తిక్కారెడ్డిపై హత్యాయత్నం ఏంటీ..? జగన్ సర్కార్‌పై లోకేశ్ నిప్పులు
ఏపీ సర్కార్ తీరును మరోసారి తప్పుపట్టారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. టీడీపీ నేతలు/ శ్రేణులపై దాడుల పరంపర కొనసాగుతుందన్నారు. ఇదీ మంచి పద్దతి కాదన్నారు. తమ పార్టీకి చెందిన నేతలను బెదిరించడం.. వారు వినకుంటే దాడులు చేయించడం ఏంటీ అని అడిగారు. గతంలో ఇలా ఉండేదా అని నిలదీశారు. కొత్త సంస్కృతిని జగన్ సర్కార్ తెరపైకి తీసుకొచ్చిందని వివరించారు. ఇకనైనా వైసీపీ తీరు మారాలని ఆయన అభిలషించారు.
వైసీపీ నేతలపై మరోసారి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. జగన్ ప్రజాస్వామ్యాన్ని ఫ్యాక్షన్ కత్తికి బలిస్తున్నారని విమర్శించారు. కర్నూలు జిల్లాలో జాతరకు హాజరైన టీడీపీ సీనియర్ నేత తిక్కారెడ్డిపై వైసీపీ ఫ్యాక్షన్ మూకలు హత్యాయత్నానికి పాల్పడ్డాయని ఆరోపించారు. ఈ ఘటనను తమ పార్టీ ముక్తకంఠంతో ఖండిస్తోందని తెలిపారు. గతంలోనూ తిక్కారెడ్డిపై రెండుసార్లు హత్యాయత్నం జరిగిందని, కానీ పోలీసులు కనీస భద్రత కల్పించకపోవడం పలు అనుమానాలు కలిగిస్తోందని అన్నారు.

దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, టీడీపీ నేత తిక్కారెడ్డికి భద్రత కల్పించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. కత్తిని నమ్ముకున్నవాడు కత్తికి బలవ్వక తప్పదని చరిత్ర చెబుతోందని నారా లోకేశ్ అన్నారు. ఈ సత్యాన్ని వైసీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. అలా కాదు.. తాము అధికారంలో ఉన్నామని విర్రవీగొద్దని సూచించారు. ఇవాళ అధికారం మీదయితే.. రేపు తమదనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.
ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ప్రతిపక్ష నేతలను హతమార్చడానికా? అంటూ సీఎం జగన్ పై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవ చేయాలని ఎన్నుకుంటే ఇలా చేయడం సరికాదన్నారు. బాధ్యతగా ఉండాల్సిన మీరు ఫ్యాక్షన్ రాజకీయాలను వదులుకోకపోవడం మీలోని మానసిక రుగ్మతను బయటపెడుతోందని లోకేశ్ కామెంట్ చేశారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని ఆయన సూచించారు. లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. సమయానికి అనుగుణంగా అన్నీ జరుగుతాయని పేర్కొన్నారు. ఇప్పుడు ఇలా వీర్రవీగడం సరికాదని చెప్పారు. గతంలో అధికారంలో ఉన్నవారు ఇలా బీహెవ్ చేయలేదని చెప్పారు.