హోదా గురించి అడగండి.. జిన్నా పేరేనా..? బీజేపీ నేతలపై సాయిరెడ్డి ఫైర్
జిన్నా టవర్ అంశంపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. ఏపీ బీజేపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. వారివి మరుగుజ్జు ఆలోచనలని మండిపడ్డారు. చీప్ లిక్కర్ వ్యాఖ్యలతో కలిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు చవకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలను విమర్శించారు. గుంటూరు జిన్నా టవర్, వైజాగ్ కేజీహెచ్ పేర్లను మార్చాలని డిమాండ్ చేసే బదులు, ప్రత్యేక హోదాతో పాటు పోలవరం నిధుల కోసమో లేక వైజాగ్ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వద్దనో తమ జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తెస్తే మంచిదని ఏపీ బీజేపీ నేతలకు విజయసాయి రెడ్డి హితవు పలికారు.
వైజాగ్ లోని కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరులో కింగ్ ఎవరు? జార్జ్ ఎవరు?... అని ప్రశ్నించిన బీజేపీ నేతలు ఆ పేరు మార్చాల్సిందే అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే గుంటూరులోని టవర్ కు దేశద్రోహి జిన్నా పేరును పెడతారా?... అంటూ మండిపడ్డారు. జిన్నా టవర్ పేరు మార్చాలని డిమాండ్ చేశారు. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

అంతకుముందు ప్రభుత్వం స్పందించింది. జిన్నాటవర్‌పై ఇప్పుడు ఏదో ఆశించి కామెంట్ చేయటం మంచి పద్ధతి హోం మంత్రి సుచరిత అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని, అన్ని కులాలు, మతాల వారు కలిసి మెలిసి సోదరభావంతో మెలుగుతున్నారని చెప్పారు. స్వాతంత్రానికి పూర్వం ఎంతో మంది మన దేశాన్ని పాలించారని, అప్పటి పరిస్థితులు, త్యాగాలను బట్టి అనేక నిర్మాణాలు జరిగాయని సుచరిత తెలిపారు.
బీజేపీ జాతీయ స్థాయి నేత సత్యకుమార్ ఆజ్యం పోశారు. ఆయన గుంటూరు జిన్నా టవర్‌పై చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. గుంటూరులో ఉన్న జిన్నా టవర్ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన బీజేపీ నేత సత్య కుమార్.. 'ఈ టవర్‌కు జిన్నా పేరు మీద నామకరణం చేశారు. అంతేకాకుండా ఈ ఏరియాను జిన్నా సెంటర్‌గా పిలుస్తారు. ఇది ఉంది పాకిస్థాన్‌లో కాదు, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో. దేశ ద్రోహి అయిన అలీజిన్నా పేరును ఇంకా టవర్‌కు కొనసాగిస్తున్నారు. ఈ టవర్‌కు భరత మాత ముద్దు బిడ్డ అయిన అబ్దుల్ కలాం పేరో, దళిత రచయిత గుర్రం జాషువా పేరు ఎందుకు పెట్టరు.? ఒక సూచనగా చెబుతున్నాను' అంటూ రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అదీ అగ్గిరాజేసింది. దీనిపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతుంది.