హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సడక్ బంద్ టెన్షన్: ఎవరి పట్టు మీద వారే

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: కర్నూలు, హైదరాబాద్ జాతీయ రహదారిపై తెలంగాణ జెఎసి రేపు (గురువారం) తలపెట్టిన సడక్ బంద్ సందర్భంగా టెన్షన్ చోటు చేసుకుంది. బంద్‌కు అనుమతి లేదని సైబరాబాద్ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమల రావు చెప్పారు. సడక్ బంద్ నిర్వహించి తీరుతామని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అంటున్నారు. ఇరు వైపులా ఎవరి పట్టు మీద వారు ఉండడంతో ఉత్కంఠ చోటు చేసుకుంది. సడక్ బంద్‌ను విఫలం చేయాలని ప్రభుత్వం పోలీసు వైపు నుంచి అన్ని చర్యలూ తీసుకుంటుండగా, బంద్‌ను విజయవంతం చేయాలని తెలంగాణ జెఎసి వ్యూహరచన చేసింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ ఏడో జాతీయ రహదారిని దిగ్బంధం చేయాలని తెలంగాణ జెఎసి నిర్ణయించింది. ఈ సడక్ బంద్‌కు అనుమతివ్వాలని తెలంగాణ మంత్రులు చేసిన విజ్ఞప్తిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. దీన్నిబట్టి సడక్ బంద్‌పై కఠినంగా వ్యవహరించాలని ఆయన అనుకుంటున్నట్లు అర్థమవుతోంది.

అనుమతి లేదు...

సడక్ బంద్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపినట్లు ద్వారకా తిరుమల రావు చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ఆయన సూచించారు. ఏడో జాతీయ రహదారిపై కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఉద్యమకారులు నిబంధలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఇతర జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ఆయన సూచించారు. రహదారిపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

ఏ శక్తీ ఆపలేదు..

సడక్ బంద్‌కు అనుమతి ఇవ్వకపోవడంపై తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెసు ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గరపడ్డాయని ఆయన అన్నారు. సడక్ బంద్‌కు మద్దతుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చేపట్టిన బైక్ ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేస్తుంటే నేరంగా పరిగణిస్తున్నారని, దొంగలపై మాదిరిగా బైండోవర్ కేసులు పెడుతున్నారని కోదండరామ్ విమర్శించారు. తమను ఏ శక్తులూ ఆపలేవని ఆయన అన్నారు. ఎవరికీ భయపడవద్దని, సడక్ బంద్‌కు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

సడక్ బంద్‌కు బిజెపి మద్దతు ప్రకటించింది. తమ పార్టీ కార్యకర్తలు, నేతలు సడక్ బంద్‌లో పాల్గొంటారని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కీలకమైన చోట్ల తెరాస ముఖ్య నేతలు

సడక్ బంద్‌లో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఏర్పాట్లు చేసుకుంది. శంషాబాద్ నుంచి ఆలంపూర్ దాకా జాతీయ రహదారిని స్తంభింపజేయాలని నిర్ణయించింది. సడక్ బంద్‌ను విజయవంతం చేయాలని తెరాస నాయకులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. కీలకమైన ప్రదేశాల్లో తెరాస శాసనసభ్యులు పాల్గొంటారు. శంషాబాద్ వద్ద హరీష్ రావు, స్వామిగౌడ్, మహ్మద్ అలీ, పోచారం శ్రీనివాస రెడ్డి, హరీశ్వర్ రెడ్డి పాల్గొంటారు.

జడ్చర్ల వద్ద ఏనుగు రవీందర్ రెడ్డి, కెటిఆర్, గంపా గోవర్ధన్, చెన్నమనేని రమేష్, భూత్పూర్ వద్ద పాతూరి సుధాకర్ రెడ్డి, సోమారపు సత్యనారాయణ, వినయ్ భాస్కర్, విద్యాసాగరరావు పాల్గొంటారు. కొత్తకోట వద్ద డాక్టర్ రాజయ్య, కొప్పుల ఈశ్వర్, జోగు రామన్న, మొలుగూరి బిక్షపతి పాల్గొంటారు. ఆలంపూర్ వద్ద ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణా రావు, కావేటి సమ్మయ్య, నల్లాల ఓదేలు, అరవింద్ రెడ్డి సడక్ బంద్‌లో పాల్గొంటారు.

సాధించేది ఏమీ లేదు...

సడక్ బంద్ వల్ల సాధించేది, సంపాదించేది ఏమీ లేదని కాంగ్రెసు శానససభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి అన్నారు. ఉద్యమాలతో కోదండరామ్ ఇన్నాళ్లు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సడక్ బంద్‌తో మరింత నష్టం జరుగుతుందని ఆయన అన్నారు.

English summary
Tension prevailed during the sadak bandh on March 21 on number 7 national high way proposed by Telangana JAC. Telangana Rastra Samithi (TRS) leaders will participate in Sadak bandh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X