• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మూడో'సారీ': నిమ్మాడ నుండి ఢిల్లీ వరకు...

By Srinivas
|

Errannaidu
హైదరాబాద్: శుక్రవారం తెల్లవారుజామున శ్రీకాకుళం జిల్లా రణస్థల వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎర్రన్నాయుడు అంతకుముందు రెండుసార్లు మృత్యువు నుండి తప్పించుకున్నారు. 2004లో సార్వత్రిక ఎన్నికలకు ఒకరోజు ముందు నక్సలైట్ల బాంబుదాడిలో ఆయన గాయపడ్డారు. ఆ తర్వాత 2006లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తుండగా కారు బోల్తా పడింది. ఈ రెండు ప్రమాదాల నుండి బయటపడిన ఎర్రన్నాయుడు మూడోసారి అభిమానులను, పార్టీని, జిల్లావాసుల్ని, సొంతూరి వారిని.. ఇలా అందర్నీ శోకసముద్రంలో ముంచి మృత్యు ఒడిలో చేరిపోయారు.

వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఎర్రన్నాయుడు కేంద్రమంత్రి వరకు ఎదిగారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కుడిభుజంగా నిలిచారు. 1957 ఫిబ్రవరి 23న శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళీ మండలం నిమ్మాడ గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో ఎర్రన్నాయుడు జన్మించారు. దాలి నాయుడు, కళావతమ్మ తల్లిదండ్రులు. వీరికి ఏడుగురు సంతానం. అందులో ఎర్రన్నాయుడు పెద్దవారు.

ఎర్రన్నాయుడు గారలో ఉన్నత విద్యను, టెక్కలిలో ఇంటర్మీడియేట్ విద్యను, విశాఖలో బిఎస్సీ చదివారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్‌బి చేశారు. ఉన్నత విద్యావంతుడు అయిన ఎర్రన్నాయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో రాజకీయాల పట్ల ఆసక్తి కనబరిచాడు. ఆయనకు విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి. 1982లో విజయ కుమారిని ఆయన వివాహం చేసుకున్నారు. ఆయనకు ఓ తనయుడు, ఓ కూతురు.

1983లో టిడిపిలో చేరినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా గెలుపొందారు. 11, 12, 13, 14వ లోకసభలకు 1996, 1998, 1999, 2004లో వరుసగా ఎన్నికయ్యారు. 1983, 1984, 1989, 1994లలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. శ్రీకాకుళం జిల్లా హరిశ్చంద్రాపురం నుండి తొలిసారి 1983లో ఎమ్మెల్యేగా గెలిచారు. రెండోసారి కూడా అక్కడి నుండే ప్రాతినిథ్యం వహించారు.

1989లో పార్టీ టిక్కెట్ నిరాకరించింది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా గెలుపొందారు. 1994-95 కాలంలో పార్టీ చీఫ్ విప్‌గా పని చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయనతో సన్నిహితంగా మెలుగుతూ.. పార్టీలో క్రియాశీలకంగా మారారు. 2009లో ఎర్రన్నాయుడు తన రాజకీయ జీవితంలో తొలి ఓటమిని ఎదుర్కొన్నారు.

ఆయన ఏనాడూ పార్టీ కార్యకలాపాలకు దూరం కాలేదు. నిత్యం పార్టీ అభివృద్ధి కోసం తపించేవారు. కార్యకర్తలను, నేతలను ఉత్సాహపరిచే వారు. నిత్యం ప్రజల్లో ఉండేవారు. జాతీయ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజకీయాలను పక్కన పెడితే వ్యక్తిగతంగా ఏ పార్టీ రాజకీయ నాయకుడి నుండి ఆయన వేలెత్తి చూపించుకున్నది లేదు. పార్టీ వృద్ధి కోసం ఆయన నిత్యం శ్రమించేవారు.

చంద్రబాబుకు కుడిభుజంగా మారి... ఆయనకు సలహాలు ఇస్తుండేవారు. ఎన్డీయే హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు. గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఆయన పని చేశారు. ఎర్నన్నాయుడుకి రాజకీయంలో ఓనమాలు నేర్పిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మించిన కృష్ణా జిల్లా అంటే ఎనలేని ప్రేమ. తరుచూ విజయవాడకు వచ్చి వెళ్లేవారు. జిల్లా టిడిపి నేతలు ఆయనను పెద్దన్నగా పిలుచుకునే వారు. జిల్లాలో ఏదైనా విభేదాలు పొడసూపినా ఆయన సఖ్యత కుదిర్చేవారు.

రైల్వేస్ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. పలు కమిటీలలో ఆయన మెంబర్‌గా వ్యవహరించారు. ఇటీవల జలదీక్ష పేరుతో వినూత్న నిరసన తెలిపారు. ప్రజల కోసం సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన తన కూతురు పేరిట భవాని చారిట్రబుల్‌ను స్థాపించారు. ఓసారి స్పీకర్ అయ్యే అవకాశం వచ్చింది. అయితే ఆ తర్వాత బాలయోగిని అది వరించింది. పుట్టిన ఊరులో ఆయన ఎవరైనా సార్ అని పిలిస్తే వద్దని చెప్పేవారు.

తనను చిన్నప్పటిలాగే అన్నా... తమ్ముడు అని పిలవమని చెప్పేవారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా మీడియా సోదరులను తమ్ముళ్లు అంటూ అప్యాయంగా పలు సందర్భాలలో అనేవారు. ఎర్రన్నాయుడు పార్టీలో గానీ ప్రభుత్వం పరంగా గానీ ఏ పదవి చేపట్టినా వన్నె తీసుకు వచ్చారని చంద్రబాబు, సోనియా గాంధీ, విజయమ్మ అందరూ కితాబిచ్చారు. కేవలం ఉత్తరాంధ్రకే కాకుండా ఆయన రాష్ట్ర నేతగా, టిడిపిలో ఓ ముఖ్యనేతగా ఎదిగారు. ఎర్రన్నాయుడు సొంత ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగారు.

English summary
Telugudesam Party senior leader Kinjarapu Errannaidu died in road accident on Thursday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X