యుపిఎకు అనుకూలం 253: వ్యతిరేకం 218
న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) అనుమతిపై లోకసభలో కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం నెగ్గింది. యుపిఎకు అనుకూలంగా 253 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 218 ఓట్లు వచ్చాయి. తీర్మానం నెగ్గేందుకు యుపిఎకు కావాల్సిన ఓట్లు 251 ఓట్లు. 22 మంది సభ్యులు గల ఎస్పీ 22 మంది సభ్యులు, 21 మంది సభ్యులు గల బిఎస్పీ సభ నుంచి వాకౌట్ చేసి, వోటింగులో పాల్గొనలేదు. దీంతో యుపిఎ ప్రభుత్వం నెగ్గింది. వోటింగులో 471 మంది సభ్యులు పాల్గొన్నారు.

ఎఫ్‌డిఐలపై ప్రతిపక్షాలు పెట్టిన తీర్మానం వీగిపోయింది. కాంగ్రెసు (206), డిఎంకె (18), ఆర్జెడి (4), ఎన్‌సిపి (9), ఇతరులు (21) ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయగా, ఎన్‌డిఎ (152), వామపక్షాలు (24), తృణమూల్ కాంగ్రెసు (19), ఎండిఎంకె (9), బిజెడి (14), తెలుగుదేశం (6), తెలంగాణ రాష్ట్ర సమితి (2) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేశాయి.
ఎఫ్‌డిఐలపై తీర్మానం నెగ్గేందుకు కాంగ్రెసు పార్టీ తీవ్రమైన కసరత్తే చేసింది. తెలంగాణపై తేల్చే వరకు పార్లమెంటుకు రాబోమని చెప్పిన తెలంగాణ పార్లమెంటు సభ్యులను బుజ్జగించి, తెలంగాణపై ఈ నెల 28వ తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి సభకు రప్పించింది. కేంద్ర మంత్రి పదవి దక్కకపోవడంతో అలిగిన కావూరి సాంబశివ రావును ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా ఫోన్ చేసి పార్లమెంటుకు రప్పించారు.
సిబిఐకి భయపడి ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు బిఎస్పీ, ఎస్పీ సభ నుంచి వాకౌట్ చేశాయని సుష్మా స్వరాజ్ విమర్శించారు. ఆ రెండు పార్టీలు వాకౌట్ చేయడం తమకు నైతిక విజయమని ఆమె వ్యాఖ్యానించారు. ఓటింగ్‌కు ముందు సభలో ఎఫ్‌డిఐలపై చర్చ వాడిగా, వేడిగా చర్చ జరిగింది.
చర్చకు వాణిజ్య శాఖ మంత్రి ఆనంద శర్మ సమాధానం ఇస్తున్న సమయంలో పలు మార్లు ప్రతిపక్ష సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ప్రతిపక్ష బిజెపి ప్రతిపాదించిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఆర్జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై సభా కార్యక్రమాలు కాసేపు స్తంభించాయి. తాను సెల్ ఫోన్ కూడా పెట్టుకోనని, బిజెపి నాయకులు మాత్రం గుండెలకు దగ్గరగా పెట్టుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి ఎఫ్‌డిఐలను వ్యతిరేకిస్తోందని ఆయన అన్నారు.