మంచి ప్యాకేజీ ఇచ్చామే.. ఉద్యోగులతో సజ్జల.. చలో విజయవాడ బల ప్రదర్శన అంటూ..
ఏపీలో పీఆర్సీ రగడ కొనసాగుతూనే ఉంది. పీఆర్సీ జీవో ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు 'ఛలో విజయవాడ' కార్యక్రమం చేపట్టారు. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పీఆర్సీని ఏ విధంగా రూపొందించారో ప్రభుత్వం వివరించిందని, ఉన్నంతలో మంచి ప్యాకేజీ ఇచ్చామని తెలిపారు. ఉద్యోగులను రోజూ చర్చలకు పిలుస్తున్నా, స్పందన లేదని ఆరోపించారు. బల ప్రదర్శన చేయడం వల్ల సమస్య జటిలం అవుతుందని అన్నారు. ఇవాళ్టి ప్రదర్శనతో, 6వ తేదీ అర్ధరాత్రి నుంచే పట్టే సమ్మెతో ఉద్యోగులు ఏం సాధిస్తారో అర్థం కావడం లేదన్నారు.
గత ప్రభుత్వంలో లేని ఉద్యోగ భద్రతను తాము కల్పించామని అన్నారు. కరోనా వ్యాప్తి వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మారిందో అందరికీ తెలుసున్నారు. సంక్షేమానికి కూడా నిధులు అవసరమైన పరిస్థితి తలెత్తిందన్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు సీఎం జగన్ పై మాట్లాడుతున్న తీరు సరిగాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వేలమంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తున్న సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. టీచర్లకు ఏడెనిమిది విషయాల్లో తాము ఉపకారం చేశామని సజ్జల చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాకే స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు వచ్చినట్టు ఉపాధ్యాయులే చెప్పారని వెల్లడించారు.

ఉద్యోగులు వేలాదిగా విజయవాడ చేరుకున్నారు. నిరసన కార్యక్రమాన్ని చెప్పినట్టుగా ముగించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే, ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామని తేల్చి చెప్పారు. ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేసిన ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నిర్బంధాల మధ్య కూడా లక్ష మంది విజయవాడ వచ్చారని వెల్లడించారు.
ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దయ్యేవరకు ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించింది బల ప్రదర్శన కోసం కాదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఉద్యోగుల వేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే తమ ఉద్దేశమని తెలిపారు. ఈ నెల 5 నుంచి పెన్ డౌన్ ఉంటుందని, 6వ తేదీ అర్ధరాత్రి నుంచి పూర్తిగా సమ్మెలోకి వెళతామని వెల్లడించారు.