హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీలోకి తెలంగాణ రెడ్డి నేతల దూకుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో కుల సమీకరణలు జోరందుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రాంతంలో కుల ప్రాధాన్యం పెరిగిపోతోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలోని రెడ్డి నాయకులు వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొద్ది మంది తెలంగాణ రెడ్డి నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బాట పట్టగా, మరింత మంది ఆ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో కీలక పాత్ర పోషించిన మాజీ శాసనసభ్యుడు కొమ్మూరి ప్రతాప రెడ్డి, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నాయకుడు కెకె మహేందర్ రెడ్డి ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇంద్రకరణ్ రెడ్డి, నల్లగొండ జిల్లాకు చెందిన జిట్టా బాలకృష్ణా రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. రాజకీయాల్లో తల పండిన నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెసు సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి కూడా ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.

కెకె మహేందర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాపరెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డి తెరాసలో ముఖ్యమైన పాత్ర పోషించారు. తమకు తెరాసలో తగిన స్థానం లభించలేదనే ఉద్దేశంతో వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చారు. కెకె మహేందర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాపరెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డి హయంలో ఆయన హామీల మేరకు కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడ్డారు. అయితే, మారిన రాజకీయాలతో వైయస్ జగన్ పార్టీని ఏర్పాటు చేయడంతో వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చారు.

జిట్టా బాలకృష్ణా రెడ్డి తెరాస యువ విభాగంలో ఉండి పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆయన భువనగిరి శాసనసభా సీటును ఆశించారు. అయితే, తెలుగుదేశంతో పొత్తు కారణంగా మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డికి ఇవ్వాల్సి రావడంతో జిట్టాకు తెరాస టికెట్ లభించలేదు. కెకె మహేందర్ రెడ్డికి సిరిసిల్ల సీటును కెసిఆర్ ఆశ చూపినట్లు చెబుతారు. అయితే, ఆ సీటును కెసిఆర్ తన కుమారుడు కెటి రామారావుకు కేటాయించడంతో కెకె మహేందర్ రెడ్డి తిరుగుబాటు చేశారు.

ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఇంద్రకరణ్ రెడ్డి చాలా కాలంగా కాంగ్రెసులో పెద్దగా సందడి చేయడం లేదు. చాలా కాలం నుంచి ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ఉహాగానాలు చెలరేగుతూ వచ్చాయి. చివరికి ఊహాగానాలే నిజమయ్యాయి. ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డికి చాలా కాలం నుంచి కాంగ్రెసులో తగిన స్థానం లభించడం లేదు.

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తెలంగాణకు సంబంధించినంత వరకు బిసి, దళిత నాయకులకు ప్రాధాన్యం ఇస్తుండడంతో రెడ్డి నాయకులు ఆ పార్టీల్లో ప్రాధాన్యాన్ని కోల్పోతున్నట్లు భావిస్తున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన సంకినేని వెంకటేశ్వర రావు కూడా తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి వైయస్సార్ కాంగ్రెసు వైపు మళ్లారు. ఈ స్థితిలోనే రెడ్డి నాయకులు పలువురు జగన్ పార్టీ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు.

ఇంకా పలువురు రెడ్డి నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బాట పట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ వైయస్సార్ కాంగ్రెసులోకి వెళ్తారని కాంగ్రెసు సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెబుతూనే ఉన్నారు. లోకసభ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శానససభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని ఆయన చెబుతున్నారు. ఎన్నికలు సమీపించే నాటికి మరింత మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి జంప్ చేస్తారనే అభిప్రాయం బలంగా ఉంది.

English summary
In an abnormal developments in Telangana region caste is playing main role in politics. Reddy leaders are jumping into YS Jagan's YSR Congress party. Indrakaran Reddy and Jitta Balakrishna Reddy recently joined in YSR Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X