వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: రాష్ట్రాన్ని ఎలా ఏర్పాటు చేయవచ్చు?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగ ప్రక్రియ ఎలా ఉంటుందనే విషయంపై గోవా లోకాయుక్త, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు - రాజ్యాంగ ప్రక్రియ అనే అంశంపై ఆయన గురువారం సాయంత్రం కోత్వాల్ రాజా బహదూర్ వెంకటరామా రెడ్డి స్మారకోపన్యాసం చేశారు. ప్రాదేశిక సమగ్రత, దేశ సార్వభౌమత్వం అనే రెండు అంశాలను ప్రధానంగా చేసుకుని ఆయన ప్రసంగం సాగింది. ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రాదేశిక సమగ్రతను, దేశ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తానని ప్రమాణం చేయడంలోని ప్రాధాన్యాన్ని వివరించారు.

ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) 1960 ప్రాంతంలో లేవనెత్తిన ప్రత్యేక దేశ నినాదంలోని ప్రమాదాన్ని పసిగట్టి, అందరూ అలా ప్రమాణం చేసే విధంగా రాజ్యాంగ సవరణ చేశారని ఆయన చెప్పారు. అంటే, భారతదేశంలో వేర్వేరు జాతులుండవని, భరత జాతి మాత్రమే ఉంటుందనేది దాని సారాంశం. రాష్ట్రాల నిర్మాణానికి భాషను ప్రాతిపదికగా తీసుకోవాలనే నిబంధనను రాజ్యాంగంలో లేకుండా జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభబాయ్ పటేల్, అబుల్ కలాం ఆజాద్ జాగ్రత్తపడినట్లు ఆయన చెప్పారు. భాషాప్రాతిపదికపై రాష్ట్రాల నిర్మాణం జరిగితే ఏర్పడే ప్రమాదాలను వారు ముందే గ్రహించారని ఆయన అన్నారు.

విభజననా, నిర్మాణమా..

జాతిని నిర్వచించడానికి భాషను ప్రాతిపదికగా తీసుకుంటే వాటిల్లే ప్రమాదాన్ని వారు గుర్తించినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టు తీర్పులోని వ్యాఖను ఉదహరించారు. భారతదేశాన్ని undistructable union, distructable states అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని చెప్పారు. దేశం అవిచ్ఛిన్నమైంది, రాష్ట్రాలు విచ్ఛిన్నానికి వీలైనవని అర్థం. రాష్ట్రాలను పునర్నిర్మించడానికి వీలుంటుంది గానీ దేశాన్ని విభజించడానికి వీలు కాదు.

Justice Sudarshan Reddy

ఒక రాష్ట్రం నుంచో, రెండు మూడు రాష్ట్రాల నుంచో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను, లేదంటే రెండు రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం అనే ప్రక్రియను విభజన అనడాన్ని ఆయన వ్యతిరేకించారు. అది రాష్ట్రాల నిర్మాణం, పునర్నిర్మాణం మాత్రమే అవుతుందని అన్నారు. దేశంలో తొలుత 14 రాష్ట్రాలను ఏర్పాటు చేశారని, రాష్ట్రాల పునర్మిర్నాణం ద్వారా ప్రస్తుతం 28 రాష్ట్రాలు ఏర్పడ్డాయని అన్నారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగం అవకాశం కల్పించిందని చెప్పారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలోని ఆంతర్యం అదేనని చెప్పారు.

రాష్ట్ర ఏర్పాటు అతి సాధారణమైంది...

కొత్త రాష్ట్రం ఏర్పాటు అతి సాధారణమైన ప్రక్రియ అని ఆయన చెప్పారు. కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే విశేష అధికారాలను రాజ్యాంగం పార్లమెంటుకు కట్టబెట్టిందని చెప్పారు. రాజ్యాంగంలోని 3వ ప్రకరణం అందుకు వీలు కల్పిస్తుందని అన్నారు. రాష్ట్రపతి సూచనలకు విరుద్ధంగా, శాసనసభల తీర్మానాలకు విరుద్ధంగా కూడా రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు ఉందని చెప్పారు.

దానికి ఉదాహరణంగా ముంబై రాష్ట్ర వ్యవహారాన్ని చెప్పారు. ముంబై రాష్ట్రాన్ని గుజరాత్‌, మహారాష్ట్ర, ముంబై రాష్ట్రాలుగా పునర్నిర్మించాలని ముంబై శాసనసభ తీర్మానం చేసిందని, దాన్ని రాష్ట్రపతి కూడా సిఫార్సు చేశారని, అయితే పార్లమెంటు దాన్ని వ్యతిరేకిస్తూ ముంబై రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచుతూ బిల్లు ఆమోదించిందని చెప్పారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుకు పలు సవరణలు చేస్తూ చివరికి రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచుతూ పార్లమెంటు బిల్లును ఆమోదించింది. దీనిపై కోర్టుకు వెళ్లినా చెల్లలేదని చెప్పారు.

తెలంగాణకు 371 (డి) ప్రకరణం ఆటంకమా..

ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో జోనల్ వ్యవస్థ ఉంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా అది అమలులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి 371 (డి) ఆర్టికల్‌ను తొలగించాల్సి ఉంటుందని, దానికి రాజ్యాంగ సవరణ అవసరం ఉంటుందని వాదిస్తున్నారు. ఈ వాదనపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి వివరణ ఇచ్చారు.

విద్య, ఉపాధి రంగాల్లో సమానావకాశాల కోసం రాష్ట్రపతి ఆ ఉత్తర్వులను జారీ చేశారని, దాన్ని తొలగించడానికి ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణ అవసరం లేదని, రాష్ట్రపతి తాను జారీ చేసిన ఉత్తర్వులను అతి మామూలుగా ఉపసంహరించుకుంటే సరిపోతుందని ఆయన ఆయన అన్నారు.

తెలుగు ఓ జాతి అవుతుందా..

రాజ్యాంగం ప్రకారం భాష జాతి కాదని ఆయన అన్నారు. అలా గుర్తిస్తే రాజ్యాంగం నిర్దేశించిన భారతదేశానికి అర్థం లేదని ఆయన అన్నారు. పలు రాష్ట్రాలతో కూడిన భారత దేశాన్ని రాజ్యాంగం నిర్దేశించిన అర్థంలో జాతిగా గుర్తించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. భారత పౌరసత్వం మాత్రమే ఉంది గానీ తెలుగు, తమిళ పౌరసత్వాలు లేవని, అందువల్ల రాజ్యాంగం ప్రకారం భాషా ప్రాతిపదికపై జాతులను గుర్తించడానికి వీలు లేదని ఆయన చెప్పారు. అందువల్ల తెలుగు జాతి ఐక్యత అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు.

కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్..

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే ప్రతిపాదన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. ఒక ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడమనేదాన్ని రాజ్యాంగం అనుమతిస్తుందని, అయితే అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ రాష్ట్రాలుగా రూపాంతరం చెందాయని, ఈ దశలో కొత్తగా పాత పద్ధతుల్లోకి వెళ్లి కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకమైంది కాదని అన్నారు. దేశంలోని ఏయే కేంద్ర పాలిత ప్రాంతాలు పరిణామ క్రమంలో రాష్ట్రాలుగా రూపాంతరం చెందాయో వివరించారు.

రెండో రాజధానిగా హైదరాబాద్...

దేశానికి రెండో రాజధానిగా హైదరాబాదును చేయాలని అంబేడ్కర్ చెప్పిన సందర్భం వేరని ఆయన అన్నారు. దేశ అవిచ్ఛిన్నతను, అఖండతను కాపాడడానికి చాలా ముందు చూపుతో అంబేడ్కర్ ఆ ప్రతిపాదన చేశారని ఆయన అన్నారు. హైదరాబాదును రెండో రాజధానిగా చేయాలంటే అది అషామాషీ వ్యవహారం కాదని, దానికి చాలా తతంగం ఉంటుందని ఆయన అన్నారు.

చట్టసభను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం..

దేశసమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడుతామని ప్రతిజ్ఝ చేసిన ప్రజాప్రతినిధులు చట్టసభలను అడ్డుకుంటామని హెచ్చరించడం, అందుకు అనుగుణంగా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం మీద, దేశాన్ని ఒక అఖండ, అవిచ్చిన్న జాతిగా గుర్తిస్తూ, రాష్ట్రాల నిర్మాణానికి అవకాశం కల్పిస్తూ భారత రాజ్యాంగం అత్యంత జాగ్రత్తగా రూపొందిందనే విషయాన్ని ఆయన వివరించారు.

English summary
Goa Lokaykta and Supreme court former justice B Sudarshan Redd in his Korhwal Rajabahadur Venkata Rama Reddy memerial lecture explained about formation states within the frame work of Indian Constitution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X