వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ భార్య భారతి రైటర్: సాక్షి డైలీలో ఆర్టికల్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Bharathi
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతి రచయితగా కూడా మారినట్లున్నారు. ఇదేం న్యాయం అనే శీర్షిక కింద భారతి రాసిన వ్యాసం ఆర్టికల్ బుధవారం సాక్షి దినపత్రికలో అచ్చయింది. తన భర్త వైయస్ జగన్‌ను సమర్థిస్తూ ఆమె ఈ వ్యాసం రాశారు. ఆ వ్యాసాన్ని ఇక్కడ యధాతథంగా ఇస్తున్నాం. చదవండి...

జగన్ ఒక ప్రజా ప్రతినిధి. జనమంతా ఒక్కటై 5 లక్షల 43 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపిన నాయకుడు. తన నేతృత్వంలో జరిగిన ఉప ఎన్నికల్లో 18 సీట్లకు గాను 15 సీట్లను గెలుచుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు. నేరుగా గెలిచినవారు, అభిమానిస్తూ ఇతర పార్టీల్ని ధిక్కరించి వచ్చినవారు కలిసి ఆయన పార్టీకి 33 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీల బలముంది. అలాంటి నేతను జనానికి దూరం చేసి.. 11 నెలలుగా జైల్లో అన్యాయంగా నిర్బంధించారు. పైగా ఇపుడు మరింత లోతైన కుట్రలకు దిగుతున్నారు. అంతకంతకూ ప్రజాదరణ పెరుగుతున్న రాజకీయ పార్టీకి అధ్యక్షుడై ఉండి కూడా తన భార్యా బిడ్డలతో కలిపి.. వారానికి 8 మందినే కలుస్తున్నా, దానిక్కూడా దూరం చేసే పన్నాగాలు పన్నుతున్నారు. ఇంతటి హేయమైన రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా? ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా?

ఎవరినైనా అరెస్టు చేస్తే మూడు నెలల్లో దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీటు వేయాలని, తరవాత బెయిలు ఇవ్వవచ్చని చట్టం చెబుతోంది. ఒకవేళ మూడు నెలల్లో చార్జిషీటు వేయకుంటే ఆటోమేటిగ్గా బెయిలివ్వాలని కూడా అదే చట్టం చెబుతోంది. కానీ జగన్ విషయంలో ఈ రెండూ పాటించలేదు. దర్యాప్తు పూర్తి చేయలేదు కానీ చార్జిషీట్లు మాత్రం వేస్తున్నారు. ఇదెక్కడి అన్యాయం? మనిషికో న్యాయం అన్నట్టుగా ఉంది పరిస్థితి. మంత్రులకో న్యాయం, చంద్రబాబుగారికో న్యాయం.. జగన్ గారికి మాత్రం వేరే న్యాయం!! కేసులు వేయటం మొదలుకొని అంతా చంద్రబాబు గారు, కాంగ్రెస్ పెద్దలు కలిసే చేశారు. చివరకు అవిశ్వాస తీర్మానంపై కూడా చంద్రబాబు ప్రజల తరఫున నిలబడకుండా నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీకి సహకరించారు. వాటికి పరాకాష్టగా అన్నట్లు ఇపుడు ఇద్దరూ ఒకటై జగన్ వారానికి తన భార్యాబిడ్డలతో సహా 8 మందిని కలుస్తుండటంపైనా అన్యాయమైన అబద్ధాలు ఆడుతున్నారు. వారిని కూడా కలవకుండా నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. జైల్లో కొత్తగా వీడియో కెమెరాలు పెట్టారు. ఎన్నడూ లేని విపరీతమైన నిబంధనలు విధిస్తున్నారు. అన్నిటికీ అబద్ధాలు జోడిస్తూ ఇంతటి దిగజారుడు రాజకీయాలు అవసరమా? ఇదే చంద్రబాబో, కిరణ్‌గారో లోపల ఉంటే... తాము కూడా ఇలాగే తమ భార్యాబిడ్డలతో సహా వారానికి 8 మందినే కలవాలి అంటే వాళ్లు, వాళ్ల వెనకున్న పార్టీలు ఊరుకుంటాయా? వారిని కూడా బెయిలు రాకుండా, నేరం రుజువు కాకుండా 11 నెలలు నిర్బంధించి ఉండేవారా? ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి... జరుగుతున్నదంతా కరెక్టేనా? ఒక్కసారి కూడా మీ మనస్సాక్షి మిమ్మల్ని ప్రశ్నించలేదా?

అయినా రాష్ట్రంలో జగన్ తప్ప వేరే సమస్యలు లేవా? తాగేందుకు నీళ్లు లేక, పొలాలకు కరెంటు లేక, పరిశ్రమలు మూతబడుతున్నా, రాష్ట్రం కుదేలైపోతున్నా పట్టించుకోకుండా జగన్‌ను మాత్రమే టార్గెట్ చేస్తూ ఈ కుమ్మక్కు రాజకీయాలేంటి? ఏం! జగన్‌పై కేసు వేసిన శంకర్రావు అదే నోటితో కిరణ్‌పై ఎన్ని ఆరోపణలు చేయలేదు? తందానా అంటూ శంకర్రావుతో కలిసి జగన్‌పై కేసు వేసిన చంద్రబాబు కిరణ్‌పై ఎందుకు మాట్లాడరు? ఆయనపై కేసెందుకు వేయరు? ఒక ఐఎంజీ కేసులోనో, మరో ఎమ్మార్ కేసులోనో చంద్రబాబుపై విచారణ జరిపించాలని కిరణ్ ఎందుకు భావించటంలేదు? ఇద్దరూ ఒకరినొకరు కాపాడుకుంటే సరిపోతుందా? నమ్మి ఓట్లేసిన ప్రజలను గాలికి వదిలేసిన చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయాలను జనం గమనించటం లేదనుకుంటున్నారా? మూడో పార్టీ గాని, మూడో వ్యక్తిగాని ఉండకూడదు అని కాంగ్రెస్ పెద్దలతో కలిసి బాబు చేస్తున్న హేయమైన రాజకీయాలు ఇంకెన్నాళ్లు?

జగన్ చేసిన నేరమేంటి? జనం కోసం పోరాడటమేనా? ఒక అన్నగా, తమ్ముడిగా, బిడ్డగా, మనవడిగా జనంతో మమేకమైపోయి వారితో కలిసి తిరగటమే ఆయన తప్పా? భోగభాగ్యాల్లో పుట్టి, కష్టమంటే ఏంటో తెలియకుండా పెరిగినా... జనం కోసం, వారికిచ్చిన మాట కోసం మూడేళ్లపాటు ఎండనక, వాననక, పగలనక, రాత్రనక, భార్యాబిడ్డలకు సైతం దూరంగా ఓదార్పు యాత్ర చేయటమే నేరమా? తమ దగ్గరకు వచ్చిన జగన్‌ను జనం అక్కున చేర్చుకోవటం తప్పా? అది సహించలేక మీరు ఇన్ని రకాలుగా మమ్మల్ని వేధిస్తారా? అక్రమంగా అరెస్టు చేయటమే కాక... దర్యాప్తు పూర్తి చేయకుండా, సుప్రీంకోర్టును సైతం ధిక్కరిస్తూ జగన్‌ను 11 నెలలపాటు నిర్బంధించటం కరెక్టా? పెపైచ్చు ఆయన్ను చూడటానికి నాకు, నా పిల్లలకు ఉన్న హక్కులను సైతం కాలరాసే ప్రయత్నం చేస్తున్నారంటే ఇంతకన్నా ఘోరం ఉంటుందా? మాపై వేధింపులకు ఇది పరాకాష్ట కాదా? మా మామ రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో దగ్గరైన నాయకుడు. చంద్రబాబు గారితో కలిసి పనిచేశారు.

కిరణ్ కూడా మా మామ వెనకాల నడిచిన మనిషే. ఈ రాష్ట్రంలో తిరుగులేని జనాదరణ ఉన్న మా కుటుంబమే మా హక్కులను కాపాడుకోవటానికి ఇంతలా పోరాడాల్సి వస్తోంది. మా పరిస్థితే ఇలా ఉంటే లక్ష్మీపేటలో ఊచకోతకు గురైనవారో, తెనాలిలో దాష్టీకానికి బలైపోయిన బాధితురాలో వాళ్లను వాళ్లు కాపాడుకోగలరని ఎలా అనుకుంటాం? ఈ ప్రభుత్వం వాళ్లను రక్షిస్తుందని ఎలా నమ్మగలం? జగన్‌ను టార్గెట్ చేయటం కోసం, తమను తాము కాపాడుకోవటం కోసం ప్రభుత్వంతో అంటకాగుతున్న ప్రధాన ప్రతిపక్షం... ఈ జనానికి ఏం భరోసా ఇవ్వగలదు? వీళ్లంతా జనాన్నేం పట్టించుకుంటారు?
చంద్రబాబు గానీ, ఆయనతో కుమ్మక్కయిన కాంగ్రెస్ పెద్దలు గానీ ఒక్కటి గమనించాలి. ఈ అన్యాయాన్ని ఎవరూ చూడటం లేదని వారు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఆ దేవుడు పై నుంచి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఇచ్చిన మాట కోసం ఇన్ని కష్టాలను ఎదుర్కొంటున్న జగన్ వ్యక్తిత్వాన్ని... రాజకీయంగా విభేదించినందుకు దారుణమైన పగతో కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న అన్యాయమైన రాజకీయాలను చూస్తూనే ఉన్నాడు. ఇది నిజం. ఇదే నిజం...!!

English summary

 YSR Congress president YS Jagan's wife YS Bharathi has written an article in her Sakshi daily. She supported her husband in her article.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X