వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెనక్కి తగ్గినా...: హీరోలు, నేతలకు 'తెలంగాణ' దెబ్బ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అభిమాన గణం ఉన్నా, పార్టీ వేళ్లూనుకున్నా, ఢిల్లీ పెద్దలను ఎదిరించే దమ్మున్నా తెలంగాణ విషయంలో మాత్రం తగ్గాల్సిన పరిస్థితి బడా బడా లీడర్లకు, నేతలకు ఏర్పడుతోంది. మూడేళ్ల క్రితం వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నుండి మొదలు ఆరు రోజుల క్రితం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రం కెమెరామన్ గంగతో రాంబాబు చిత్రం వరకు అందరూ తెలంగాణ సెగను ఎదుర్కొని వెనుకడుగు వేసినవారే!

 హీరోలు, నేతలకు 'తెలంగాణ' దెబ్బ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మహబూబాబాద్‌లో తెలంగాణవాదుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నప్పటికీ పరకాల ఉప ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రాంతంలోని ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

హీరోలు, నేతలకు 'తెలంగాణ' దెబ్బ

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణవాదుల నుండి పలుమార్లు తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. ఓ సమయంలో తెలంగాణలో టిడిపి కనిపించకుండా పోతుందేమోననే భావన అందరిలో కలిగింది. కానీ ఆయన కాస్త వెనక్కి తగ్గడంతో పార్టీ క్రమంగా పుంజుకుంటోంది.

 హీరోలు, నేతలకు 'తెలంగాణ' దెబ్బ

రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సొంత పార్టీ ఉన్నప్పుడు సమైక్యాంధ్రకు జై కొట్టినప్పటికీ కాంగ్రెసు పార్టీలో విలీనం తర్వాత అధిష్టానంపై భారం వేశారు.

 హీరోలు, నేతలకు 'తెలంగాణ' దెబ్బ

హీరో నందమూరి బాలకృష్ణ తన శ్రీరామరాజ్యం చిత్రం విడుదలకు ముందు చేసిన వ్యాఖ్యలు తెలంగాణవాదులు భగ్గుమనేలా చేశాయి. అయితే ఆయన వివరణ ఇచ్చుకోవడం, ఇటీవల తెలంగాణకు అనుకూలంగా మాట్లాడటం తెలిసిందే.

 హీరోలు, నేతలకు 'తెలంగాణ' దెబ్బ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పులి, కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాలు తెలంగాణ సెగను ఎదుర్కొన్నాయి. ..రాంబాబు చిత్రం వివాదం వల్ల తాను నష్టపోయానని నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు నాలుగు రోజుల క్రితం చెప్పారు. అయితే ఇప్పుడు ఆ సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి.

జగన్‌కు తొలి దెబ్బే అయినా

వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీలో ఉన్న సమయంలో పార్లమెంటు సమావేశాలలో అతను తెలుగుదేశం పార్టీ ఎంపీల చేతిలలో ఉన్న సమైక్యాంధ్ర ప్లకార్డును లాక్కొని మరీ ప్రదర్శించారు. అందుకు ఆయన మహబూబాబాద్‌లో తొలి దెబ్బ ఎదుర్కొన్నారు. ఓదార్పు యాత్రలో భాగంగా వరంగల్ జిల్లాకు వచ్చిన జగన్‌ను తెలంగాణవాదులు, జెఏసి, టిఆర్ఎస్ అడ్డుకుంది. ఆ పార్టీ నేత, అప్పటి మంత్రి కొండా సురేఖ వర్గం జగన్‌కు మద్దతుగా నిలిచింది.

అయినప్పటికీ తెలంగాణవాదులదే పై చేయి అయింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. పలువురు గాయపడ్డారు. అయితే మొత్తానికి తెలంగాణవాదులు జగన్‌కు తమ దెబ్బను రుచి చూపించారు! ఆ తర్వాత ఆయన కాంగ్రెసును వీడి సొంత కుంపటి పెట్టుకున్నప్పటికీ జగన్‌ను తెలంగాణ వ్యతిరేకిగా తెలంగాణ ప్రజలు గుర్తించారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించిన తర్వాతనే అడుగు పెట్టాలని తెలంగాణవాదులు పలు సందర్భాలలో డిమాండ్ చేశారు.

దీంతో పలు సందర్భాలలో ఆయన తాను తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారు. క్లారిటీ ఇవ్వాల్సిందేననేది తెలంగాణవాదుల డిమాండ్. అయితే ఇటీవల ఉప ఎన్నికల సమయంలో కొండా సురేఖ టిఆర్ఎస్‌కు ముచ్చెమటలు పోయించడంతో మహబూబాబాద్‌లో గట్టి షాక్ తిన్నప్పటికీ తెలంగాణలో జగన్ పార్టీ క్రమంగా పుంజుకుంటోంది. పలువురు ఆ పార్టీలో చేరేందుకు ఉద్యుక్తులవుతున్నారు.

కాంగ్రెసులో ఉన్నప్పుడు జగన్ ఆ ప్లకార్డు పట్టుకున్నారని, ఇప్పుడు సొంత పార్టీ పెట్టకున్నారని, అందుకే మనోభావాలను గౌరవిస్తామని ప్రకటన చేశారని ఆ పార్టీ తెలంగాణ నేతలు తెలంగాణవాదులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తాము అధికారంలో లేనందున తెచ్చే స్థితిలో గానీ ఆపే స్థితిలో గానీ లేమని, 2014లో జగన్ అధికారంలోకి వచ్చాక.. ఆయనను తెలంగాణకు అనుకూలంగా తప్పకుండా ఒప్పిస్తామని కొండా సురేఖ తదితర తెలంగాణ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

సంక్షోభం నుండి సంకల్పం దిశగా చంద్రబాబు

మిగిలిన అందరి నేతల కంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణవాదుల నుండి ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్నారు. సొంత పార్టీ పెద్దల వైఖరిని ఎండగడుతూ కాంగ్రెసు ఎంపీలు చురుగ్గా ఉద్యమంలో కనిపిస్తుండటంతో టిడిపి ప్రధానంగా అందరికీ టార్గెట్ అయింది. ఓ సమయంలో తెలంగాణలో టిడిపి తుడిచి పెట్టుకు పోతుందనే వార్తలు వచ్చాయి. లీడర్లు మినహా కార్యకర్తలు, అభిమానులు ఎవరూ మిగలరనే భావన అందరిలోనూ కనిపించింది.

చంద్రబాబు తెలంగాణపై కొద్దిగా తగ్గి.. తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. ఓ సమయంలో టిడిపి నేతలు వారి వారి నియోజకవర్గాల్లో కూడా తిరగలేని పరిస్థితి. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఏకంగా చంద్రబాబుకే హారతులు పడుతున్నారు. బాబు ప్రకటనపై తెలంగాణవాదులు సంతృప్తిగా లేకపోయినప్పటికీ టిడిపి క్యాడర్, టిడిపి అభిమానులు మాత్రం బాబు కాస్త తగ్గడంతో తాము తెలంగాణకు అనుకూలమే అనే భావన ప్రజల్లో కల్పించేందుకు సమాయత్తమయ్యారు.

బాబు తన రైతు పోరు బాటలో తెలంగాణవాదుల నుండి తీవ్ర అడ్డంకులు ఎదుర్కొన్నారు. తెలంగాణకు వ్యతిరేకం కాదని ప్రకటించడంతో పాటు, కేటగరైజేషన్‌కు ఓకే చెప్పడం ద్వారా చంద్రబాబు ఎమ్మార్పీఎస్ మద్దతును కూడగట్టుకున్నారు. దీంతో బాబుకు తెలంగాణవాదుల నుండి ఇప్పుడు పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. మరో విషయమేమంటే పార్టీలో ఒక్కరు కూడా మిగలరనే పరిస్థితి నుండి ఇప్పుడు బాబుకు వస్తున్న ఆదరణ చూసి ఈ ప్రాంతంలోనూ 2014లో టిడిపి హవా ఖాయమని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు.

వ్యతిరేకమే కానీ.. ఇది చిరంజీవి తీరు

కాంగ్రెసు పార్టీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మొదటి నుండి తెలంగాణ వ్యతిరేకిగానే ఉన్నారు. ఆయన సొంత పార్టీ ఉన్నప్పుడు సమైక్యాంధ్రకే జై కొట్టారు. చిరు తెలంగాణవాదుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కాంగ్రెసు పార్టీలో తన పార్టీని విలీనం చేసిన తర్వాత మాత్రం చిరంజీవి తెలంగాణపై నిర్ణయాన్ని అధిష్టానానికి వదిలేశారు. తాను ఎప్పుడూ సమైక్యాంధ్రనే కోరుకుంటానని, అయితే అధిష్టానం నిర్ణయాన్ని మాత్రం గౌరవిస్తానని చెప్పారు.

భగ్గుమనిపించిన బాలకృష్ణ వ్యాఖ్యలు

హీరో నందమూరి బాలకృష్ణ కూడా తెలంగాణ సెగను ఎదుర్కొన్న వారే. గత సంవత్సరం నవంబర్ 1వ తేదిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన రాష్ట్రం ఒక్కటిగా ఉండాలనే వ్యాఖ్యలు చేశారనే వార్తలు వచ్చాయి. దీంతో తెలంగాణవాదులు మండిపడ్డారు. ఆయన నటించిన శ్రీరామరాజ్యం చిత్రాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. బాలకృష్ణ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు.

ప్రజలంతా కలిసి ఉండాలన్న తన భావన వేరని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై మెదక్ ఎంపి విజయశాంతి భగ్గుమన్నారు. బాలకృష్ణను అడ్డుకుంటామని చెప్పారు. ఇటీవల ఓ సమయంలో బాలకృష్ణ తెలంగాణకు అనుకూలంగా వ్యాఖ్యలు కూడా చేశారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని, మరోసారి కేంద్రానికి లేఖ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దీంతో బాలకృష్ణ తెలంగాణకు అనుకూలంగా ముద్రపడ్డారు.

పలుమార్లు పవన్‌కు సెగ

చిరంజీవి కుటుంబానికి తెలంగాణలో భారీగా అభిమానులు ఉన్నారు. తెలంగాణ అంశానికి వస్తే మాత్రం వారు తెలంగాణకు ఓటేస్తేనే చిరుకు మా ఓటు అంటారు. అయితే సినిమాలను, రాజకీయాలను వేరుగా చూస్తారు. అందుకే చిరంజీవి సమైక్యాంధ్ర గళమెత్తుకున్నా ఆ కుటుంబం చిత్రాలు నైజాం ఏరియాలో భారీగా కలెక్షన్లు వసూలు చేస్తాయి. కానీ తెలంగాణను కించపర్చే విధంగా ఉంటే మాత్రం మళ్లీ అంతెత్తున లేస్తారు.

పవన్ ఒక్కసారి కాదు రెండుమూడుసార్లు తెలంగాణ సెగ ఎదుర్కొన్నారు. పులి చిత్రానికి తొలుత కొమరం పులి అని టైటిల్ పెట్టారు. అయితే తెలంగాణ పోరాయ యోధుడు కొమరం భీం పేరును పెట్టుకుంటే ఊరుకునేది లేదని తెలంగాణవాదులు హెచ్చరించారు. దీంతో కొమరం పులి నుండి కొమరంను తొలగించారు. తాజాగా కెమెరామన్ గంగతో రాంబాబు చిత్రం మరింత వివాదాస్పదమయింది. తెలంగాణకు వ్యతిరంకంగా ఉన్న సన్నివేశాలను, డైలాగ్స్‌ను తొలగించే వరకు తెలంగాణవాదులు వెనక్కి తగ్గలేదు.

English summary

 Political leaders like YS Jagan and Chandrababu Naidu and Top Heros like Balakrishna and Pawan Kalyan are facing Telangana agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X