లక్ష్మీనారాయణ అనూహ్య నిర్ణయం, 26న కొత్త పార్టీ: అందరికీ భిన్నంగా అవే కీలకం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రాబోతుంది. కొద్ది నెలల క్రితం వీఆర్ఎస్ తీసుకున్న ఐపీఎస్ అధికారి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ త్వరలో పార్టీ పెట్టబోతున్నారట. ఈ మేరకు మరో మూడు రోజుల్లో ఆయన తన పార్టీ, పార్టీ అజెండా తదితర అంశాలను మీడియాకు వివరించనున్నారు. ఈ పార్టీ అన్నింటికి భిన్నంగా ఉండనుంది.
తనకు ఏ రాజకీయ పార్టీతోను సంబంధాలు లేవని లక్ష్మీనారాయణ ఉదయం తనను కలిసిన మీడియాతో చెప్పారు. ఇకపై కూడా ఇలాగే ఉంటానని అన్నారు. తాను స్వతంత్రంగా రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. ప్రజల సమస్యకు పరిష్కారం మార్గం వెతకడమే తనకు ముఖ్యమని చెప్పారు. పాలకులు సమర్థవంతంగా పాలన అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
2019లో నేనే.. ఏపీ సీఎంగా పోరాడబోతున్నా: తెలంగాణ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో చెప్పిన పవన్!

26న ముహూర్తం ఖరారు
నవంబర్ 26వ తేదీన లక్ష్మీనారాయణస్వయంగా పార్టీ గురించి ప్రకటన చేయనున్నారు. ఆ రోజున ఆయన తన పార్టీ గురించి స్వయంగా వివరిస్తారు. లక్ష్మీనారాయణ సీబీఐ జాయింట్ డైరెక్టర్గా... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుతో తెలుగు రాష్ట్రాల్లో అందరి నోళ్లలో నానారు.

నిజాయితీ కలిగిన అధికారి
నిజాయితీ కలిగిన అధికారిగా లక్ష్మీనారాయణ పేరు తెచ్చుకున్నారు. జగన్ కేసుతో పాటు సత్యం కంప్యూటర్స్, గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ అక్రమాల కేసును ఆయన దర్యాఫ్తు చేశారు. మూడు కీలక కేసులు నిజాయితీ అధికారిగా పేరు తెచ్చుకున్న లక్ష్మీనారాయణకు అప్పగించడం, ఆయన వీటిని విచారించడం అప్పుడు సంచలనంగా మారింది.

రైతులతో మమేకం
అధికారిగా ఉన్నప్పుడే ఆయన గ్రామీణ సమస్యలు, రైతు సమస్యలపై అధ్యయనం చేశారు. ఆ తర్వాత కొద్ది నెలల క్రితం పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయా జిల్లాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి, రైతులతో మమేకమయ్యారు. వారి సమస్యలు, ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాను టిట్లీ తుఫాను వణికించింది. తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఆయన పర్యటించారు. అనంతరం బాధితుల సమస్యల పరిష్కారానికి స్వల్ప, దీర్ఘకాలంలో చేపట్టాల్సిన చర్యలపై సీఎంకు నివేదిక ఇచ్చారు.

అనూహ్య నిర్ణయం తీసుకున్న లక్ష్మీనారాయణ
ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తుండటంతో ఏదో పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతూ వస్తోంది. ఓ జాతీయ పార్టీలో చేరుతారని ఓసారి, చాలామంది ఆయన బీజేపీలో చేరుతారని భావించారు. అలాగే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో చేరుతారనే ప్రచారం కూడా సాగింది. ఆయన టీడీపీకి అనుకులంగా ఉన్నారనే ప్రచారమూ ఉంది. ఆయనకు పలు పార్టీల నుంచి ఆహ్వానం కూడా వెళ్లింది. కానీ ఆయన ఏ పార్టీలో చేరడం లేదని తేల్చి చెప్పారు. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

అందరి కంటే భిన్నంగా ఈ పార్టీ
ఈ ఊహాగానాలకు లక్ష్మీనారాయణ ఇప్పుడు చెక్ చెప్పారు. తానే సొంతగా పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలు ప్రధాన అజెండాగా ఉండనుందని తెలుస్తోంది. లక్ష్మీనారాయణ శ్రీశైలంలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. వరంగల్ ఆర్ఈసీలో ఇంజినీరింగ్ చేశారు. చెన్నై ఐఐటీలో ఎంటెక్ చేశారు. 1990 ఐపీఎస్ బ్యాచ్ అధికారి.