ఆదిలాబాద్‌లో పిడుగుల బీభత్సం... ముగ్గురు మృతి... 16 మూగ జీవాలు బలి...
తెలంగాణవ్యాప్తంగా ఇవాళ పలు జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి.పలుచోట్ల పిడుగుపాటుకు ప్రాణనష్టం సంభవించింది.ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు.మరో నలుగురు తీవ్ర గాయాపాలయ్యారు.
జిల్లాలోని బజార్హత్నూర్ మండలం బూరుగుపల్లిలో గరన్ సింగ్, ఆశా బాయి అనే ఇద్దరు పిడుగుపాటుకు మృతి చెందారు. తాంసీ మండలం బండల్ నాగపూర్‌లో రాథోడ్ దీపాలి (18) అనే రైతు పిడుగు పడి మృతి చెందాడు. తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పిడుగుపడి అక్కడికక్కడే కుప్పకూలాడు. జిల్లాలోని మరికొన్నిచోట్ల చోటు చేసుకున్న పిడుగుపాటు ఘటనల్లో మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. జైనథ్ మండలం సాంగ్వీలో మేకల మందపై పిడుగుపడి దాదాపు 16 మూగజీవాలు మృతి చెందాయి.

శుక్రవారం(అక్టోబర్ 9) హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.హైదరాబాద్‌లో సికింద్రాబాద్,ప్యాట్నీ,రాంనగర్,ఆర్టీసీక్రాస్ రోడ్,విద్యానగర్,చైతన్యపురి,అల్వాల్,తిరుమలగిరి,పంజాగుట్ట,చంపాపేట్,బోయిన్ పల్లి,బేగంపేట,ఖైరతాబాద్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకాపుల్, నారాయణ గూడ, హిమాయత్ నగర్, ఉప్పల్, రామాంతపూర్, సరూర్ నగర్, కొత్తపేట, దిల్సుఖ్నగర్, మలక్ పేట, సైదాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.భారీ వర్షానికి చాలాచోట్ల రోడ్లపైకి వరద నీరు చేరింది.కొన్నిచోట్ల మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీట మునిగిన ప్రాంతాల నుంచి స్థానికులను డీఆర్ఎఫ్ టీమ్స్ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది.శుక్రవారం కురిసిన వర్షానికే నగరం అతలాకుతలమవగా... ఇవాళ కురిసిన వర్షంతో మరిన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి.కొన్నిచోట్ల రోడ్లను చెరువులను తలపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ముంపు బాధిత ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలకు ఆదేశించారు.
వర్షాల వల్ల ఇబ్బందులు పడే ప్రజల కోసం జీహెచ్ఎంసీ అధికారులు కంట్రోల్ రూమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వర్షాల వల్ల ఇబ్బందులు పడే ప్రజలు కంట్రోల్ రూం ఫోన్ నంబర్ 040 2111 1111లో సంప్రదించవచ్చునని తెలిపారు.
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ డా.నాగరత్న తెలిపారు.ఇవాళ ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉందని తెలిపారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 48గంటల్లో ఉత్తర అండమాన్ సముద్ర పరిసరాల్లో అల్ప పీడనం ఏర్పడవచ్చునని చెప్పారు. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. నాలుగైదు రోజుల్లో ఇది ఉత్తర కోస్తా ఆంధ్రా తీరానికి చేరవచ్చునని పేర్కొన్నారు.