క్రైమ్ నోట్స్: తెరాస నేత హత్య, డ్రగ్స్ ముఠా పట్టివేత

హైదరాబాద్ నగరంలోని మీర్‌పేట దాస్‌నగర్‌లో విషాదం నెలకొంది. కల్తీ కల్లు తాగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దీంతో ఆగ్రహించిన మృతుల బంధువులు శనివారం ఉదయం కల్లు కాంపౌండ్ వద్ద ఆందోళనకు దిగారు.
రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలం ఘనపురంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత అమృతం పేటల్ హత్యకు గురయ్యారు. రాజకీయ కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.
దొంగల ముఠా పట్టివేత..
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నవారిని నల్లగొండ జిల్ాల నేరేడుచర్ల పోలీసులు పట్టుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కల్లేపల్లి రవీందర్, నేరేడుచర్లకు చెందిన వి జనార్దన్ కలిసి ఈ దొంగతనాలు చేసినట్లు హుజుర్నగర్ సిఐ విజయ్ కుమార్ చెప్పారు.
విజయ్‌కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం - నిందితుల నుంచి 4 ట్రాక్టర్లు, మూడు ట్రాక్టర్ ట్రాలీలు, నాలుగు మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వీరు ఈ వాహనాలను దొంగిలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
ప్రకాశం జిల్లాలోని తాళ్లూరు మండలం రాంభద్రాపురంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. బొప్పాయ్లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 15 మంది కూలీలు తీవ్రంగా గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. లారీలో మొత్తం 27 మంది కూలీలు ఉన్నారు. కూలీలంతా ఎర్రగొండపాలెంకు చెందిన వారుగా తెలుస్తోంది.
దోపిడీకి గురైన తల్లీకూతుళ్లు
కర్నూలులోని తల్లీకూతుళ్లు బస్సు ఎక్కి వెళ్తుండగా దోపిడీకి గురయ్యారు. దుండగులు వారి నుంచి రూ.2.5 లక్షల విలువైన నగలను, రూ.7 వేల నగదును దోచుకెళ్లారు.
విశాఖపట్నంలోని ఆర్కేబీచ్లో శనివారం ఉదయం ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. వెంటనే స్పందించిన పోలీసులు చిన్నారుల కోసం మెరైన్ బోట్లో గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారుల వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది.
ధాన్యం వ్యాపారి హత్య
తూర్పు గోదావరి జిల్లాలో ఓ ధాన్యం వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. శంకవరం మండలం గౌరంపేటకు చెందిన వీరబాబును దుండగులు దారుణంగా హత్య చేశారు. తల, మొండెం వేరు చేశారు. భారీగా నగదు దోచుకెళ్లారు. సమాచారం అందుకును్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.