మూడు పార్టీల పొత్తులాట: టీడీపీతో కాదు జనసేనతో బరిలోకి: సోము వీర్రాజు
ఏపీ రాజకీయాలు మరింత హీట్ ఎక్కుతున్నాయి. ఇప్పట్లో ఎన్నికలు లేకున్నా తెగ హడావిడి చేస్తున్నారు. విపక్ష టీడీపీ మిన్నకుండిపోయిన.. బీజేపీ మాత్రం స్పీడ్ పెంచింది. టీడీపీతో బీజేపీ పొత్తు గురించి వస్తోన్న ఊహాగానాలపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటామని ఎక్కడా చెప్పలేదన్నారు. అదీ మీడియా కల్పితమేనని చెప్పారు. తమకు జనసేనతో పొత్తు ఉందని, ఆ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళతామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

సొంత అవసరాలకు వాడుకుని..
అంతేకాదు ఏపీలో ఎన్నికలకు సంబంధించి బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధమవుతోందని తెలిపారు. కర్నూలులో బీజేపీ రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమంలో సోము వీర్రాజు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. కేంద్రం ఇస్తున్న నిధులను సొంత అవసరాలకు వైసీపీ ప్రభుత్వం వాడుకుంటుందని బీజేపీ ఆరోపిస్తోంది. రాష్ట్రానికి కేంద్రం ఏం ఇచ్చిందో వైసీపీ మంత్రులతో బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. వైసీపీ నవరత్నాలు కేంద్రం నిధులతో అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీపై ప్రత్యేక ప్రేమతో కేంద్రం ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఇస్తోందన్నారు.

ప్యాకేజీ మేలు కదా..?
ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీతో ఎక్కువ నిధులు వచ్చాయని ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు జగన్ మాయలో పడి యూ టర్న్ తీసుకున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం నిధులతోనే నిర్మిస్తామని సోము వీర్రాజు చెప్పారు. 2024లో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సోమువీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. వైసీపీ సర్కార్‌పై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యం అన్నారు.


అప్పుడే ఎందుకు తొందర
రాష్ట్రంలో ఎన్నికలకు సమయం ఉన్నా.. రోడ్ మ్యాప్ అంటూ పార్టీలు సిద్దం అవుతున్నాయి. ఎప్పటిలాగే వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగనుండగా.. మిగతా పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. అయితే ఏ పార్టీ మరే పార్టీతో కలిసి పోటీ చేస్తోందా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే బీజేపీ, టీడీపీతో జత కడుతుందని రూమర్స్ వచ్చాయి. కానీ సోము వీర్రాజు మాత్రం తాము జనసేనతో కలిసి బరిలోకి దిగుతామని చెప్పారు. దీంతో ఈ మూడు పార్టీలు ఏవీ కలిసి బరిలోకి దిగుతాయనే అంశం సస్పెన్స్‌గా మారింది.