అమరావతి శంకుస్థాపనకు నేటితో ఐదేళ్ళు... నాడు రైతుల హర్షం .. నేడు కన్నీటి వర్షం
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అయిదేళ్ల క్రితం దేశమంతా విజయదశమి వేడుకలు నిర్వహించుకుంటున్న వేళ ఇదే రోజున అమరావతి పేరుతో కొత్త రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పునాదిరాయి పడింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం నుంచి విభజన జరిగిన తర్వాత ఏర్పడిన టిడిపి ప్రభుత్వం రాజధాని అమరావతిని అంతర్జాతీయంగా గుర్తించే విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా నిర్మించాలని సంకల్పించింది. అందుకోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేసింది.

రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములను ఇచ్చిన రైతులు
నాడు సాగు భూములను ప్రభుత్వానికి ఇవ్వడానికి ముందు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న రైతులు తరువాత రాజధానిగా తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్న భావనతో భూములను ఇచ్చారు. రైతులను ఒప్పించిన నాటి ప్రభుత్వం భూ సమీకరణ చేయడంలోనూ చాలా కష్టపడింది. చివరకు రెండు నెలల్లోనే 29 వేల మందికిపైగా రైతులతో 34 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం అయ్యేలా చేశారు. నాలుగేళ్ల కాలంలో రాజధాని భూ సమీకరణ తోపాటుగా ప్రణాళికలు సిద్ధం చేయడం అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు తదితర భవనాలకు డిజైన్స్ పూర్తిచేసి, నిర్మాణాలను కూడా యుద్ధ ప్రాతిపదికన సాగించారు. ప్రస్తుతం వెలగపూడిలో సచివాలయం, శాసనసభ, హైకోర్టు కార్యకలాపాలను కూడా నిర్వహిస్తున్నాయి.

నేటితో రాజధాని శంకుస్థాపన జరిగి ఐదేళ్ళు ... ఇదే రోజు అమరావతికి ప్రధాని మోడీ
నాడు శంకుస్థాపన రోజు మట్టి, నీళ్లు తీసుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని అమరావతి గురించి దేశంలో పట్టణీకరణ దిశగా కొత్త అడుగుకు ఆంధ్రప్రదేశ్ అమరావతి మార్గదర్శి గా నిలుస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాడు సీఎంగా చంద్రబాబు నాయుడు, అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా నిర్మిస్తామని రాజధానిగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు అమరావతి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రజాతీర్పుతో ఏపీలో ప్రభుత్వం మారింది.
ఒక రాష్ట్రం ఒకే రాజధాని.. వైఎస్ జగన్ అమరావతిలో గడ్డి కూడా పీకలేడు : చంద్రబాబు, లోకేష్ ఫైర్

మూడు రాజధానుల నిర్ణయంతో కన్నీటిపర్యంతం అవుతున్న రైతులు
ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసిపి మూడు రాజధానులలో పాలన అంశాన్ని తెర మీదకు తీసుకు రావడమే కాకుండా, పరిపాలన రాజధానిని , అమరావతి నుండి వైజాగ్ కు తరలించాలని నిర్ణయం తీసుకుంది.
అప్పటి నుండి రాజధాని ప్రాంత రైతుల ఆవేదన అరణ్య రోదనగా మారింది. సాగు చేసుకుంటున్న భూములకు రాజధాని అభివృద్ధి కోసం పాలకులకు అప్పగించిన రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ ప్రాంతం నుండి పరిపాలనా రాజధానిని వైజాగ్ కు తరలించడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాటి నుండి నేటి వరకు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు.

భూములు ఇవ్వటం మేం చేసిన నేరమా అని ప్రశ్నిస్తున్న రైతులు
సీఎం జగన్ మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, రాజధాని అమరావతి కోసం నాడు మట్టి నీళ్ళు తీసుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తమ నిరసనను నిత్యం తెలియజేస్తూనే ఉన్నారు.రాజధాని అమరావతి ప్రాంతం ముంపు ప్రాంతమని, అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, టిడిపి పాలన సమయంలో అవినీతి అక్రమాలకు అమరావతి అడ్డాగా మారిందని పేర్కొంటూ వైసీపీ పరిపాలనా రాజధానిగా వైజాగ్ లో ఏర్పాటు చేయాలని అడుగులు వేస్తూ ఉండడం రాజధాని ప్రాంత రైతులకు ఏమాత్రం రుచించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గొప్ప రాజధాని నగరం కావాలని భూములు ఇవ్వడం మేము చేసిన నేరమా అని ప్రశ్నిస్తున్నారు రైతులు.

నేడు నిరసనలకు శ్రీకారం ...ఐదేళ్ళ క్రితం ఇదే రోజు ఆనందం .. ఇప్పుడు తీరని ఆవేదన
పార్టీల రాజకీయాల కోసం తమను ఇబ్బంది పెడతారా అని ప్రశ్నిస్తున్నారు. నాడు ఇచ్చిన భూములను, అదే విధంగా తమకు తిరిగి ఇస్తే సాగు చేసుకునేవారిమని, రోడ్లు వేసి, బీడు పెట్టి ఇప్పుడు ఎటూ కాకుండా చేస్తే, రాజధాని నగరం కూడా లేకుండా చేస్తే తమ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. రాజధానిగా అమరావతి శంకుస్థాపన జరిగినా నేటికి ఐదేళ్ళు కావడంతో ప్రభుత్వాన్ని వినూత్న నిరసనలతో నిలదీయడానికి సిద్ధమవుతున్నారు రాజధాని ప్రాంత రైతులు.
ఐదేళ్ళ క్రితం ఇదే రోజు ఆనందంతో ఉన్న రైతులు ఇప్పుడు తీవ్ర ఆవేదనలో ఉన్నారు .