సుబ్మహ్మణ్యం భార్యకు చంద్రబాబు పరామర్శ.. మేమున్నామని భరోసా..
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఆయన భార్య అపర్ణను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించారు. గర్భవతిగా ఉన్న అపర్ణకు వచ్చిన కష్టంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్యం హత్యకు అనంతబాబే కారణం అని అపర్ణ చంద్రబాబు నాయుడుకు వివరించింది. తెలుగుదేశంతోపాటు దళిత సంఘాలు చేసిన పోరాటం వల్లే పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారని అపర్ణ వివరించింది.

ప్రలోభాలు.. అయినా వినలే
తనను పోలీసులు తీవ్రంగా వేధించారని...ప్రభుత్వం తనను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేసిందని అపర్ణ తెలిపారు. అంతేకాదు కేసును నీరు గార్చేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించింది. తన తరపున పోరాటం చేసిన తెలుగు దేశం నేతలకు అపర్ణ ధన్యవాదాలు తెలిపింది. పోలీసుల విచారణపై తనకు అనుమానాలు ఉన్నాయని... తన భర్త హత్య కేసు సీబీఐతో విచారణ జరిపించాలని అపర్ణ డిమాండ్ చేశారు.

అనంతబాబుపై చర్యలేవీ..?
దైర్యంగా ఉండాలని, అన్ని విధాలా పార్టీ తరపున అండగా ఉంటామని చంద్రబాబు అపర్ణకు తెలిపారు. అనంత బాబు బహిరంగంగా తిరుగుతున్నా పోలీసులు అరెస్టు చేయకపోవడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. కళ్లముందు పెళ్లిళ్లకు, పేరంటాలకు నిందితుడు వెళుతుంటే ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం బాధితుల అనుమానాలను బలపరిచేలా ఉందని చంద్రబాబు ఆరోపించారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులుకు శిక్ష పడేవరకు తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చంద్రబాబు నాయుడు అపర్ణకు తెలిపారు.

హత్యే..
కాకినాడకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు అలియాస్ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యగా తేలింది. సుబ్రమణ్యం మర్మాంగాలపై బలంగా కొట్టడంతో మృతి చెందాడని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. సుబ్రహ్మణ్యం శరీరంపై గాయాలు ఉన్నాయని నిర్ధారించారు. సుబ్రహ్మణ్యం ఎడమ చేయి, ఎడమకాలు బొటనవేలు, తలపై తీవ్ర గాయాలు కనిపించాయి.

ప్రమాదంగా చిత్రీకరణ..
గురువారం ఉదయం మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లిన ఎమ్మెల్సీ అనంతబాబు.. శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మరణించాడని అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కారులో డెడ్ బాడీని తీసుకొచ్చి మృతుడి కుటుంబ సభ్యులు నివాసం ఉండే అపార్ట్మెంట్ వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంత బాబే హత్య చేసి.. ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. కాకినాడ ప్రభుత్వాస్పత్రి వద్ద సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండా కుటుంబ సభ్యులు అడ్డుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. ఎమ్మెల్సీ అనంతబాబుపై పోలీసులు హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు.

కొట్టి హతమార్చారు..
నిన్న రాత్రి సుబ్రమణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన తర్వాత పోలీసులు డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆదివారం ఉదయం తూర్పు గోదావరి జిల్లాలోని గొల్ల మామిడాలలో సుబ్రమణ్యం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆదివారం మధ్యాహ్నం సుబ్రహ్మణ్యం పోస్ట్‌మార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది. సుబ్రహ్మణ్యంను దారుణంగా కొట్టి చంపినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో బయటపడింది. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ పరారీలో ఉన్నారని సమాచారం.