సమ్మెకు ఏపీఎస్ ఆర్టీసీ యూనియన్ల మద్దతు, ఆర్టీసీలో సమ్మె సైరన్.. ఎప్పటినుంచి అంటే..
ఏపీలో పీఆర్సీ చిచ్చురేపింది. వచ్చే నెల 7వ తేదీ నుంచి సమ్మె చేపడుతామని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. వారికి ఆర్టీసీ యూనియన్లు కూడా మద్దతు తెలిపాయి. అంటే ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ప్రగతి రథ చక్రాలకు బ్రేక్ పడనుంది. ఆర్టీసీ బస్సులు కదపకపోవడంతో.. సామాన్య జనం ఇబ్బంది పడే అవకాశం ఉంది.

నిలువనున్న బస్సులు
పీఆర్సీ సాధన సమితికి ఆర్టీసీ ఉద్యోగులు మద్దతు తెలిపారు. పెద్ద సంఘాలు మద్దతు తెలపడంతో ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. సోమవారం సీఎస్‌ను ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు కలిసి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. జీతాలు తగ్గించుకోవాలంటే..కుదరదని, ఆర్టీసీ ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నా గతంలో ప్రతి నెలా ఒకటి తేదీనే వేతానాలు వచ్చేవని గుర్తుచేశారు. ప్రస్తుతం రెండు నుంచి ఏడు, తొమ్మిదో తేదీ వరకు జీతాలు పడుతున్నాయని తెలిపారు. 8 శాతం హెచ్ఆర్ఏ లో పెట్టిన తర్వాత, జీతాలు తగ్గవని ప్రభుత్వం ఎలా చెబుతుందో అర్థం కావడం లేదన్నారు.

ఆలోచించాలి..
ఆర్టీసీ ఆదాయాన్ని దీనితో ముడిపెట్టలేమని, ఉద్యోగుల ఆర్థికపరమైన అంశాలను ప్రభుత్వం పునర్ ఆలోచించాలని సూచించారు. ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని.. కూలీ చేసి కూలీ డబ్బులు అడుగుతున్నామని వివరించారు. కరోనాతో ఆర్టీసీకి ఇబ్బందులు తప్పలేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో ఆర్టీసీ మరోసారి సమ్మెలోకి వెళితే మరింత నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్ళకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

సమ్మె సైరన్
ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు వెళ్తామని ఏపీ ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. పీఆర్సీపై ఉద్యమించేందుకు 12 మందితో సాధన సమితి ఏర్పాటు చేసుకున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమం, ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ చేపట్టాలని ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు. సోమవారం సీఎస్‌కు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. పీఆర్సీ జీవోలను వెంటనే నిలిపివేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో 23వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు. 25వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపడుతారు. 26న అన్ని తాలూకా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రాహానికి మొమొరాండాలు సమర్పించాలని నిర్ణయించారు. 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఉద్యోగ సంఘాల నిర్ణయించాయి.