పెద్దపులి కలకలం: ఓ యువకుడిని చంపి, అడవిలో లాక్కెళ్లింది, భయంతో ప్రజల కేకలు
ఆదిలాబాద్: కొమరంభీం-అసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. తాజాగా, ఓ యువకుడి ప్రాణం తీయడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. దహెగాం మండలం దిగిడా గ్రామంలో పెద్దపులి దాడి చేయడంతో ఓ యువకుడి మృతి చెందాడు.

యువకుడిపై పెద్దపులి దాడి..
మంగళవారం పొలంలో పనిచేసుకుంటున్న విఘ్నేష్(22) అనే యువకుడిపై పెద్దపులి హఠాత్తుగా దాడి చేసింది. అనంతరం అతడ్ని చంపి, మృతదేహాన్ని అడవిలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున అరుపులు కేకలు వేసుకుంటూ వెళ్లడంతో అతడి మృతదేహాన్ని విడిచిపెట్టి పులి అడవిలోకి పారిపోయింది.

ఒకటే పులా.. రెండు పులులా?
ఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పులి సంచారంపై పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతంలో పులి సంచారం ఉన్నట్లు ఎలాంటి ఆనవాళ్లు ఇటీవల కాలంలో లేనప్పటికీ.. హఠాత్తుగా వచ్చి మనుషులపై దాడి చేయడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, అక్టోబర్ 12న ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ పరిధి కన్నాయిగూడెం మండలంలోని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత 20 రోజుల్లో ఏటూరునాగారం అడవుల్లో పులి జాడ ఎక్కడా కనిపించలేదు. అయితే, వారం పదిరోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

తెలంగాణలో కలకలం రేపుతున్న పులుల సంచారం
తాజాగా, నవంబర్ 6న వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలంలోని బండమీది మామిడితండా అడవుల్లో పులి సంచరించినట్లు అడుగు జాడల ద్వారా కనుగొన్నారు. కాగా, ఈ పులే ఈ ప్రాంతమంతా సంచరిస్తుందా? లేక మరో పులి కూడా ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అటవీ అధికారులు సీసీ కెమెరాల ఫుటేజీ, పులి అడుగులను గుర్తించే పనిలోపడ్డారు.
అడవులు, పంట పొలాలకు వెళ్లేటప్పుడు ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, గత కొంత కాలంగా తెలంగాణలో పులుల సంచారం పెరగడం గమనార్హం. కొద్ది నెలల క్రితం హైదరాబాద్ నగర శివారులో పులి సంచారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.