• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎన్నికల మూడ్: కాంగ్రెస్ సీనియర్ల బ్యాచ్ దారి ఎటు?

|

అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ హస్తినలో మకాం వేశారు. ఉద్దేశాలు వేరైనప్పటికీ.. వారిద్దరూ కేంద్ర ఎన్నికల కమిషనర్ ను భేటీ అయ్యారు. తాము చెప్పదలచుకున్నది చెప్పారు. రేపో, మాపో జగన్ సమరభేరి పేరుతో ప్రచార కార్యక్రమాలను చేపట్టబోతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉత్తరాంధ్రలో పర్యటించారు. వీటన్నింటినీ బేరీజు వేసుకుంటే రాష్ట్రం ఎన్నికల మూడ్ లోకి వచ్చేసినట్టే కనిపిస్తోంది.

ఇలా ఎవరి లెక్కల్లో వారు ఉంటే.. కాంగ్రెస్ సీనియర్ నాయకుల పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. వారంతా ఇతర పార్టీల వైపు దిక్కులు చూస్తున్నారు. ఏ పార్టీ అయినా తమను ఆహ్వానించకపోతుందా? అనే ఆశలో ఉన్నారు. సీనయర్లు, కేంద్రంలో మంత్రులుగా పని చేసిన వాళ్లంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ ను వీడటానికి రెడీ అవుతున్నారు. కేంద్ర మాజీ మంత్రులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కిశోర్ చంద్రదేవ్..అందరికంటే ఓ అడుగు ముందున్నారు. వాళ్లు ఇదివరకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ తో తనకు సంబంధం లేదని చెప్పకనే చెప్పారు. ఏ పార్టీలోనైనా చేరడానికి సిద్ధంగా ఉన్నామనే సందేశాన్ని పంపించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయం చేసిన పార్టీలో దూకేయడానికి రెడీగా ఉన్నారు.

కోట్ల డిమాండ్ కు టీడీపీలో పెద్దగా డిమాండ్ లేనట్టే..

కోట్ల డిమాండ్ కు టీడీపీలో పెద్దగా డిమాండ్ లేనట్టే..

కేంద్ర మాజీమంత్రి, కర్నూలు మాజీ లోక్ సభ సభ్యుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశంలో చేరుతారనే వార్తలు వినిపించినప్పటికీ.. సీట్ల కేటాయింపు వద్ద బేరం కుదరలేదని చెబుతున్నారు. కర్నూలు లోక్ సభ స్థానంతో పాటు పాణ్యం, డోన్, కర్నూలు, పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గాలను తనకు కేటాయించాలని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇటీవలే చంద్రబాబుకు ప్రతిపాదించారు. అన్ని సీట్లు కుదరవని, రెండు ఖాయంగా కేటాయిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. దీనితో కోట్ల కొండెక్కి కూర్చున్నారు. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీల నుంచి ఆహ్వానాలు ఉన్నాయని కోట్ల వెల్లడించారు. తనను కాదనుకుంటే.. ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతానని చంద్రబాబును బెదిరించడానికే కోట్ల ఈ ప్రకటన చేశారని తెలుస్తోంది.

ఇటీవలే కాంగ్రెస్పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ టీడీపీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏదైనా లోక్ సభ స్థానం గానీ లేదా రాజ్యసభ గానీ ఖాయం చేస్తే తాను పార్టీలో చేరుతానని కిశోర్ చంద్రదేవ్ టీడీపీతో మంతనాలు సాగిస్తున్నారని సమాచారం. ఇదివరకు ఆయన పార్వతీపురం, అరకు లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ తరఫున ప్రాతినిథ్యం వహించారు. 2014లో అరకు లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయారు. ఈ సారి పోటీ చేసినా ఫలితాల్లో పెద్దగా మార్పు ఉండదనే ధృఢ నిశ్చయానికి వచ్చారట కిశోర్ చంద్రదేవ్. అందుకే- ముందుగానే పార్టీకి రాజీనామా చేశారు.

కిల్లి కృపారాణి, పల్లంరాజు, చింతా మోహన్ కూడా..

కిల్లి కృపారాణి, పల్లంరాజు, చింతా మోహన్ కూడా..


వారిద్దరే కాదు- కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, కిల్లి కృపారాణి, చింతామోహన్ కూడా కాంగ్రెస్ నుంచి బయటపడటానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. తనకు వైఎస్ఆర్ సీపీ నుంచి ఆహ్వానం అందినట్టు ఇదివరకు కిల్లి కృపారాణి ఓ లీకు వదిలారు. దీనిపై ఆమె ఆశించినంతగా బజ్ రాలేదు. ఇక ప్రత్యామ్నాయంగా టీడీపీ వైపు చూస్తున్నారట. పల్లంరాజు పరిస్థితీ ఇంచుమించు అదే స్థితిలో ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో పల్లంరాజు కుటుంబానికంటూ కొంతమేర ఓటుబ్యాంకు ఉంది. ఈ ఓటుబ్యాంకును ఆధారంగా చేసుకుని పల్లంరాజును తమ పార్టీలో చేర్చుకోవాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సమయానికి కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యేలా కనిపిస్తోంది.

కాంగ్రెస్ లో కొనసాగడం అంటే రాజకీయ సన్యాసం తీసుకున్నట్టే..

కాంగ్రెస్ లో కొనసాగడం అంటే రాజకీయ సన్యాసం తీసుకున్నట్టే..

ఇలా సీనియర్లందరూ తలోదారి చూసుకోవడానికి కారణాలు లేకపోలేదు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ, కేంద్ర మంత్రులుగా పనిచేసిన ఆయా నాయకులందరూ మరోసారి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలని ఆశిస్తున్నారు. కాంగ్రెస్ లోనే ఉంటే అది సాధ్యమయ్యే పని కాదు. విభజన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితేమిటనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. విభజన చోటు చేసుకున్న అయిదేళ్ల తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ స్థితిగతుల్లో ఎలాంటి మార్పూ రాలేదు. మార్పు తీసుకుని రావడానికి చేసిన ప్రయత్నాలు కూడా నామమాత్రమే.

దీనితో పార్టీపై విరక్తి చెందిన సీనియర్లు ఇతర పార్టీల నుంచి ఆహ్వానాల కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ లో ఉండటమా? లేక ఇతర పార్టీల్లో చేరి, క్రియాశీలకంగా ఉండటమా? అనేది వారి ముందున్న మార్గాలు. ఇందులో దశాబ్దాలుగా అనుబంధాన్ని పెంచుకున్న కాంగ్రెస్ ను వీడటానికే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ లో కొనసాగడం అంటే రాజకీయ సన్యాసం తీసుకున్నట్టేననే భావనలో ఉన్నందు వల్లే ఇతర పార్టీల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ సారి ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే.. జనం మరిచిపోతారనే భయాందోళనలు వారిలో వ్యక్తమౌతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్..ఎన్నికలను ఎలా ఎదుర్కొంటుదనేది ఆసక్తికరమే.

English summary
congress senior leaders and former union ministers from andhra pradesh are ready to quit and looking opportunities in other parties
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X