాశకు గురయ్యే ఉంటాడని అనుకోవచ్చు.

రాజకీయ దృక్పథంతో సినిమాలు తీయడం ఆహ్వానించదగిన విషయం. తెలుగులో రాజకీయ దృక్పథంతో సినిమాలు వచ్చాయి. రాజకీయాలపై కూడా సినిమాలు వచ్చాయి. హిందీలోనూ వచ్చాయి. రాజకీయ వస్తువుతో వచ్చిన సినిమాలు వివాదాస్పదం కావడం ఆశ్చర్యకరమేమీ కాదు. కానీ వ్యక్తులను లక్ష్యం చేసుకోకుండా కాకుండా ఒక స్పష్టమైన రాజకీయ దృక్పథంతో సినిమా కథ రూపుదిద్దుకున్నప్పుడు అది తాత్విక స్థాయిని అందుకుంటుంది. అలా కానప్పుడు కలగూర గంపగా మారి దృక్పథ రాహిత్యాన్ని, అవగాహనా రాహిత్యాన్ని వెల్లడిస్తుంది. దాని వల్ల సినిమా అబాసుపాలు కావడమే కాకుండా ప్రజల నుంచి వ్యతిరేకతను చవి చూస్తుంది. ఒక వర్గం పరిధిలోకి కుంచించుకుపోతుంది. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ఈ విధంగా కుంచించుకుపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నిజానికి, ప్రాంతీయ పార్టీలపై నిర్దిష్టమైన దృష్ణకోణంతో కూడిన విమర్శ ఒకటి ఉంది. అవి జాతీయ సమగ్రతకు వ్యతిరేకంగా పని చేస్తాయనేది వాటిలోని విమర్శ ఒకటి. అంతేకాకుండా, సంకుచిత రాజకీయ, వ్యక్తిప్రయోజనాలకు ప్రాంతీయ పార్టీలు ఆలవాలంగా మారుతాయనేది అభిప్రాయం కూడా ఉంది. కుటుంబ వారసత్వానికి అవి కేంద్ర బిందువుగా పనిచేస్తాయి. ఆ రకంగా చూసినప్పుడు తెలుగుదేశం పార్టీపై నిర్దిష్టమైన దృక్పథంతో సినిమా కథను రూపొందించుకునే అవకాశం ఉంది.

ఇక తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని ఉప ప్రాంతీయ పార్టీగా దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అభివర్ణించారు. దాని లక్ష్యాలు ఇంకా పరిమిత స్థాయిలో ఉంటాయనే అభిప్రాయం కలిగి ఉండడానికి అవకాశం ఉంది. వైయస్ దృక్పథాన్ని పూరి జగన్నాథ్ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో ప్రతిబింబించాలని అనుకున్నప్పుడు లేదా జాతీయ పార్టీల దృక్పథాన్ని విశ్వసించి, దాన్ని ప్రమోట్ చేయాలని అనుకున్నప్పుడు సినిమా కథకు స్పష్టమైన, సరళరేఖ వంటి ఇతివృత్తం ఉంటుంది. ఆ ఇతివృత్తం నుంచి వస్తువును పిండుకోవడం కష్టమేమీ కాదు.

ప్రాంతీయ పార్టీని, ఉప ప్రాంతీయ పార్టీని ఒకే గాటన కట్టేయాలని అనుకున్నప్పుడు, ఆ పార్టీల లక్ష్యాలను తడమనప్పుడు వ్యక్తిగత దాడిగా మారి, హీరోయిజం ప్రదర్శన మాత్రమే మిగులుతుంది. లక్ష్యాలకు ఆలవాలంగా పాత్రలు రూపుదిద్దుకుంటాయి. అవి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని, ఆయన కుటుంబ సభ్యులను ప్రతిబింబించే విధంగానో, తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును, ఆయన ఉద్యమాన్ని విశ్లేషించే విధంగానో రూపుదిద్దుకుని సినిమాలో ఘర్షణకు అవసరమైన వస్తువు రూపుదిద్దుకుని ఉండేది. పాత్రలకు ప్రాణప్రతిష్ట జరిగి ఉండేది. ఆ దృక్పథాలను ఎదిరించి పోరాడే హీరో చెప్పే డైలాగులకు విశ్వసనీయత చేకూరి ఉండేది. తెలుగుదేశం, తెరాస రాజకీయ దృక్పథాలను, లక్ష్యాలను - అవి సాధిస్తున్న ప్రయోజనాలను వేర్వేరుగా చిత్రీకరించి, తన దృక్పథాన్ని స్పష్టంగా పూరీ జగన్నాథ్ స్పష్టం చేయాల్సి ఉండింది.

కేవలం ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీల మీదగా దాడిగానో, తెలంగాణ ఉద్యమంపై దాడి చేయడానికో అన్నట్లుగానో హీరో పవన్ కళ్యాణ్ చేత పలికించిన సంభాషణలు ఉండి ఉండేవి కావు. కొంత మేరకు ఆలోచన పెంచే విధంగా సంఘటనలు, పాత్రలు రూపుదిద్దుకుని ఉంటే సినిమా కళలో సాంద్రత పెరిగి ఉండేది. సాంద్రత కొరవడడం అనేది దృక్పథ రాహిత్యం వల్ల ఒనగూరుతుందనేది కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో కనిపిస్తుంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడం నేరమేమీ కాదు, అలాగే ప్రాంతీయ పార్టీల తీరును తప్పు పట్టడం చేయకూడని పని ఏమీ కాదు. కానీ వాటిని ఓ దృక్పథం వెలుగులో, అది పరిమితమైన కాంగ్రెసు పార్టీ దృక్పథమైనా సరే, ప్రతిబింబించి ఉంటే సినిమాలో సారం కనిపించి, వివాదాంశాలు పక్కకు వెళ్లి ఉండేవి. కెమెరామేన్ గంగతో సినిమా ఓ సెమీ కళగానైనా రూపుదిద్దుకుని ఉండేది. అలా కానప్పుడు అనవసరమైన విషయాలు ముందుకు వచ్చి, వివాదంగా మారుతాయి. పవన్ కళ్యాణ్ కెమెరామన్ గంగతో రాంబాబు సినిమా విషయంలో అదే జరిగింది. మొత్తంగా తెలుగు సినిమా భావ దారిద్ర్యంతోనూ, కళారాహిత్యంతోనూ విలవిలలాడుతోంది. ఇప్పుడు కొత్తగా కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాను తప్పు పట్టాల్సిన పని కూడా ఏమీ లేదు. వ్యతిరేకత ఉండవచ్చు కానీ గుడ్డి వ్యతిరేకతలతో భావోద్వేగాలను రెచ్చగొట్టే పనికి పూనుకోవడం మాత్రం సరైంది కాదు.

English summary
Film director Puri Jagannath's Cameraman Gangatho cinema suffers from lack of political concept. So the dialogues of hero Pawan Kalyan's dialogues created controversy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X