చంపేశారు: రాంసింగ్ తండ్రి, థ్రిల్ లేదు: విక్టిమ్ బ్రదర్

ఆరు రోజుల క్రితం తాను కోర్టులో తన కుమారుడిని కలిశానని, తన ప్రాణాలకు ముప్పు ఉందని అతను తనకు చెప్పాడని, తన సహచర ఖైదీలు తన పట్ల అసహజంగా ప్రవర్తించారని తన కుమారుడు తనతో చెప్పినట్లు రాంసింగ్ తండ్రి మాంగే లాల్ సింగ్ చెప్పాడు.
ఒక్క చేతితో తన కుమారుడు ఎలా ఆత్మహత్య చేసుకుంటాడని ఆయన ప్రశ్నించాడు. అరెస్టు చేసిన తర్వాత తనను హింసించిన ఆనవాళ్లను తన కుమారుడు తనకు చూపించాడని రాంసింగ్ తల్లి కల్యాణీదేవి అంటోంది. "అతను తప్పు చేశాడు. దాన్ని అతను అంగీకరించాడు. ఒక్క తప్పును దేవుడు కూడా క్షమిస్తాడు" అని ఆమె అన్నది. పశ్చాత్తాపం వ్యక్తం చేసే అవకాశం కూడా అతని ఇవ్వలేదని ఆమె అన్నది.
రాంసింగ్ మృతిని హత్యగా పరిగణించాలని అతని తరఫు న్యాయవాది వికె ఆనంద్ అన్నారు. తన క్లయింట్ ఆత్మహత్య చేసుకునేవాడు కాదని, తాను రోజూ అతనితో సంబంధాల్లో ఉన్నానని న్యాయవాది చెప్పారు. ఆత్మహత్య చేసుకుని ఉంటే సూసైడ్ నోట్ రాసి ఉండేవాడని అన్నారు. రాంసింగ్ మృతిపై స్వతంత్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడానికి సిసిటివీ ఫుటేజ్ కూడా లేదని, గత రెండు నెలల కాలంలో రాంసింగ్‌ను చిత్రహింసలకు గురి చేశారని ఆయన అన్నారు. రాంసింగ్ కుటుంబ సభ్యుల వ్యాఖ్యలపై తాము ప్రస్తుతం ఏమీ మాట్లాడదలుచుకోలేదని తీహార్ జైలు అధికారులు అంటున్నారు. అధికారిక విచారణలో విషయాలు బయటపడతాయని వారన్నారు.
రాంసింగ్ మృతిపై తమ మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్‌పిఎన్ సింగ్ చెప్పారు. తీహార్ జైలు అధికారులు విడిగా విచారణకు ఆదేశించారు.
రాంసింగ్ ఆత్మహత్యతో తాము థ్రిల్లేమీ ఫీల్ కాలేదని ఢిల్లీ సామూహిక అత్యాచార బాధితురాలి సోదరుడు అన్నారు. తాను చావబోతున్నాననే విషయం రాంసింగ్‌కు తెలుసునని, అతనికి వ్యతిరేకంగా అందుకు తగిన సాక్ష్యాధారాలున్నాయని అతను అన్నాడు. రాంసింగ్‌ను బహిరంగంగా ఉరి తీయాలని తాము కోరుకున్నామని అన్నారు.












Click it and Unblock the Notifications