వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బూతులు తిడితే తెలంగాణ ఇస్తామా: కెసిఆర్‌పై ఉండవల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

 Undavalli Arun Kumar and KCR
రాజమండ్రి: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై కాంగ్రెసు రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. రాజమండ్రిలో ఆయన బుధవారం సాయంత్రం వార్షిక సభను నిర్వహించారు. కెసిఆర్ బూతులు తిడుతుంటే తెలంగాణ ఇచ్చి, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయలేమని ఆయన అన్నారు. భాష,త మనిషి, తత్వం మార్చుకోకుండా, తన వాదనలు నిజమని అంగీకరించేలా చేయకుండా కెసిఆర్ తిట్ల దండకం అందుకుంటున్నారని ఆయన అన్నారు

తమను ఒప్పించి, తాము చెప్పే విషయాలు వాస్తవమని నమ్మించి తెలంగాణ డిమాండ్ చేయాలని ఆయన అన్నారు. ఏకాభిప్రాయం కుదరకుండా ప్రత్యేక రాష్ట్రం సాధ్యం కాదని ఆయన అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని అడగవచ్చునని, అయితే మిగతా ప్రాంతాలవారిని అందుకు అంగీకరింపజేయాలని ఆయన అన్నారు. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు ఆంధ్ర వాళ్లు తమిళనాడువాళ్లను అంగీకరింపజేశారని ఆయన అన్నారు. ఆంధ్ర విడిపోవడానికి అభ్యంతరం చెప్పడానికి వాళ్ల వద్ద ఏమీ లేకుండా పోయిందని ఆయన అన్నారు.

తిట్లతో దబాయించి, తెలంగాణ సాధిస్తామనుకుంటే అందుకు తాము సిద్ధంగా లేమని ఆయన అన్నారు. బోడోలాండ్, గూర్ఖాలాండ్, హరితప్రదేశ్, బుందేల్ ఖండ్ ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయని, కొత్తగా హైదరాబాద్, రాయలసీమ వంటి ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు వస్తున్నాయని ఆయన అన్నారు. న్యాయమైన డిమాండ్లతో తమను ఒప్పించి రాష్ట్రం సాధించుకుంటే తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తే దేశవ్యాప్తంగా వేర్పాటు ఉద్యమాలు తలెత్తుతాయని ఆయన అన్నారు.

తెలంగాణకు తాను వ్యతిరేకమని ఎప్పుడూ చెప్పలేదని, తప్పుడు ఆధారాలు చూపుతూ రాష్ట్రం కావాలంటే ఎలా ఇస్తారని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీలకు ఓట్లేస్తే అల్లకల్లోలం అవుతుందని, పార్లమెంటులో ఎస్పీ సభ్యుల తీరే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. బడుగుల హక్కులను జాతీయ పార్టీలు మాత్రమే కాపాడగలవని ఆయన అన్నారు. పన్నుల లెక్కల గురించి కెసిఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని, హైదరాబాద్ రాజధాని నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా కెసిఆర్ లెక్క కడుతున్నారని ఆయన అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కెసిఆర్ దొంగ లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణలో మరణాలకు కెసిఆర్ కారణమని ఆయన దుమ్మెత్తిపోశారు.

కెసిఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఉండవల్లి ప్రసంగం యావత్తూ సాగింది. తెలంగాణ ప్రజలకు వాస్తవాలను కెసిఆర్ తెలియనివ్వడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, ఈ తీరులో ఏర్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన అన్నారు. తెలంగాణ ఆలోచనాపరులు ఆలోచించాలని ఆయన కోరారు. తెలంగాణవాదుల ఆరోపణలపై ఉమ్మడి వేదికపై చర్చకు తాను సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు. కెసిఆర్ లెక్కలన్నీ తప్పని తాను సోదాహరణంగా నిరూపించగలనని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని ఆయన అన్నారు.

రెచ్చగొట్టడం తేలికేనని, భవిష్యత్తుపై విశ్వాసం కల్పించడం ముఖ్యమని ఆయన అన్నారు. రాయలసీమను క్షామం పీడిస్తోందని ఆయన అన్నారు. సిద్ధాంతాలపై నిలపబడని బిజెపి ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతోందని ఆయన అన్నారు. ఎన్డీయె ప్రభుత్వ హయాంలో ఏకాభిప్రాయంతోనే తెలంగాణ అన్న బిజెపి ఇప్పుడు మాట మార్చిందని ఆయన అన్నారు. అన్ని ప్రాజెక్టులపై చర్చకు సిద్ధపడాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల భాషలో సంగీతం ఉంటుందని ఆయన అన్నారు. కాశీం రజ్వీ గతంలో అలాగే మాట్లాడాడు, ఇప్పుడు కెసిఆర్ అలాగే మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా, చర్చల ద్వారా తెలంగాణ సాధించుకోవచ్చునని, అందుకు తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. ప్రసంగం పూర్తయ్యే సరికి ఒక్కరో ఇద్దరో ఆత్మహత్య చేసుకుంటే అది ప్రాంతీయ ద్రోహమే కాకుండా దేశద్రోహం కూడా అవుతుందని ఆయన కెసిఆర్‌పై దండెత్తారు.

మంత్రిగా ఉన్నప్పుడు కెసిఆర్‌కు తెలంగాణ గుర్తుకు రాలేదని ఆయన అన్నారు. రాష్ట్రానికి, దేశానికి మంచి జరిగే నిర్ణయాన్నికాంగ్రెసు అధిష్టానం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఎవరూ రాజీనామా చేయవద్దని ఆయన అన్నారు. పార్లమెంటులో, శాసనసభలో మాట్లాడాల్సిన అవసరం ఉందని, అందుకే రాజీనామాలు చేయవద్దని ఆయన సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు సూచించారు. రాజీనామాలు అంటే క్రమశిక్షణా రాహిత్యం అనేది కాదని ఆయన అన్నారు. సమైక్యవాణిని చట్టసభల్లో గట్టిగా వినిపించడానికి రాజీనామాలు చేయవద్దని ఆయన అన్నారు. పార్లమెంటు నిర్ణయం ద్వారానే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమని ఆయన అన్నారు. అసెంబ్లీ వోటింగ్ అవసరం లేదని, పార్లమెంటులో ఓటింగ్ జరగాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తమ బంధువులందరూ హైదరాబాదులో ఉన్నారని, మిగతా వాళ్ల బంధువులు కూడా హైదరాబాదులో ఉన్నారని, హైదరాబాద్ మనదని అనుకున్నాం కాబట్టి అలా ఉన్నారని ఆయన అన్నారు.

రాష్ట్ర ఏర్పాటు వల్ల ఎక్కువ నష్టపోయింది రాయలసీమ అని ఆయన అన్నారు. కోస్తా ప్రాంతంవారు పాలించింది రాయలసీమవాళ్లు పాలించినవారి దాంట్లో మూడో వంతు మాత్రమే అని ఆయన అన్నారు. నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి రాయలసీమకు చెందినవారేనని, ఎక్కువ కాలం రాష్ట్రాన్ని పాలించింది వారేనని, అయినా రాయలసీమ తెలంగాణ కన్నా వెనకబడి ఉందని, పాలనకు అభివృద్ధికి లంకె లేదని దీనివల్ల అర్థమవుతోందని ఆయన అన్నారు. రాయలసీమను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు. తెలుగువాళ్లకు రెండు రాష్ట్రాలు ఉండకూడదని తాను అనడం లేదని, అయితే అది పద్ధతి ప్రకారం ఉండాలని ఆయన అన్నారు.

తెలంగాణ ఇస్తే బోడోలాండ్, గూర్ఖాలాండ్ వంటి ప్రాంతాలు రక్తసిక్తమయ్యే ప్రమాదం ఉందని, దేశం అల్లకల్లోలం అవుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనను తాము ఎందుకు కాదంటున్నామో తెలంగాణవాళ్లు ఆలోచించాలని ఆయన అన్నారు. ఐఐటిని హైదరాబాదులో పెట్టాలని అడిగామని, రాజమండ్రిలోనో విజయవాడలోనో తిరుపతిలోనో పెట్టాలని అడగలేదని, ఆ ప్రాంతం వీరు - ఈ ప్రాంతం వేరని తాము అనుకోలేదని, అందుకే హైదరాబాదులో ఐఐటి పెట్టడాన్ని తాము వ్యతిరేకించలేదని ఆయన అన్నారు.

ఉండవల్లి సభకు ఉభయగోదావరి జిల్లాల శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మంత్రి వట్టి వసంతకుమార్ తదితరులు హాజరయ్యారు.

English summary
Congress Rajamundry MP Undavalli Arun Kumar lashed out at the Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao (KCR) at Rajamundry meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X