• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చలో అసెంబ్లీ: తెలంగాణ దెబ్బకు కిరణ్‌ ఠా, ఢిల్లీకి సెగ?

By Srinivas
|

 Kiran Kumar Reddy and Sonia Gandhi
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇబ్బందులు తెచ్చి పెట్టిందా? అంటే అవుననే చెప్పవచ్చు. తెలంగాణ విషయమైనా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లేదా తెలుగుదేశం పార్టీ.. ఇలా ఏ సమస్య పైన అయినా ధీటుగా, ఘాటుగా ముఖ్యమంత్రి స్పందిస్తుంటారు. తాను ఎవరికి భయపడేది లేదని చెబుతుంటారు.

అయితే చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తడమే కాకుండా.. స్వయంగా ఆయన ఇబ్బంది పడ్డారు కూడా. సమావేశాల కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్ ఉదయాన్నే అసెంబ్లీకి వచ్చారు. సమావేశాలకు చాలా ముందే వారు అసెంబ్లీకి చేరుకున్నారు. దీంతో వారు తెలంగాణవాదులకు భయపడే ముందుగా వచ్చారని తెలంగాణవాదులు ఎద్దేవా చేస్తున్నారు.

మధ్యాహ్నం అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడిన అనంతరం కూడా కిరణ్ తన కాన్వాయ్‌లో కాకుండా ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వాహనంలో సచివాలయానికి వెళ్లారు. అంతకుముందు ఉదయాన్నే కిరణ్ అసెంబ్లీకి వచ్చినప్పటికీ తెలంగాణవాదులు ఆయన కాన్వాయ్‌కు అడ్డుపడ్డారు. దీంతో వెళ్లేటప్పుడు కాన్వాయ్‌ని అడ్డుకుంటారని భావించి ఆయన డిసిఎం కారులో సచివాలయానికి వెళ్లారు.

కిరణ్ ఉదయమే అసెంబ్లీకి వెళ్లడం పలాయనవాదం కాదని.. ఆయన అక్కడే ఉండి సమీక్ష జరిపేందుకు వెళ్లారని మరికొందరు చెబుతున్నారు. అంతేకాకుండా గతంలో వలె పోలీసులు రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించకుండా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని చెబుతున్నారు. సిఎం ఆదేశాల మేరకే పోలీసులు ఎక్కడా రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించలేదని సమాచారం. కేవలం బాష్పవాయువు ప్రయోగం మాత్రమే చేశారు. వేలాదిగా నగరానికి తరలి వస్తే ఎలా ఉంటుందో తెలిసినప్పటికీ గతంలో వలె రబ్బర్ బుల్లెట్లను ఉపయోగించవద్దని కిరణ్ చెప్పారని గుర్తు చేస్తున్నారు.

ఢిల్లీకి సెగ

మాజీ పిసిసి అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు డి.శ్రీనివాస్ ఈ రోజు కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌ను కలిశారు. అంతకుముందు ఆజాద్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. రాష్ట్రంలో చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడుతున్న సమయంలో డిఎస్.. ఆజాద్‌తో భేటీ కావడం, ఆజాద్... సోనియాతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. వారు రాష్ట్ర తాజా పరిస్థితిపై చర్చించి ఉంటారని చెబుతున్నారు.

సొంత పార్టీ నేతల మండిపాటు

కిరణ్ కుమార్ రెడ్డి తీరుపై సొంత పార్టీ నేతలు శుక్రవారం మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. కిరణ్ తీరు వల్ల బిజెపి బలపడుతోందని, తెలంగాణ అంశం వచ్చినప్పుడల్లా ఆయన మావోయిస్టు సమస్యను ముందుకు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన చర్యలను ఆందోళనకారులు సానుకూలంగా మలుచుకున్నారని, తెలంగాణపై ఏదో ఒకటి తేల్చాలని డిమాండ్ చేశారు. చలో అసెంబ్లీకి అనుమతి ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. శంకర రావు కూడా కిరణ్ తీరుపై నిప్పులు చెరిగారు.

కాగా, చలో అసెంబ్లీ నేపథ్యంలో అరెస్టు చేసిన పలువురు ఆందోళనకారులను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. వారిని రూ.వెయ్యి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఉదయం నుంచి దశల వారిగా ఆందోళనకారులు అసెంబ్లీ వైపుకు చొచ్చుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం తెలంగాణ లాయర్ల ఐకాస అసెంబ్లీ వైపుకు వచ్చే ప్రయత్నాలు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అశోక్ నగర్‌లో తెలంగాణ జర్నలిస్టులను అరెస్టు చేశారు. చలో అసెంబ్లీలో పాల్కొన్న ఇంద్రా సేనా రెడ్డికి గాయాలయ్యాయి. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

English summary

 Congress Party senior leader and Rajya Sabha Member V Hanumantha Rao has lashed out at CM Kiran Kumar Reddy for not giving permission to Telangana JAC Chalo Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X