హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ అవిశ్వాస వ్యూహం: జగన్, బాబులకు చిక్కులు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర శానససభ బడ్జెట్ సమావేశాలకు ముందే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించబోమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో, అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలా వద్దా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మల్లగుల్లాలు పడుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యూహాత్మకంగా ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తాము అవిశ్వాసం ప్రతిపాదిస్తామని కెసిఆర్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.

చంద్రబాబు నాయుడిని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చిక్కుల్లో పడేసేందుకే కెసిఆర్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని సోమవారం ఉదయమే తెరాస శానససభ్యుడు కెటి రామారావు విమర్శించారు. తెలుగుదేశం పార్టీని తెలుగు కాంగ్రెసు పార్టీగా కూడా ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం కాంగ్రెసు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు సిద్ధంగా లేవని చాటి చెప్పడానికి, తెలంగాణకు ఆ పార్టీలు వ్యతిరేకమని ప్రజల ముందు నిలపడానికి అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనను కెసిఆర్ అస్త్రంగా ఎంచుకున్నారని చెప్పవచ్చు.

ప్రభుత్వాన్ని పడగొట్టే బలం ప్రతిపక్షాలకు లేదని, అవిశ్వాసం పెట్టినా ప్రభుత్వం పడిపోదని తెలుగుదేశం నాయకులు వాదిస్తూ వస్తున్నారు. ఒకవేళ, వైయస్సార్ కాంగ్రెసుకు ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఉంటే తమ బలాన్ని ప్రదర్శించి, గవర్నర్ చేత ప్రభుత్వమే విశ్వాస తీర్మానం ప్రతిపాదించేలా చూడాలని వారంటున్నారు. ప్రభుత్వం పడిపోవడానికి కావాల్సిన బలం ప్రతిపక్షాలకు లేదని తెలుగుదేశం పార్టీ గట్టిగా వాదిస్తోంది. ముందస్తు ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్లనే టిడిపి అవిశ్వాసం ప్రతిపాదించడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు.

YS Jagan-Chandrababu Naidu-K Chandrasekhar Rao

అయితే, కాంగ్రెసు ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడుతున్నారని ఇటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో పాటు తెరాస కూడా విమర్శిస్తోంది. ప్రతిపక్షాల్లో ఎక్కువ సంఖ్యాబలం ఉన్న పార్టీగా తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలనేది తమ అభిప్రాయమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యురాలు శోభా నాగిరెడ్డి అన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితి చూస్తే మాత్రం ప్రభుత్వం పడిపోవడానికి అవకాశాలు లేవనే అంచనాలు సాగుతున్నాయి.

మొత్తం శాసనసభలో సభ్యుల సంఖ్య 294 కాగా, కాంగ్రెసు అధికారిక బలం 155. అయితే, కొంత మంది శానససభ్యులు ఇతర పార్టీలకు వెళ్లడంతో వాస్తవ బలం 147 ఉంది. అవిశ్వాస తీర్మానాన్ని ఓడించడానికి 146 మంది సభ్యుల బలం సరిపోతుంది. తెలుగుదేశం పార్టీ అధికారిక బలం 86 కాగా, కొంత మంది ఇతర పార్టీలకు వెళ్లడం ఆ బలం 76కు తగ్గింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారిక బలం 17 కాగా, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల సభ్యులు వచ్చి చేరడంతో దాని బలం 31కి పెరిగింది. తెరాస అధికారిక బలం 17 కాగా, ఇద్దరు సభ్యుల మద్దతు కారణంగా వాస్తవ బలం 19 ఉంది. మజ్లీస్‌కు ఏడుగురు సభ్యులున్నారు. సిపిఎం, లోకసత్తా సభ్యులు ఒక్కరేసి ఉన్నారు. సిపిఐ సభ్యులు నలుగురు, బిజెపి సభ్యులు ముగ్గురు, ఇతరులు ముగ్గురు ఉన్నారు. ఇద్దరు ఓటుకు అనర్హులు.

అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడానికి ఒక సభ్యుడు సంతకం చేస్తే సరిపోతుంది కానీ అది చర్చకు రావాలంటే కనీసం 30 మంది సభ్యుల బలం కావాలి. దానికోసమే కాకుండా కాంగ్రెసును మైనారిటీలో పడేయడానికి కెసిఆర్ కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. మజ్లీస్, సిపిఐ, సిపిఎం, లోకసత్తా, బిజెపి చీఫ్‌లతో కెసీఆర్ మాట్లాడి మద్దతు కోరారు. దాదాపుగా అందరూ సుముఖతనే వ్యక్తం చేసినట్లు కెసిఆర్ చెబుతున్నారు. నాగం జనార్దన్ రెడ్డి మద్దతు ఇస్తానని చెప్పినట్లు ఆయన తెలిపారు. ఈ సభ్యులతో అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

అవిశ్వాస తీర్మానాన్ని ఓడించడానికి కాంగ్రెసు ఇతర పార్టీలకు వెళ్లిన తమ శానససభ్యులపై అనర్హత వేటు వేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే కాంగ్రెసుకు సంఖ్యాబలం ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెసులో ఉన్న శానససభ్యులు ఫిరాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే మాత్రం ముప్పు తప్పదు. అలా జరగదనే ఉద్దేశంతోనే కాంగ్రెసు పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తమ బలం నిరూపించుకుంటామని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటించిన 24 గంటలలోగానే అందుకు సిద్ధపడుతూ కెసిఆర్ ప్రకటన చేశారు.

కాగా, శాసనసభ్యుల కోటా కింద ఆరో అభ్యర్థిని పెట్టడానికి కాంగ్రెసు వెనకాడడమే కెసిఆర్ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలనే నిర్ణయానికి రావడానికి ప్రధాన కారణమని అంటున్నారు. ఆరో అభ్యర్థిని పెడితే తెరా పార్టీ అభ్యర్థి మహమూడ్ అలీ గెలిచే అవకాశాలు సన్నగిల్లి ఉండేవి. ఓటమి కూడా తప్పేది కాదేమో. కానీ, కాంగ్రెసు ఆరో అభ్యర్థిని పెట్టే సాహసం చేయకపోవడం వెనక సంఖ్యాబలంపై సందేహాలే కారణమని కెసిఆర్ భావించినట్లు చెబుతున్నారు. కాంగ్రెసు శాసనసభ్యులు తిరుగుబాటు చేసిన తమ పార్టీ అభ్యర్థిని ఓడిస్తారనే భయమే కాంగ్రెసు ఆరో అభ్యర్థిని పెట్టకపోవడానికి కారణమని అంటున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసు ప్రభుత్వాన్ని కాస్తా కష్టపడితే పడగొట్టవచ్చుననే అభిప్రాయానికి కెసిఆర్ వచ్చినట్లు చెబుతున్నారు.

అవిశ్వాస తీర్మానానికి వైయస్సార్ కాంగ్రెసు సహకరిస్తే ప్రభుత్వం ఇబ్బందులో పడడం తప్పదని కెసిఆర్ అనుకుంటున్నట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా చంద్రబాబును ఎండగట్టవచ్చునని కూడా ఆయన అనుకున్నట్లు చెబుతున్నారు. ఏమైనా, కెసిఆర్ వైయస్ జగన్, చంద్రబాబులకు సవాల్ విసిరినట్లుగానే భావిస్తున్నారు.

English summary
In a strategy to expose YSR Congress president YS Jagan and Telugudesam president N Chandrababu Naidu, KCR has decided propose no confidence motion.Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao has stated that his party will propose No Confidence Motion on CM Kiran Kumar Reddy's government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X