వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సబిత ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు రాజీనామా

By Pratap
|
Google Oneindia TeluguNews

Dharmana - Sabitha
హైదరాబాద్: మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రారెడ్డి పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెసు అధిష్టానం సూచనతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని వారిని ఆదేశించినట్లు సమాచారం. ఆదివారం రాత్రి ఇరువురు మంత్రులు కూడా ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. పార్టీ అధిష్టానం చేసిన సూచనలను ముఖ్యమంత్రి వారికి వివరించినట్లు తెలుస్తోంది. దాంతో ఇరువురు కూడా మంత్రి పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రికి అందజేశారు.

సబితా ఇంద్రారెడ్డి సొంత వాహనంలో ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి, సొంత వాహనాల్లో వెళ్లిపోయారు. ముఖ్యమంత్రితో వారిద్దరు దాదాపు 45 నిమిషాల పాటు సమావేశమయ్యారు. సొంత పార్టీవాళ్లే అనవసర రాద్ధాంతం చేశారని వారిద్దరు ముఖ్యమంత్రి వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో వారిద్దరి పేర్లను సిబిఐ చార్జిషీట్లలో నిందితులుగా చేర్చింది. దీంతో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి వారిద్దరి చేత రాజినామా చేయించారు.

మీడియాతో మాట్లాడకుండా సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద రావు వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడడానికి వారు నిరాకరించారు. మొత్తం వ్యవహారంలో తాను బలిపశువును అయ్యానని ధర్మాన ప్రసాద రావు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మొదట రాజీనామా చేసినప్పుడే ఆమోదించి ఉంటే ఈ సమస్య ఉండేది కాదని కూడా ఆయన అన్నట్లు తెలుస్తోంది. రక్షించడానికి తాను చాలా ప్రయత్నించానని, అధిష్టానం వినలేదని ముఖ్యమంత్రి వారికి చెప్పినట్లు సమాచారం. మీరు తప్పు చేయలేదని ఫైళ్ల వివరాలతో సహా వివరించానని, అధిష్టానం నమ్మినట్లు కనిపించినా నైతికంగా రాజీనామా చేయాల్సిందేనని అధిష్టానం అభిప్రాయపడిందని ముఖ్యమంత్రి వివరించినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు అశ్విని కుమార్, పవన్ కుమార్ బన్సాల్ రాజీనామా చేయడమే సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు కొంప ముంచిందని అంటున్నారు.

సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు రాజీనామాల నేపథ్యంలో వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మిగతా ముగ్గురు మంత్రులు కూడా రాజీనామాలు చేయాల్సి వస్తుందని అంటున్నారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ అరెస్టు చేసిన వెంటనే మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన పేరును చార్జిషీట్‌లో చేర్చిన వెంటనే ధర్మాన ప్రసాద రావు రాజీనామా లేఖ సమర్పించారు. కానీ, ముఖ్యమంత్రి రాజీనామాను ఆమోదించలేదు. ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డిని సిబిఐ వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితురాలిగా చేర్చింది. దాంతో రాజీనామా చేయాడనికి ఆమె కూడా ముందుకు వచ్చారు. అయితే, ముఖ్యమంత్రి ఆమెను నిలువరించారు.

ప్రతిపక్షాల నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం పెద్దలు కళంకిత మంత్రుల చేత రాజీనామాలు చేయించాల్సిందేనని ముఖ్యమంత్రికి సూచించింది. అధిష్టానంతో చర్చలు పూర్తి చేసుకుని ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఇరువురు మంత్రులను తన నివాసానికి పిలిపించి, రాజీనామాలు ఎట్టి పరిస్థితుల్లో అడగాల్సి వస్తోందో వివరించారు.

వివాదాస్పద జీవోలు జారీ చేసిన మరో ముగ్గురు మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మినారాయణ కూడా రాజీనామాలు చేయాల్సి రావచ్చునని అంటున్నారు. అయితే, ఇప్పుడే వారి చేత రాజీనామాలు చేయిస్తారా, సిబిఐ చార్జిషీట్లు జారీ చేయిస్తారా అనేది తేలాల్సి ఉంది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ మరో ఐదు చార్జిషీట్లను దాఖలు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ ఐదు చార్జిషీట్లలో ఆ ముగ్గురు మంత్రుల పేర్లను నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. మరో మంత్రి పార్థసారథి ఫెమా ఉల్లంఘన కేసును ఎదుర్కున్నారు. ఆ ముగ్గురు రాజీనామాలు చేయాల్సి వస్తే పార్థసారథి కూడా రాజీనామా చేయాల్సి రావచ్చునని అంటున్నారు.

English summary
Ministers Sabitha Indra Reddy and Dharmana Prasad Rao, accused in YSR Congress party president YS Jagan DA case resigned after meeting with CM Kiran kumar Reddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X