అమరావతి రాజధాని రైతులకు శుభవార్త!
అమరావతి రాజధాని రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కౌలు చెల్లింపునకు సంబంధించి ఇప్పటివరకు రైతులకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. వీరికి కౌలు చెల్లించేందుకు జగన్ సర్కారు ముందుకు వచ్చింది. ఎప్పటి నుంచి పెండింగ్లో ఉంది.. ఎప్పటివరకు చెల్లించాలి అనే వివరాలను ఆర్థిక శాఖ నుంచి తెప్పించుకొని ఆ ఫైలును ముఖ్యమంత్రి క్లియర్ చేశారు.
రేపో, ఎల్లుండో రైతులకు కౌలు చెల్లించాలంటూ కోర్టు నుంచి తీర్పు రాబోతోంది. ఆ తీర్పు రాకముందే ప్రభుత్వం అప్రమత్తమైందని రైతులు చెబుతున్నారు. గతంలో కూడా ఇలాగే కౌలు చెల్లింపునకు సంబంధించి జాప్యం జరిగితే కోర్టును ఆశ్రయించామని, ఇప్పుడు కూడా ఆశ్రయించగా అప్రమత్తమైన అధికారులు రూ.184 కోట్లు చెల్లించడానికి ముందుకు వచ్చినట్లు వెల్లడించారు.

అన్నదాతలకు వార్షిక కౌలు విడుదలకు సంబంధించి సీఆర్డీఏ నిధులు సమకూర్చుకుంది. వీటిని రెండువిడతల్లో చెల్లించనున్నారు. 208 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి విడతగా 184 కోట్ల రూపాయలను కేటాయించగా, 23 వేల మంది రైతులకు ఈ నెల 27 న 112 కోట్ల రూపాయలు చెల్లించబోతోంది. మిగిలిన 72 కోట్లు కూడా విడుదల కావడంతో మొత్తం 184 కోట్ల రూపాయలు చెల్లించేలా రైతుల ఖాతాలకు ప్రభుత్వం నగదు జమచేసింది.
గత ఏడాది రూ.195 కోట్లకు బడ్జెట్ విడుదల చేయగా, రూ.188 కోట్లు అన్నదాతలకు చెల్లించారు. వివాదాల్లో ఉన్న భూములకు, అసైన్డ్ భూములకు, కోర్టు విచారణలో ఉన్న భూములకు ఈ చెల్లింపుల నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రతి సంవత్సరం రైతులకు వార్షిక కౌలు మే నెల మొదటివారంలో చెల్లించాల్సి ఉంటుందని, కానీ మూడు సంవత్సరాలుగా ఆలస్యమవుతూనే ఉందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.