బిజెపి నుండి ఎమ్మెల్యే విష్ణు జంప్ : సబ్బం హరికి చెక్ ..వైసిపి లో మారుతున్న సమీకరణాలు ..!

బిజెపి శాసనసభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు పార్టీ మారటానికి సిద్దమయ్యారు. ఆయన బిజెపి ని వీడటం ఖాయమనే ప్రచారం జరుగుతున్నా..వైసిపి లోకి వెళ్తారా లేక టిడిపిలోకి వెళ్తారా అనే దాని పై స్పష్టత రాలేదు. అయితే, విష్ణు కుమార్ రాజు టిడిపి లో చేరాలని డిసైడ్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. విశాఖ టిడిపిలోకి విష్ణు చేరికతో ..అక్కడ ఇప్పటి వరకు టిడిపి టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న సబ్బం హరికి చెక్ పెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇక, ఈ సమీకరణాల లో టిడిపి సీనియర్ నేత బండారు కు టిక్కెట్ పై అనుమానాలు మొదలయ్యాయి...

బిజెపి ఏపి శాసనసభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు బిజెపిని వీడి టిడిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి బిజెపి నుండి పోటీ చేసిన విష్ణు కుమార్ రాజు గెలుపొందారు. అప్పటి నుం డి శాసనసభలో బిజెపి పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. వైసిపి పైనా..టిడిపి పైనా విమర్శలు చేస్తూనే...వారితో సన్నిహిత సంబంధాలను నడుపుతూ వచ్చారు. విశాఖ ఉత్తరం నుండి విష్ణు టిక్కెట్ ఇచ్చేందుకు పార్టీ అధినేత చంద్రబాబు సాను కూల సంకేతాలు ఇచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం. జిల్లా కు చెందిన మంత్రి గంటా పై పరోక్షంగా విష్ణు కుమార్ రాజు విమర్శలు చేసేవారు. విశాఖ భూ కుంభకోణం సందర్భంలోనూ పరోక్షంగా గంటా పై ఆరోపణలు చేసారు. టిడిపి కనుసన్న ల్లోనే విష్ణు కుమార్ రాజు పని చేసేవారని నగర బిజెపి లో టాక్. ఇక, ఇప్పుడు ఏపిలో బిజెపికి రాజకీయంగా భారీ నష్టం తప్పని పరిస్థితుల్లో టిడిపిలో చేరేందుకు అదే మంత్రి గంటా సహకరించారు. గంటా జిల్లాలో తన రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా విష్ణు కుమార్ రాజును టిడిపిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసారు. ముఖ్యమంత్రి వద్ద లాబీయింగ్ లో సక్సెస్ అయి..తాను కోరుకున్న విధంగా విష్ణుకుమార్ రాజు ను టిడిపిలో తీసుకొస్తున్నారు.
సబ్బం హరికి చెక్ పెట్టేందుకే..!
మాజీ ఎంపి సబ్బం హరి టిడిపి నుండి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో వైసిపి నుండి బయటకు వచ్చి..పరోక్షంగా బిజెపి - టిడిపి గెలుపుకు సహకరించారు. అప్పటి జనుండి ఆయన టిడిపి కే అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. విశాఖ నగర రాజకీయాల్లో సబ్బం హరి రాకను వ్యతిరేకిస్తున్న గంటా వ్యూహాత్మకంగా పావులు కదిపి బిజెపి ఎమ్ముల్యే విష్ణుకు లైన్ క్లియర్ చేయించారు. సబ్బం హరి కి పార్టీలో ఎమ్మెల్యే సీటు తప్పదనుకుంటే మాడుగుల లేదా చోడవరం నుండి అవకాశం కల్పించాలనే వాదన తెర పైకి తీసుకొస్తున్నారు. సబ్బం హరికి ముఖ్యమంత్రి వద్ద సఖ్యత ఉన్నా..స్థానికంగా ఉన్న ఇద్దరు మంత్రులు గంటా, అయ్యన్న తో సంబంధాలు అంతంత మాత్రమే. ఇద్దరూ సబ్బం హరి ని వ్యతిరేకిస్తున్నారు. ఈ సమీకరణాల్లో భాగంగా పార్టీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తికి ఈ సారి టిక్కెట్ దక్కే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక, కాంగ్రెస్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ కు పొత్త లో లేదా టిడిపిలోకి తీసుకొచ్చి ఆయనకు పెందుర్తి టిక్కెట్ ఇవ్వాలనే ఆలోచనలో టిడిపి అధినేత ఉన్నట్లు సమాచారం. దీంతో..అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేస్ కుమార్ వైసిపి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
2014 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా విజయమ్మ ఓడిపోవటంతో .. ఈ సారి ఎన్నికల్లో విశాఖ లో ఎలాగైనా తమ పట్టు నిరూపిం చుకోవాలని వైసిపి పట్టుదలతో ఉంది. అక్కడ పార్టీ వ్యవహారాలన్నీ విజయ సాయి రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దీంతో..ఇప్పుడు విశాఖ నగరంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకంగా మారుతున్నాయి.