టి-ఎంపీల రాజీనామా ఎఫెక్ట్: 'తొందరొద్దు, ఢిల్లీకి రండి'

అయితే వారు రాజీనామాలపై నిర్ణయం తీసుకునేందుకు కెకె ఇంటిలో భేటీ జరుపుతుండగానే ఢిల్లీ పెద్దల నుండి వారికి ఫోన్ వచ్చింది. పార్టీ సీనియర్ నేత వాయలార్ రవి వారికి ఫోన్ చేసి.. రాజీనామాలపై తొందరపడవద్దని, ఢిల్లీకి వచ్చి కలవాలని వారికి సూచించారు. దీంతో రాజీనామాలు చేయాలనుకున్న ఎంపీలు ప్రస్తుతానికి తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. రేపు ఉదయం వారు ఢిల్లీకి వెళ్లనున్నారు.
కాంగ్రెసు పార్టీ పెద్దలను కలువనున్న ఎంపీలు తెలంగాణపై డిమాండ్ చేస్తారు. పార్టీ అధిష్టానం నుండి వచ్చే అభిప్రాయాన్ని బట్టి వారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణకు అనుకూలంగా కేంద్రం ఉన్నట్లుగా భావిస్తే వారు రాజీనామాలే చేయరు. తెలంగాణకు అనుకూలంగా లేనట్లుగా భావిస్తే వారు తమ రాజీనామాలను అక్కడే పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పించే అవకాశాలు ఉన్నాయి. రాజీనామాలతో పాటు రెండు పేజీల లేఖను కూడా వారు సోనియాకు ఇవ్వనున్నారు.
ఇప్పటికే తెలంగాణ ప్రాంత మంత్రులు తమకు తెలంగాణ వస్తుందన్న సంకేతాలు ఉన్నాయని చెప్పిన విషయం తెలిసిందే. మంత్రి జానా రెడ్డి సోమవారం మాట్లాడుతూ.. తెలంగాణపై తమకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని, అందుకే రాజీనామాలు చేయడం లేదని, రాష్ట్రం రాదని తెలిసిన పక్షంలో రాజీనామాకు సిద్ధమన్నారు.