సమ్మె సైరన్..? ఫిబ్రవరి 7వ తేదీ నుంచి స్ట్రైక్: ఉద్యోగ సంఘాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు వెళ్తామని ఏపీ ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. పీఆర్సీపై ఉద్యమించేందుకు 12 మందితో సాధన సమితి ఏర్పాటు చేసుకున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమం, ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ చేపట్టాలని ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు. సోమవారం సీఎస్‌కు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. పీఆర్సీ జీవోలను వెంటనే నిలిపివేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఉద్యమ కార్యాచరణ
అన్ని జిల్లా కేంద్రాల్లో ఎల్లుండి (23వ తేదీన) రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు. 25వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపడుతారు. 26న అన్ని తాలూకా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రాహానికి మొమొరాండాలు సమర్పించాలని నిర్ణయించారు. 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఉద్యోగ సంఘాల నిర్ణయించాయి. సీఎస్‌ను కలిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.

పోరాటం..
ఉద్యోగులకు నష్టం జరుగుతుందని పోరాటానికి సిద్ధం అయ్యామని వెంకట్రామి రెడ్డి తెలిపారు. అన్ని సంఘాలు ఉమ్మడిగా కలిసి ముందుకెళ్తామని పేర్కొన్నారు. పీఆర్సీ జీవోలు వెంటనే నిలిపివేయాలని తమ మొదటి డిమాండ్ అని తెలిపారు. అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ ఇవ్వాలనేది రెండో డిమాండ్ అని వివరించారు. ప్రభుత్వం పీఆర్సీపై మళ్లీ చర్చలు జరపాలి, జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేయాలి, గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని డిమాండ్ చేశారు.

వెనక్కి తీసుకోండి
ట్రెజరీలకు ఇచ్చిన ఆదేశాలు వెనక్కు తీసుకోవాలని మరో నేత సూర్యనారాయణ డిమాండ్ చేశారు. పాత జీతాలు ఇవ్వాలని సీఎస్‌ను కోరామని తెలిపారు. తీవ్రమైన ఆందోళన ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఉద్యమ కార్యాచరణ నోటీస్ ఇచ్చేందుకు అపోయింట్ మెంట్ కోరామని తెలిపారు. ఉద్యమం కోసం 12 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

అనుమతించం..
ఉద్యోగుల విషయాల్లోకి ఏ రాజకీయపార్టీని అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నామని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఏపీడీఎఫ్ ఎమ్మెల్సీలు, ట్రేడ్ యూనియన్ లను ఉద్యమంలోకి తీసుకోస్తామని చెప్పారు. సీపీఎస్ రద్దుతో పాటు ఇతర సమస్యలు కూడా సాధన సమితి ద్వారా సాదించాలని నిర్ణయించామని తెలిపారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని బండి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం సీఎస్‌కు ఉద్యమ కార్యచరణ నోటీస్ ఇస్తామని చెప్పారు.

కమిటీ ఏర్పాటు
పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపడానికి ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ ఉన్నారు. పీఆర్సీపై జరుగుతున్న వివాదానికి తెరదించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.