బలమే బలహీనత: జగన్ బ్యాలెన్స్ చేస్తారా, పట్టుతప్పుతారా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి 2014లో వలసలే బలమూ, బలహీనతగా కనిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు వచ్చినా లేక సాధారణ ఎన్నికలు జరిగినా జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని పలువురు నేతలు గట్టిగా విశ్వషిస్తున్నారు. దీంతో టిక్కెట్లు ఆశిస్తున్న పలువురు నేతలు జగన్ పార్టీలో చేరిపోతున్నారు.

పార్టీలోకి జోరుగా సాగుతున్న చేరికలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో తలనొప్పులు తీసుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రతో పార్టీలోకి చేరికలు మరింతగా పెరిగాయి.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల పాదయాత్రకు కూడా ప్రజల నుండి భారీగానే మద్దతు వస్తుంది. వీటిని ఓట్ల రూపంలోకి మార్చుకోవడంతో పాటు నేతల మధ్య అసంతృప్తిని జగన్ మొదట చల్లార్చవలసి ఉంటుంది.

జగన్ పార్టీలోకి నేతలు వరుసగా జాయిన్ అవుతున్నారు. తాజాగా గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత జగన్ పార్టీలో 4వ తేదిన జాయిన్ అవుతానని చెప్పారు.
2014లో టిక్కెట్లు ఆశిస్తున్న వారు ఆయన పార్టీ స్థాపించినప్పటి నుండే ఆయా నియోజకవర్గాలలో ఆయన పంచన చేరిపోయారు. ఇప్పుడు ఇదే జగన్‌కు రానున్న కాలంలో ఇబ్బందులు తెచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయా నియోజకవర్గాలలో టిక్కెట్లు ఆశిస్తున్న వారు ఇప్పటికే పార్టీలో ఉన్నప్పటికీ జగన్ పార్టీలోకి ఇంకా తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నుండి వలసలు కొనసాగుతున్నాయి.
ప్రధానంగా జగన్ పార్టీయే అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులకు గాలం వేస్తోందట. వారి వేసిన గాలానికి పలువురు ఇప్పటికే చిక్కుకున్నారు. ఇంకొందరు కూడా జగన్ వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. కొత్తగా వస్తున్న ప్రజాప్రతినిధులకు జగన్ ఖచ్చితంగా 2014లో టిక్కెట్ ఇస్తానని హామీ ఇస్తున్నారట. ఆ హామీతోనే వారు జగన్‌కు జై కొడుతున్నారట. అయితే కొత్త చేరికలు పాతవారికి ఏమాత్రం రుచించడం లేదట.
పార్టీ టిక్కెట్ ఆశించే వారిలో ఏ పార్టీలోనైనా ఎక్కువ మందే ఉంటారని, ఇది జగన్ పార్టీకి ఒక్కరికే సంబంధించిన విషయం కాదని తెలిగ్గా కొట్టిపారేయడానికి వీల్లేదని అంటున్నారు. కొత్త పార్టీ కావడమే కాకుండా ఇప్పటికే ఆశావహులు పార్టీలో చేరారు. ఇంకా చేరుతున్నారు. దీంతో తరుచూ ఆయా నియోజకవర్గాల్లో నేతల ప్రాధాన్యం మారుతూ వస్తోందట. ఉదాహరణకు ఖమ్మం టిక్కెట్‌పై పువ్వాడ అజయ్‌కు ముందు మరో నేత ఆశలు పెట్టుకున్నారట.
పువ్వాడ అజయ్ రాకతో ఆయన ఆశలు నీరుగారిపోయాయట. తాజాగా జలగం వెంకట్రావు రాకతో అజయ్ ప్రాధాన్యత తగ్గుతూ వస్తోందట. టిక్కెట్ అంశాన్ని ఇప్పుడే తేల్చక పోయినప్పటికీ మొదట ఆశలు పెట్టుకున్న వారు తర్వాత వచ్చిన వారి కారణంగా అసంతృప్తికి లోనవుతున్నారట. ఇలా వరుసగా ప్రాధాన్యం మారుతుండటంతో ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ క్యాడర్‌లో గందరగోళం ఏర్పడుతోందట.
మిగతా పార్టీల్లో పలువురు పలువురు ఆశావహులు ఉన్నప్పటికీ కొన్ని నియోజకవర్గాలకే ఉంటారు. టిడిపి లేదా కాంగ్రెసులలో ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఎవరో కేవలం స్థానికంగానే కాకుండా అందరికీ తెలిసి ఉంటుందనే చెప్పవచ్చు. కానీ జగన్ పార్టీలోకి టిక్కెట్ ఆశించి వచ్చిన పలువురు మాజీలు.. ఇప్పుడు టిడిపి, కాంగ్రెసు నుండి వస్తున్న ఎమ్మెల్యేల కారణంగా డైలామాలో పడుతున్నారట.
అయితే జగన్ వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారని ఇంకొందరు చెబుతున్నారు. ఇది ప్రతి పార్టీలో సాధారణమే కాబట్టి అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారట. మరోవైపు టిక్కెట్‌ను ఆశించి వచ్చిన వారిని వైయస్సార్ కాంగ్రెసు బుజ్జగించే ప్రయత్నాలు ఇప్పటి నుండే ప్రారంభించిందట.
ఎమ్మెల్యేలను తమ వైపుకు రప్పించుకుంటున్న వైయస్సార్ కాంగ్రెసు అంతకుముందు టిక్కెట్ ఆశించిన నేతలకు.. మన పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, అప్పుడు మంచి పదవులు ఇస్తామని చెప్పి సంతృప్తి పరిచే వ్యక్తం చేస్తున్నారట. మరికొందరు కోరుకున్న నియోజకవర్గం కాకుండా ఇతర నియోజకవర్గం దక్కవచ్చుననే ఆందోళనలో ఉన్నారట. షర్మిల పాదయాత్రతో చేరికలు మరింత జోరందుకున్నాయని కూడా చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications