తీపికబురు: అగ్రవర్ణ పేదలకు రూ.15 వేలు.. ఈబీసీ నేస్తం
ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణ మహిళలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళలకు ఆర్థికంగా చేయూత ఇవ్వనుంది. ఈ నెల 25వ తేదీ నుంచి ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. రూ.580 కోట్లు విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 45 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు. పథకంలో భాగంగా ప్రతి ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేల ఆర్థిక సాయం అందనుంది.
వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తంలో ఉన్న లబ్ధిదారులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలు ఈ పథకానికి అనర్హులు కారు. కేవలం ఈబీసీ మహిళలు మాత్రమే అర్హులు. అంతేకాదు లబ్ధిదారుల పేరుతో ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉండాలి. వార్షిక కుటుంబ ఆదాయం గ్రామాల్లో అయితే నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో నెలకు రూ. 12 వేలు పరిమితిని మించకూడదు. ఈ పథకంలో లబ్ధిదారులకు మాగాణి భూమి 3 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి లేదా మెట్ట భూమి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి. లేదంటే మాగాణి, మెట్ట భూమి రెండూ కలిపి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి.

అంతేకాదు కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి గాని, పెన్షనర్ గాని ఉండకూడదు. ఈ నిబంధనలో పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇచ్చారు. కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా ఫోర్ వీలర్ ఉండకూడదు. కుటుంబంలో ఎవరూ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు ఉండకూడదు. అలా అయితే రూ. 15 వేల సాయం అందనుంది. అగ్రవర్ణాల్లో గల పేదల కోసం ఈ స్కీమ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
ఇటు ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్దపడుతుండగా.. మరోవైపు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం జగన్ సర్కార్ చేస్తోంది. పలు పథకాలను ప్రవేశపెట్టి ముందుకు సాగుతుంది. ప్రతిపక్షాలు మాత్రం జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే ఉన్నాయి.