తప్పు తప్పే.. ఎంతటివారైనా సరే ఉపేక్షించేది లేదు.. అనంతబాబు అరెస్ట్‌పై వనిత
డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు విషయంలో ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేసు విషయంలో ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డి నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకున్నారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. కానీ ప్రతిపక్ష నాయకులు రాజకీయలబ్ది కోసం వాడుకోవాలని చూస్తున్నారని పైరయ్యారు.

అప్పుడు ఏం చేశారు...
బాలకృష్ణ కాల్పుల విషయం, బోండా ఉమా కుమారుడు చేసిన ఆక్సిడెంట్, కర్నూల్లో వైస్సార్సీపీ నాయకుడు నారాయణరెడ్డి హత్య విషయంలో కేఈ హస్తం ఎంత ఉందో ప్రజలందరికీ తెలుసు అని చెప్పారు. ఆ రోజు టీడీపీ ప్రభుత్వం హంతకుల పక్షాన నిలబడిందని ధ్వజమెత్తారు. సీఎం జగన్ పేదలు, బడుగుబలహీన వర్గాలు, దళితులు, న్యాయం పక్షాన నిలబడ్డారని చెప్పారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్సీ అనంతబాబు ను అరెస్ట్ చేశామని వివరించారు.

నిష్పక్షపాతంగా...
నిష్పక్షపాతంగా ప్రభుత్వం, సీఎం జగన్ పనిచేస్తున్నారని అనడానికి ఇదే నిదర్శనం అని వివరించారు. జగన్ కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా పాలన అందిస్తున్నారని చెప్పారు. న్యాయం, చట్టం విషయంలో కూడా ముఖ్యమంత్రి తన మన బేధం లేకుండా తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు పై చర్యలు తీసుకోవడంతోపాటు, పేదలు, దళితుల పక్షాన సీఎం జగన్ నిలబడ్డారని చెప్పారు. ప్రతిపక్ష టీడీపీకి మాట్లాడడానికి కూడా అర్హత లేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఎలాంటి అన్యాయాలు జరిగాయి. ఇప్పుడు ఎలాంటి న్యాయం జరుగుతోందని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ఆమె సూచించారు.

14 రోజుల రిమాండ్
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు జడ్జీ 14 రోజుల రిమాండ్ విధించారు. వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జీ ముందు ప్రవేశపెట్టారు. కేసు విచారించిన జడ్జి.. అనంతబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే ఎసపీ ఆఫీసుకు కూడా వెళ్లారు. అనంతబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నెల 19న డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు చంపి మృతదేహాన్ని కారులో ఉంచి వదిలి వెళ్లాడు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.