వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మర్యాద రామన్నకు మసి: రాజస్థాన్ రాయల్స్ చిత్తు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: క్రికెట్ క్రీడా ప్రపంచంలో మర్యాద రామన్నగా పేరు గాంచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రాహుల్ ద్రావిడ్‌ను ప్రస్తుతం అత్యంత విషాదం ఆవరించే ఉంటుంది. తాను కనీవినీ ఎరుగుని రీతిలో జట్టు ఆరోపణల్లో కూరుకుపోవడం అతని మనసును కష్టపెట్టే ఉంటుంది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు అరెస్టు కావడం దగ్గరి నుంచి జట్టు సహ యజమాని రాజ్ కుంద్రాను పోలీసులు ప్రశ్నించడం వరకు జరిగిన వ్యవహారాలు ద్రావిడ్‌కు ఏదో మేరకు మసి పూశాయి. రాజస్థాన్ రాయల్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా విజయాలను సాధించిన నేపథ్యంలో ఆ ఆనందం ద్రావిడ్‌కు దక్కకుండా పోయింది.

వివాదంతోనే ఐపియల్ మొదలు...

కాగా, అసలు ఈ ఏడాది ఐపియల్ వివాదాలతోనే ప్రారంభమైంది. శ్రీలంకలో తమిళ జాతీయుల పట్ల ఊచకోతను నిరసిస్తూ ఐపియల్ జట్లలో శ్రీలంక ఆటగాళ్లు ఉండడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి జయలిలత వివాదం చేశారు. దాంతో చెన్నైలో జరిగే మ్యాచుల్లో శ్రీలంక ఆటగాళ్లు లేకుండా చూసుకుని బిసిసిఐ కాస్తా సర్దుబాటు ధోరణి ప్రదర్శించింది. అది సర్దుబాటు అయిందని అనుకుంటున్న తరుణంలో మే 16వ తేదీన స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై పోలీసులు రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ముగ్గురు క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్‌లను అరెస్టు చేశారు.

Rajasthan Royals

తీగ లాగితే డొంక కదిలినట్లు ఐపియల్ వ్యవహారం మొత్తం వివాదంలో పడిపోయింది. అండర్ వరల్డ్, బుకీల లింక్ దేశాన్ని కుదిపేసే పరిస్థితిని కల్పించింది. వాటితో పాటు బెట్టింగ్ వ్యవహారాల్లో బాలీవుడ్ నటుడు విందూ దారాసింగ్, గురునాథ్ మేయప్పన్ అరెస్టు కావడం తీవ్ర సంచలనానికి కారణమైంది. గురునాథ్ మేయప్పన్ ప్రిన్సిపల్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై నీలినీడలు అలుముకున్నాయి. దాంతో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆయన భార్య సాక్షి కూడా వివాదంలో చిక్కుకున్నారు. వారి వ్యాపార సంబంధాలపై దుమారం చెలరేగుతూ ఉన్నది.

ద్రావిడ్ మనసుకు గాయం..

రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సహ యజమానులు రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి దంపతులను వివాదం చుట్టుముట్టింది. రాజ్ కుంద్రా అరెస్టు కావచ్చునని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, కుంద్రా బెట్టింగుకు పాల్పడినట్లు బలమైన సాక్ష్యాధారాలు లభించడం లేదని, అలాగని క్లీన్ చిట్ ఇవ్వలేమని పోలీసులు గురువారంనాడు అన్నారు. శిల్పా శెట్టిని కూడా పోలీసులు విచారించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ వివాదాల నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్‌ను కూడా పోలీసులు విచారిస్తారని అంటున్నారు. ఆటగాళ్ల అరెస్టు నుంచి కుంద్రా విచారణ వరకు ద్రావిడ్ మనసును కష్టపెట్టేవే.

ప్రస్తుతానికి శిల్ఫాశెట్టిని విచారించబోమని పోలీసులు అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఆమెను విచారించే విషయం తోసిపుచ్చలేని విషయంగా మారింది. కుంద్రా, శిల్పా శెట్టి బెట్టింగుకు పాల్పడినట్లు కుంద్రా వ్యాపార భాగస్వామి ఉమేష్ గోయంకా పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వారిద్దరిపై నీలినీడలు అలుముకున్నాయి.

మీడియాపై శిల్పా శెట్టి విమర్శలు

తాను బెట్టింగుకు పాల్పడలేదని శిల్పా శెట్టి స్పష్టం చేశారు. తాను ఓ రోజు కూడా బెట్టింగుకు పాల్పడలేదని, బెట్టింగుకు పాల్పడినట్లు తనపై వస్తున్న ఆరోపణలు మతిలేనివని, సత్యం నిలుస్తుందని ఆమె ట్వీట్ చేశారు. తాను క్రికెట్‌ను ప్రేమిస్తానని, ఆ అభిమానమే ఐపియల్‌లో తనను భాగస్వామిని చేసిందని ఆమె అన్నారు. తన భర్త కుంద్రాను కూడా ఆమె వెనకేసుకొచ్చింది. మీడియాపై ఆమె దుమ్మెత్తి పోసింది.

రాజస్థాన్ రాయల్స్ యజమానులుగా తాము ఏ విధమైన తప్పు చేయలేదని ఆమె స్పష్టం చేశారు. ఉమేష్ కుంద్రా పేరును దుర్వినియోగం చేశాడని ఆమె ఆరోపించింది. పోలీసులకు తాము పూర్తిగా సహకరిస్తామని ఆమె చెప్పింది. పోలీసులు కుంద్రాను విచారించడం అతి సాధారమైన విషయమని ఆమె బుధవారంనాడు అన్నారు. రాజ్ కుంద్రాను పోలీసులు బుధవారంనాడు గంటల తరబడి ప్రశ్నించారు.

కుంద్రా డబ్బులు పారేసుకున్నారు..

బెట్టింగులో రాజ్ కుంద్రా చాలా సొమ్మును పోగొట్టుకున్నారని ఢిల్లీ పోలీసులు గురువారం చెప్పారు. దాదాపు కోటి రూపాయల దాకా కుంద్రా కోల్పోయాడని వార్తలు వస్తున్నాయి. తన జట్టుపైనే బెట్టింగ్ కట్టినట్లు కుంద్రా అంగీకరించినట్లు కూడా పోలీసులు చెప్పారు. తన వ్యాపారి భాగస్వామి ఉమేష్ గోయంకా అనే బుకీ ద్వారా అతను బెట్టింగుకు పాల్పడినట్లు ఢిల్లీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ చెప్పారు. కుంద్రా బెట్టింగుకు పాల్పడ్డాడు గానీ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇది ఒక మేరకు ఊరట.

ఐపియల్ ఫ్రాంచైజీ యజమాని చిక్కుల్లో పడడం ఇది రెండో సంఘటన. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రిన్సిపల్ గురునాథ్ మేయప్పన్ బెట్టింగు వ్యవహారంలో అరెస్టయి బెయిల్‌పై విడుదలయ్యారు. రాజ్ కుంద్రా పరిస్థితి గాలిలో తేలుతోంది.

English summary
Bollywood actress and Rajasthan Royals co-owner Shilpa Shetty has denied her involvement in IPL betting. The actor tweeted: "For those who care,my apparent involvement in betting is complete nonsense nd I have never bet on any cricket match ever.Truth will prevail."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X